నిలువెత్తు నమ్మకం.. | YS Jaganmohan Reddy Is A Great Warrior Like YS Rajashekar reddy | Sakshi
Sakshi News home page

నిలువెత్తు నమ్మకం..

Published Wed, Apr 10 2019 7:53 AM | Last Updated on Wed, Apr 10 2019 8:11 AM

YS Jaganmohan Reddy Is A Great Warrior Like YS Rajashekar reddy - Sakshi

సాక్షి, అమరావతి : చారిత్రక సందర్భం రానే వచ్చింది.. రాష్ట్ర దశాదిశను మార్చే కీలక ఎన్నికల్లో ప్రజలు తీర్పు చెప్పే సమయం ఆసన్నమైంది. ఐదేళ్ల అనుభవాలను విశ్లేషిస్తూ.. ప్రభుత్వ పాలనను సమీక్షిస్తూ.. ప్రతిపక్షం నిర్వర్తించిన బాధ్యతను గుర్తిస్తూ.. ప్రజలు తమ తుది నిర్ణయం తీసుకోవాల్సిన కీలక తరుణమిది. మరో ఐదేళ్లపాటు రాష్ట్ర ప్రగతిని నిర్దేశించే ఆయుధం ప్రజల చేతుల్లోనే ఉంది. ఓటరు తన స్వీయ విచక్షణ ద్వారా విలువైన ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన తరుణం ఇది.. ఐదు కోట్ల ఆంధ్రులభవిష్యత్‌ను నిర్ణయించే ఓటరు ముందు.. ఇప్పుడు రెండే రెండు అవకాశాలున్నాయి... ఒకరు, చంద్రబాబు... మరొకరు వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. 


చంద్రబాబు 2014 ఎన్నికల్లో 650కుపైగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఐదేళ్ల పాలనలో ఒక్కహామీ కూడా పూర్తిగా నెరవేర్చకుండా.. మరోసారి ప్రజల తీర్పు కోరుతున్నారు. విశ్వాసఘాతుకం.. మాటలు మార్చే నైజం.. రాష్ట్ర ప్రజలు, ప్రగతిపట్ల నిబద్ధత లేకపోవడం.. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే తత్వం.. స్వార్థ రాజకీయాలతో నిత్యం వంచన.. అవినీతికి కేరాఫ్‌గా నిలిచిన చంద్రబాబు ఓవైపు ఉంటే.. 
మరోవైపు వైఎస్‌ జగన్‌ ఉన్నారు... ఆరునూరైనా ఇచ్చిన మాటకు కట్టుబడేతత్వం.. విలువలతో కూడిన రాజకీయాలు.. ప్రజల శ్రేయస్సు పట్ల అంకితభావం.. విశ్వసనీయతకు మారుపేరుగా నిలవడం.. రాష్ట్ర ప్రగతి
పట్ల దార్శనికత..సంక్లిష్ట పరిస్థితుల్లో రాజనీతిజ్ఞత ప్రదర్శించడం.. స్థిరమైన విధాన నిర్ణయాలు తీసుకోగల సత్తా.. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమన్న పరిణతి.. కష్టాలకు ఎదురొడ్డే తెగింపు... నిజాయితీ, నిబద్ధతతో ప్రజల్లోనే ఉండటం.. మానవీయత నింపుకున్న నాయకత్వ లక్షణాలతో అలుపెరగకుండా ప్రజాపోరాటాలు చేస్తున్న ధీరోదాత్త నాయకుడు..

మాట తప్పని తత్వం.. మడమ తిప్పని నైజం

విశ్వసనీయత...

విశ్వసనీయతనే ఇరుసుగా చేసుకొని వైఎస్‌ జగన్‌ రాజకీయ ప్రస్థానం సాగిస్తున్నారు. తనను నమ్ముకున్నవారికి తప్పకుండా న్యాయం చేసే గుణాన్ని తన తండ్రి దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి నుంచి పుణికిపుచ్చుకున్నారు. విశ్వసనీయతే మూల సిద్ధాంతంగా ఆయన పార్టీని స్థాపించారు. పార్టీ పెట్టినప్పుడు జెండా మోసిన నేతలు, కార్యకర్తలకు ఆయన పూర్తి న్యాయం చేస్తారనడానికి ప్రస్తుత ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికే నిదర్శనం.

అధికార పక్షం.. రాజ కుటుంబీకులు, కార్పొరేట్‌ పెద్దలు, బడా కాంట్రాక్టర్లు, సంపన్నులకు అత్యధికంగా టిక్కెట్లు ఇస్తే... వైఎస్‌ జగన్‌ మాత్రం పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న సామాన్యులకు టిక్కెట్ల కేటాయింపులో అగ్రస్థానం కల్పించారు. పార్టీకి వెన్నుదన్నుగా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల నుంచి సామాన్యులకు రాజకీయ అవకాశాలు కల్పించారు.  

రాజీలేని ధోరణి

రాజీపడటం అన్నది జగన్‌ నిఘంటువులోనే లేదన్నది అందరూ అంగీకరించే వాస్తవం. స్వ ప్రయోజనాల కోసం ఎక్కడికక్కడ రాజీపడిపోయే నాయకులున్న వర్తమాన రాజకీయాల్లో.. అందుకు భిన్నంగా కనిపిస్తున్న ఏకైక నేత వైఎస్‌ జగన్‌. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక మృతిచెందిన అభిమానుల కుటుంబాలను పరామర్శిస్తానని ఇచ్చిన మాటపై రాజీపడి ఉంటే ఆయన కేంద్రమంత్రి అయ్యేవారు, కొన్నాళ్లకు సీఎం కూడా అయ్యేవారు.

కానీ అందుకు ఆయన సమ్మతించలేదు. ఇచ్చిన మాటకంటే కూడా తనకు ఏదీ ముఖ్యంకాదని తేల్చిచెప్పారు. బాధిత కుటుంబాల వద్దకు వెళ్లాలన్న తన మాటకే కట్టుబడ్డారు. అందుకోసం అక్రమ కేసులు పెట్టినా భరించారు. అన్యాయంగా అరెస్టు చేసినా తట్టుకున్నారు. అందరూ ఒక్కటై కుట్రలు చేసినా నిలబడ్డారు. అలాగే 2014 ఎన్నికల్లో రాజీపడి అబద్ధపు హామీలు ఇచ్చి ఉంటే.. సులువుగానే సీఎం అయ్యేవారు.

కానీ నిజాయితీతో కూడిన రాజకీయాలు చేయాలన్న తన సిద్ధాంతం పట్ల వైఎస్‌ జగన్‌ ఎన్నడూ రాజీపడలేదు. అందుకే అ«ధికారం దూరమైనా సరే ఆయన బాధపడలేదు. అదే రాజీలేని ధోరణితో ఐదేళ్లుగా ప్రజా సమస్యలపై పోరాడుతూ నిజాయితీగా ప్రజాతీర్పును కోరుతున్నారు.  

విలువలతో కూడిన రాజకీయం

విలువలతో కూడిన రాజకీయాలకే జగన్‌ కట్టుబడతారు. అధికారం కోసం అడ్డదారులు తొక్కేందుకు ఆయన పూర్తిగా వ్యతిరేకం. అధికారం దక్కకపోయినా పర్వాలేదు గానీ విలువల విషయంలో రాజీపడేది లేదని ఆయన స్పష్టంచేస్తున్నారు. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హఠాన్మరణానంతరం కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని పడగొడదామని మెజార్టీ ఎమ్మెల్యేలు ఆయనకు సూచించినా సమ్మతించలేదు. తన తండ్రి రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వాన్ని కూల్చనని కుండబద్దలుకొట్టారు.

సొంతంగా పార్టీ పెట్టి ప్రజాతీర్పుతోనే అధికారంలోకి రావాలన్నదే తన అభిమతమని తేల్చిచెప్పారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం సమయంలో ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి తమవైపు తిప్పుకుందామని కొందరు సూచించినా.. ఆయన ససేమిరా అన్నారు. విధానాల ప్రాతిపదికన స్వచ్ఛందంగా మద్దతు ఇస్తే తీసుకుంటాం, అంతేకాని ప్రలోభాల ఎరవేసి రాజకీయాలు చేయనని కుండబద్దలు కొట్టారు.   

దార్శనికుడు

ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం, రాష్ట్ర అభివృద్ధిపట్ల వైఎస్‌ జగన్‌ స్పష్టమైన దార్శనికతతో వ్యవహరిస్తారు. సమస్య మూలాల్లోకి వెళ్లి అధ్యయనం చేస్తారు. తాత్కాలిక ప్రయోజనాలు కాకుండా.. శాశ్వత
పరిష్కారం దిశగా విధివిధానాలను రూపొందిస్తారు. ఆ దార్శనికతతోనే వైఎస్‌ జగన్‌ నవరత్నాలకు రూపకల్పన చేశారు. రైతులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య సాగుకు పెట్టుబడని ఆయన గుర్తించారు. అందుకే రైతులకు ఏటా పెట్టుబడి నిధి కోసం రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు.

ప్రతి ఏటా పంటలు వేసే సమయంలోనే  రైతు కుటుంబానికి రూ.12,500 ఇస్తామని చెప్పారు. అదే విధానాన్ని తరువాత తెలంగాణా ప్రభుత్వంతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా అనుసరించడం జగన్‌ దార్శనికతకు నిదర్శనంగా భావించాలి. పేదలను ఆయన ఓటు బ్యాంకుగా చూడరు. తాత్కాలిక తాయిలాలు ఎరవేసి ఓట్లు కొల్లగొట్టాలనే రాజకీయ దుర్నీతి ఆయనకు లేదు. పేదలు ఆర్థికంగా సర్వస్వతంత్రులుగా ఎదగాలన్న తన తండ్రి వైఎస్సార్‌ ఆశయాల స్ఫూర్తే ఆయనకు ఆదర్శం.

అందుకు చదువే ఏకైన మార్గమన్నది జగన్‌ విశ్వాసం. బిడ్డలను చదివించేందుకు పేదింటి తల్లులు పడుతున్న బాధలకు ఆయన శాశ్వత పరిష్కారాన్ని రూపొందించారు. బిడ్డల్ని బడికి పంపితే తల్లులకు ఏటా రూ.15వేలు ఇస్తామని ప్రకటించారు. ఫీజురీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసే విధానాన్ని.. తమ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చారు. అలా నవరత్నాల పథకాలు కేంద్రబిందువుగా ఆయన ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోపట్ల అన్నివర్గాలు సానుకూలంగా స్పందిస్తున్నాయి.  

స్థిర నిర్ణయాలు
జగన్‌ అన్ని కోణాల్లో విశ్లేషించి స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. అది పొత్తుల్లో అయినా, హామీల్లో అయినా తనకు నష్టం జరుగుతుందని తెలిసినా.. ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కు తగ్గరు.

ఆత్మవిశ్వాసం

ఆత్మవిశ్వాసానికి వైఎస్‌ జగన్‌ నిలువెత్తు నిదర్శనం. సమకాలీన రాజకీయాల్లో జగన్‌ ఎదుర్కొన్నన్ని కుట్రలు, వేధింపులు మరే నేత ఎదుర్కోలేదు. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టినా.. ఆయన బెదరలేదు. అక్రమంగా అరెస్టు చేసి బెయిల్‌ రాకుండా అడ్డుకున్నాసరే ఆయన కుంగిపోలేదు. 2014 ఎన్నికల్లో అంతా ఒక్కటై తనకు వ్యతిరేకంగా దుష్ప్రచారం చేసినా ఆయన బెదిరిపోలేదు. అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసగించి తనకు అధికారాన్ని దూరం చేసినా.. రాజకీయాల నుంచి దూరంకాలేదు.

తన పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభపెట్టి టీడీపీలో చేర్చుకున్నా.. జగన్‌  నిబ్బరం కోల్పోలేదు. ప్రజల్నే నమ్ముకుంటూ ఆత్మవిశ్వాసంతో రాజకీయాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడుతూ.. ప్రజల మనసులను గెలుచుకున్నారు. ప్రజల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు.  

