సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా.. శుక్రవారం పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండోరోజు నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలు కదులుతుండడంతో.. పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఇంకా అమలు చేస్తున్నారు. నిమజ్జనం కోసం ఇంకా వందల సంఖ్యలో విగ్రహాలు రోడ్ల వెంట బారులు తీరాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక సూచన చేశారు.
ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో వెళ్లే వాహనాలు.. ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. నగరంలో నిన్న(గురువారం) ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జనం మొదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం తర్వాత చాలాసేపు విగ్రహాల నిమజ్జనం జరగలేదు. సాయంత్రం నుంచి విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు రావడం మొదలైంది.
ఈ క్రమంలో ఇవాళ రెండో రోజూ కూడా ట్యాంక్‌బండ్‌లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. లిబర్టీ మీదుగా హిమాయత్ నగర్, నారాయణగూడ, తిలక్‌నగర్.. కోరంటి ఆస్పత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అబిడ్స్, లక్డీకాపూల్ వైపు భారీగానే ట్రాఫిక్ ఉంది. మరోవైపు ట్యాంక్‌బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై గణనాథులు బారులు తీశారు. మధ్యాహ్నాంలోగా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment