సాక్షి, అమరావతి బ్యూరో : ‘మూడు పూటలా తినేందుకు స్తోమత లేని కుటుంబం నుంచి వచ్చిన నాకు జగనన్న బాపట్ల ఎంపీ టిక్కెట్ ఇవ్వడం ఇప్పటికీ కలగానే ఉంది. ఆ విషయం నమ్మలేకపోయాను. తప్పుడు కేసులు పెట్టి పోలీసులు చిత్రహింసలకు గురిచేసినప్పుడు ఒక దశలో చనిపోదామా! అనుకున్నా. అప్పుడు జగనన్నే అండగా ఉండి ధైర్యం చెప్పి సొంత తమ్ముడిలా ఆదరించారు. నాకు ఏకంగా వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం కల్పించారు.
కొన్నాళ్ల క్రితం వరకూ ఎవరైనా నాయకులు కనిపిస్తే సెల్ఫీ కావాలని అడిగేవాడిని. ఇప్పుడు పలువురు సెల్ఫీ కావాలని నన్ను అడుగుతుంటే ఈ జన్మకిది చాలనిపిస్తుంది. వైఎస్ జగన్‌కు దళితుల పట్ల ఎంత ప్రేమ ఉందో చాటిచెప్పేందుకు నా సంఘటనే ఉదాహరణ’ అని బాపట్ల నుంచి వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నందిగం సురేష్ చెప్పారు. ఆయన తన అంతరంగాన్ని సాక్షితో పంచుకున్నారు.
వైఎస్ అంటే అభిమానం
‘‘మాది గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం ఉద్దండరాయునిపాలెం. మా తల్లిదండ్రులు పౌలు, సంతోషమ్మలు. మేం ఐదుగురు పిల్లలు.. పేద కుటుంబం కావడంతో స్తోమత లేక నన్ను, మా అన్నయ్యను చదువు కోసం బంధువులు పనిచేసే ఎస్సీ హాస్టల్లో చేర్పించారు. పది చదివాక.. ఆర్థిక ఇబ్బందులతో మధ్యలోనే చదువు ఆపేశాను. పూట గడవడం కోసం అన్నయ్యతో కలిసి కూలి పనులకు వెళ్లేవాడిని.
ఫొటోగ్రఫీ నేర్చుకుని ఫొటోలు తీస్తూ వచ్చే కొద్దిపాటి డబ్బులతో నెట్టుకొచ్చేవాడిని. తరువాత రియల్ ఎస్టేట్‌లో కమిషన్ వ్యాపారం చేసి కొంత నిలదొక్కుకున్నా. మహానేత వై.ఎస్.రాజశేఖరరెడ్డి పుణ్యాన ఇందిరమ్మ ఇల్లు కట్టుకున్నాం. రెండున్నర ఎకరాల పొలంపై తీసుకున్న రుణాలు రూ.4 లక్షలకు చేరడంతో.. పొలం అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సమయంలో మళ్లీ మహానేత దయవల్ల రుణమాఫీ జరగడంతో పొలం మిగిలింది. రాజశేఖరరెడ్డి అంటే నాకు పిచ్చి అభిమానం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏర్పాటు చేశాక ఆ పార్టీ జెండాలు పట్టుకుని ప్రచారం చేశాను.
చిత్రహింసలు పెట్టారు..
రాజధాని ప్రాంతంలో దుండగులు అరటి తోటను తగులపెట్టినప్పుడు మంగళగిరి రూరల్ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి చిత్రహింసలు పెట్టారు. డబ్బులిస్తాం.. జగన్‌మోహన్‌రెడ్డే పంట పొలాలు తగులబెట్టమన్నారని చెప్పాలంటూ హింసించారు. కాలుస్తామని బెదిరించారు. కాళ్లతో తన్నారు. బట్టలు విప్పించి చిత్రహింసలకు గురిచేశారు. ఓ దశలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా. పిల్లలు గుర్తొచ్చి ఆగిపోయా. నన్ను జైల్లో పెట్టారన్న విషయం తెలిసి పలకరించేందుకు, ఫోను చేసేందుకు మా ఊర్లో అంతా భయపడ్డారు. స్టేషన్ నుంచి ఇంటికెళ్లేసరికి మా పిల్లలు, అన్న పిల్లలు పలక మీద డాడీ వెల్‌కమ్ అని రాసుకుని నిద్రపోవడం చూసి ఏడుపొచ్చింది.
ఏం కావాలో చెప్పబ్బా! అన్నారు
ఆ సమయంలో జగనన్న నాకు పూర్తి అండగా నిలబడ్డారు. 47 మంది ఎమ్మెల్యేల్ని మా ఇంటికి పంపారు. వారంతా నన్ను ఓదార్చి అండగా ఉంటామన్నారు. వైఎస్ జగన్ మా ఊరు వచ్చినప్పుడు నన్ను స్టేజీపైకి పిలిచి ఏం జరిగిందని అడిగారు. పోలీసులు ఎలా చిత్రహింసలకు గురిచేశారో చెప్పా. ఆ సమయంలో జగనన్న కళ్లల్లో బాధ, ఆవేదనను చూశాను. నీకు నేనున్నా. నువ్వు నా తమ్ముడివి అంటూ భరోసా ఇచ్చారు. ఆయన ల్యాండ్ లైన్ నంబరు, పీఏ ఫోన్ నంబరు ఇచ్చి ఏ అవసరమొచ్చినా ఫోన్ చేయమని చెప్పారు. ఆ తర్వాత నేను జగనన్నను కలిసినప్పుడు.. ‘‘ఏం కావాలో చెప్పబ్బా’’ అని అడిగారు. అన్నా నాకేమీ వద్దు.. మీరు సీఎం అయ్యేవరకు మీ వెంటే తిరుగుతానన్నాను. సీఎం అయ్యాక ప్రెస్‌మీట్ పెట్టినప్పుడు మీ వెనుక పెట్టుకోండి చాలన్నా. సీఎం పక్కన కూర్చున్నాడని మా ఊరోళ్లు అనుకుంటే చాలని చెప్పా. న్యాయంగా పోరాడేవారికి అన్యాయం జరగకూడదు. నేనున్నా అని జగనన్న నాతో అన్నారు’’
గొప్ప వ్యక్తిత్వం
ఒకసారి జగనన్న నన్ను పిలిచి పార్లమెంట్‌కు పోటీ చేయాలని చెప్పారు. అన్నా.. అనుభవం లేదు.. డబ్బులు లేవు అన్నా. ‘‘అవన్నీ వదిలేయ్! నేను చూసుకుంటా. అనుభవం దానంతటదే వస్తుంది’’ అని చెప్పారు. నాకు ఎంపీ సీటును ఖరారు చేశాక నోటిమాట పెగల్లేదు. కళ్లంట నీళ్లు వచ్చాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి ఆదినారాయణరెడ్డి, వర్ల రామయ్య, చింతమనేని దళితుల్ని కించపరుస్తూ మాట్లాడారు. ఒక సామాన్యుడికి జగనన్న ఎంపీ సీటిచ్చి అరుదైన గౌరవం కట్టబెట్టారు. నాతో అభ్యర్థుల జాబితా చదివించారు. నన్ను విమర్శించిన వారందరికీ నేను ఒకటే విషయం చెప్పా.. జగన్‌మోహన్‌రెడ్డి మానవత్వం గల మనిషి, దళితుల పట్ల ప్రేమ ఉన్న వ్యక్తి కాబట్టి ఇంత గౌరవం ఇచ్చారని చెప్పాను.
– ఓబులరెడ్డి వెంకట్రామిరెడ్డి, సాక్షి, అమరావతి బ్యూరో
Comments
Please login to add a commentAdd a comment