ఏది ఏమైనా ... విలువలకే కట్టుబడతారు ఆరునూరైనా... విశ్వసనీయతకే ప్రాణమిస్తారు. పొత్తుల జిత్తులకంటే... ప్రజాబలాన్నే నమ్ముతారు కుట్రలు, కుతంత్రాలు కాదు... సిద్ధాంతాలకే పెద్దపీట వేస్తారు
అడ్డంకులు ఎదురైనా... ఆత్మవిశ్వాసంతో దూసుకుపోతారుఅధికారం కోసం అడ్డదారులు తొక్కరు.. పోరుబాటలో సాగుతారు పగలూ, ప్రతీకారాలు కాదు... రాష్ట్ర ప్రగతికే నిబద్ధుడవుతారు ప్రజాసంక్షేమమే ధ్యేయం... సుభిక్ష ఆంధ్రప్రదేశే ఆయన స్వప్నం అందుకే అతనంటే ఓ నేత మాత్రమే కాదు... అతడే ఓ సైన్యం.. 

నిబద్ధత

వైఎస్‌ జగన్‌ దార్శనికత, దూరదృష్టితో విధానాలకు రూపకల్పన చేస్తారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన కీలక విషయాల్లో ఆయన ఆషామాషీగా నిర్ణయాలు తీసుకోరు. భవిష్యత్‌ పరిణామాలను అంచనా వేస్తూ విధాన నిర్ణయాలు తీసుకోవడంలో వైఎస్‌ జగన్‌ దార్శనికత అమోఘమైనది. ప్రత్యేక హోదా అంశంలో ఆయన విధానమే దీనికి తార్కాణం.  రాష్ట్ర ప్రగతికి ప్రత్యేక హోదానే సంజీవని అని ఆయన మొదటి నుంచీ నమ్మారు. అదే విషయాన్ని చట్టసభల్లోనూ, బయటా వాదిస్తూ వచ్చారు.  

హోదా వద్దు ప్యాకేజీ ఇస్తే చాలని చంద్రబాబు వాదించి కనికట్టు చేయాలని చూసినా.. ఆయన  తిరస్కరించారు. హోదాకోసం అలుపెరగకుండా పోరాడుతూ.. ఆ డిమాండ్‌ను సజీవంగా ఉంచారు. ప్రస్తుతం అధికార పార్టీ యూటర్న్‌ తీసుకుని మరీ ప్రత్యేక హోదా అంశంలో జగన్‌ వాదననే సమర్థించింది. ఎన్నికల్లో ప్రత్యేక హోదా అన్నది ప్రధాన అంశంగా మారింది. రాష్ట్ర ప్రగతికి చుక్కానిగా మారింది.  

పరిణతి

విధాన నిర్ణయాల్లో జగన్‌ ఎంతో పరిణతి కనబరుస్తారు. రాజకీయ స్వార్థం కోసం ప్రత్యర్థులు తనను వేధించినా.. ఆయన మాత్రం రాష్ట్ర ప్రయోజనాల కోసం పరిణతి ప్రదర్శిస్తారు. జగన్‌ అధికారంలోకి రాకుండా అడ్డుకోడానికి టీడీపీ , ఎల్లో మీడియా కలసి ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. జగన్‌ను, ఆయన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేశాయి. అయినా ఆయన మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు. విధానాల ప్రాతిపదికన రాజకీయ ప్రత్యర్థులను విమర్శించారు తప్పా వ్యక్తిగత ఆరోపణలు చేయనే లేదు.

ముఖ్యంగా విశాఖపట్నం విమానాశ్రయంలో తనపై హత్యాయత్నం జరిగినప్పుడు జగన్‌ చూపించిన పరిణతి అనితరసాధ్యం. తనపై కత్తితో దాడి చేసినా... రక్తం కారుతున్నా నిబ్బరంగా ఉన్నారు. ఆ హత్యాయత్నాన్ని రాజకీయంగా వాడుకోవాలంటే.. జగన్‌ విశాఖపట్నంలోనే ఆసుపత్రిలోచేరి హడావుడి చేయొచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. ఎవర్నీ నిందించలేదు. పంటిబిగువన బాధను భరిస్తూ మౌనంగా హైదరాబాద్‌కు పయనమయ్యారు. విపత్కర సమయంలో జగన్‌ చూపించిన పరిణతి వల్లే ఆ రోజు రాష్ట్రంలో శాంతిభధ్రతల సమస్య తలెత్తలేదని ఓ పోలీసు అధికారే చెప్పడం గమనార్హం. 

సుసాక్ష్యంగా 
వైఎస్‌ జగన్‌ ఏదైనా అంశంపై మాట్లాడేముందు పూర్తి కసరత్తు చేస్తారు.  క్షేత్రస్థాయిలో వాస్తవాలను వివరిస్తూ తగిన గణాంకాలతోసహా వివరిస్తారు.   అంతేగానీ గాలివాటం మాటలు  చెప్పరు. అది ప్రెస్‌ మీట్‌ అయినా, అసెంబ్లీ అయినా, పార్టీ మీటింగ్‌ అయినా.. ఆధారాలు లేనిదే మాట్లాడరు. లోతైన విశ్లేషణ, అధ్యయనం లేనిదే బయటకు రారు.  

ప్రజల్ని నమ్ముతారు

నాయకుడు ప్రజల నుంచి ఉద్భవించాలన్నది జగన్‌ నమ్మే సిద్ధాంతం. నిత్యం ప్రజల్లో ఉండేందుకే ఇష్టపడారు. ప్రజలే తనను గుర్తించి అధికారాన్ని ఇవ్వాలని ఆయన కోరుకుంటారు. అందుకోసం ప్రజల ఆశీర్వాదాన్ని పొందేందుకు అహర్నిశలు శ్రమిస్తారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ దశాబ్ద కాలం దాదాపుగా ప్రజల్లోనే ఉన్నారు.  ఓదార్పు యాత్ర చేశారు. 2014లో అధికారం దూరమైనా ప్రజలకోసం నిలబడ్డారు.

ప్రత్యేక హోదాసాధన యువభేరీ సదస్సులతో ప్రజల్ని చైతన్యవంతులను చేశారు. ఏకంగా 14నెలలపాటు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. రాష్ట్రంలో ప్రతి పల్లెతోనూ, ప్రతి గడపతోనూ బంధాన్ని పెనవేసుకున్నారు. ప్రతి గుండె చప్పుడూ విన్నారు. ‘నేను విన్నాను...నేను ఉన్నాను’అంటూ ప్రజలకు భరోసా ఇస్తున్నారు.  

పోరాటయోధుడు
వైఎస్‌ జగన్‌ పోరాటతత్వం అనితర సాధ్యం. సమస్యల పరిష్కారం కోసం ప్రజాస్వామ్యయుత పోరాటాలనే ఆయన నమ్ముకున్నారు. జగన్‌ చేసినన్ని ప్రజాపోరాటాలు, దీక్షలు ఎవ్వరూ చేయలేదు. ప్రజల కోసం ఏదైనా చేసే తెగింపు ఆయన సొంతం. ప్రజల కోసమే ఆనాడు సోనియా గాంధీని ఎదిరించారు. కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చారు. రైతుల కోసమే ఆయన కిరణ్‌ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఉప ఎన్నికలను ఎదుర్కొన్నారు. 

రాజనీతిజ్ఞత

రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేయడం వైఎస్‌ జగన్‌ రాజనీతిజ్ఞతకు నిదర్శనం.విభజన అనంతరం ఏపీ,తెలంగాణా కలసి ఉమ్మడిగా సమస్యల పరిష్కారానికి కృషిచేయాలన్నది ఆయన విధానం. అంతేగానీ ఓట్ల రాజకీయాల కోసం భావోద్వేగాలు రెచ్చగొట్టడానికి జగన్‌ పూర్తిగా వ్యతిరేకం.  ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం తెలంగాణా ప్రభుత్వ మద్దతు కూడగట్టడం జగన్‌ రాజనీతిజ్ఞతనకు నిదర్శనం. జగన్‌ రాజనీతిజ్ఞత జాతీయస్థాయిలో ప్రశంసలు పొందుతోంది.  

అదే విధంగా పోలవరం ప్రాజెక్టుపై ఇతర రాష్ట్రాల అభ్యంతరాలను కూడా ఆయన పరిష్కరించి జలయజ్ఞం కలను సాకారంచేస్తారని ప్రజలు విశ్వసిస్తున్నారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టులకు తాము మద్దతిస్తామని తెలంగాణా సీఎం కేసీఆర్‌ చెప్పడం జగన్‌ రాజనీతిజ్ఞత విజయమేనని పరిశీలకులు ఏకాభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.  

ప్రజల గుండెల్లో ఉండాలి

చనిపోయాక కూడా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవాలి....ఇదీ వైఎస్‌ జగన్‌ రాజకీయాల లక్ష్యం. ఆ లక్ష్య సాధనకే ఆయన అలుపెరగకుండా పోరాటం చేస్తున్నారు.  ఎవరైనా ఉన్నత పదవులు అధిష్టించేందుకు రాజకీయాల్లోకి వస్తారు. కానీ జగన్‌ మాత్రం తన తండ్రి స్ఫూర్తితో ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోవడమే తన రాజకీయ లక్ష్యం అని ప్రకటించడం విశేషం.

అందుకు తన  తండ్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనకు ఆదర్శమని భావిస్తున్నారు. ప్రజా ముఖ్యమంత్రిగా గుర్తింపుపొందిన ఆయన్ని జగన్‌ దగ్గరుండీ చూశారు. ప్రజల కోసం జీవించడం.. ప్రజలకు దగ్గరగా ఉండటం.. అంటే ఏమిటో తెలుసుకున్నారు. అందుకే రాజకీయాలు, పార్టీలు, కులాలు, మతాలకతీతంగా పథకాలు అందిస్తామని ప్రకటించారు.  

కష్టపడేతత్వం 
జగన్‌ అంతటి కష్టజీవి, అలుపెరగకుండా శ్రమించే నేత వర్తమాన రాజకీయాల్లో మరొకరు లేదు. ఆయనకు షార్ట్‌కట్‌లు తెలియవు. ఏసీ గదుల్లో కూర్చొని రాజకీయాలు చేయరు.  

అతడే ఓ సైన్యం 
వర్తమాన రాజకీయాల్లో జగన్‌ చాలా విభిన్నంగా కనిపిస్తారు. తనకంటూ సొంత వ్యక్తిత్వంతో మొదలుపెట్టిన రాజకీయ ప్రస్థానంలో అనితర సాధ్యుడిగా ఎదిగారు. ఒక్కడుగా 2009లో ఆయన వేసిన అడుగులో అడుగేసుకుంటూ.. లక్షలాదిమంది కార్యకర్తలు, కోట్లాది మంది అభిమానులు వైఎస్సార్‌సీపీ స్రవంతిలో మమేకమయ్యారు.  2010లో వైఎస్‌ జగన్, తన తల్లి విజయమ్మతో కలసి కాంగ్రెస్‌ నుంచి బయటకు వచ్చి సొంతంగా పోటీ చేసి ఎంపీ,ఎమ్మెల్యేలుగా గెలిచారు.

ఆ రోజు ఉన్నది ఇద్దరే. కానీ అనంతరం 2012లో 15మంది ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. తీవ్ర దుష్ప్రచారాన్ని, పొత్తుల కుట్రలను ఎదుర్కొని మరీ 2014లో 67మంది ఎమ్మెల్యేలు, 8మంది ఎంపీలను గెలిపించుకున్నారు. ప్రతిపక్ష నేతగా సమర్థవంతంగా వ్యవహరించి.. 2019 ఎన్నికల వేళ ప్రజాశీర్వాదంతో అధికారంలోకి వచ్చేదిశగా వైఎస్సార్‌సీపీని ఉరకలెత్తిస్తున్నారు!!  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement