vinayaka immersion
-
దేవునితో పంతమేంటి స్వామి
నాలుగు రోజులుగా వినాయక నిమజ్జనానికి ఆటంకాలు చౌటపాలెంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు 16 మందిపై కేసులు.. మరి కొంతమందిపై కేసులకు ప్రయత్నం రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిన ఎస్సై గిరిబాబు బంధువుల ట్రాక్టర్లు, బైక్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఇంత జరుగుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న జిల్లా అధికారులుపొన్నలూరు: రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చౌటపాలెంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అడ్డుకున్న మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి నాలుగు రోజులైనా తన పట్టు వీడటం లేదు. పదే పదే పోలీసులకు ఫోన్ ద్వారా హుకుం జారీ చేస్తూ స్థానికంగా టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించాలని హెచ్చరిస్తున్నాడు. వినాయకుడి నిమజ్జనం విషయంలో మంత్రి స్వామి, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నా అవేవీ మాకు పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వినాయకుడికి నవరాత్రులు పూజలు, పునస్కారాలు చేపట్టిన గ్రామస్తులు మంత్రి స్వామి, పోలీసులు వినాయక నిమజ్జనం జరగకుండా అడ్డుకోవడంతో గత ఆదివారం నుంచి నాలుగు రోజులుగా ఎలాంటి పూజలు, లేకుండా అలాగే రోడ్డు పక్కన ఉండిపోయారు. బుధవారం గ్రామంలో వర్షం పడటంతో వర్షంలో తడుస్తున్న వినాయకుడి బొమ్మ చూసిన గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. చౌటపాలెం వినాయక నిమజ్జనం విషయంలో గత నాలుగు రోజులుగా ఇంత వ్యవహారం జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు అంతా తెలిసి కూడా పట్టీపట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.16 మందిపై కేసులు... మరికొందరిపై కూడా..గ్రామంలోని వినాయక బొమ్మ నిమజ్జనానికి అనుమతులు ఇచ్చిన పోలీసులు ఆ తరువాత మంత్రి స్వామి చెప్పాడని నిమజ్జనాన్ని అడ్డుకున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని ఆదివారం రాత్రి పొన్నలూరు పోలీస్ స్టేషన్ ముందు ఓవీ రోడ్డుపై గ్రామస్తులు, మహిళలు ధర్నా చేసి నిరసన తెలిపారు. అయితే వారికి న్యాయం చేయని పోలీసులు వినాయక నిమజ్జనానికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నాయకులు చెప్పిన పేర్లు ప్రస్తావిస్తూ 16 మందిపై కేసులు బనాయించారు. అలాగే తమకు అనుకూలంగా మరోసారి మరికొందరిపై కేసులు పెట్టడానికి ఎఫ్ఐఆర్లో ఇతరులు అని కూడా నమోదు చేశారు. దీంతో పాటు గ్రామస్తుల పిలుపు మేరకు గ్రామానికి వచ్చిన వారి బంధువుల ట్రాక్టర్లు, బైక్‌లను సీజ్ చేసి బుధవారం పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఒత్తిడిని తట్టుకోలేక..సెలవుపై వెళ్లిన ఎస్సైఇదిఇలా ఉంటే చౌటపాలెం వినాయక బొమ్మ నిమజ్జన విషయంలో మంత్రి బాలవీరాంజనేయస్వామి, జిల్లా పోలీస్ అధికారి నుంచి తీవ్ర ఒత్తిళ్లు, హెచ్చరికలు పొందిన పొన్నలూరు ఎస్సై గిరిబాబు మంగళవారం రాత్రి సెలవు పెట్టి వెళ్లిపోయారు. వినాయక నిమజ్జనం విషయంలో రాజకీయ ఒత్తిళ్లతో తాము బాధ్యతలు, మానవత్వం మరిచి ప్రవర్తించామని కొందరి గ్రామస్తుల దగ్గర ఎస్సై గిరిబాబు వాపోయినట్లు సమాచారం. అలాగే చౌటపాలెం గ్రామస్తులకు న్యాయం చేయకపోయినా దేవుని నిమజ్జనం విషయంలో అన్యాయంగా కేసులు బనాయించడానికి మనసాక్షి ఒప్పుకోవడం లేదని, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి మనసాక్షి చంపుకొని విధులు నిర్వర్తించలేనని అన్నట్లుగా సమాచారం. అయితే ఎస్సై గిరిబాబు వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టి వెళ్లినట్లు అధికార పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కారణమేమైనా ఈ సమయంలో ఎస్సై సెలవులపై వెళ్లడం చర్చనీయంగా మారింది.పట్టీపట్టనట్లుగా జిల్లా అధికారులు...వాస్తవంగా మంత్రి స్వామి, స్థానిక పోలీసులు పైశాచిక ఆనందంతో చౌటపాలెం గ్రామస్తులు వినాయక బొమ్మ నిమజ్జనం చేయలేక నాలుగు రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇన్నేళ్లగా తమ గ్రామంలో ఇలాంటి సంఘటన జరగలేదని, మొదటి సారిగా వినాయక నిమజ్జనాన్ని మంత్రి స్వామి, పోలీసుల చేష్టలతో సకాలంలో చేయలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. నాలుగు రోజులుగా చౌటపాలెం లో ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు తమకు ఇవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిమజ్జనానికి నోచుకోని వినాయకుడి బొమ్మ నాలుగు రోజులుగా రోడ్డ పక్కన ఉంటే జిల్లా అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు జిల్లా అధికారులు సైతం తలొగ్గి పట్టించుకోకపోవడం మంచిది కాదని సామాన్య ప్రజలు సైతం ఆరోపిస్తున్నారు. -
భారతి సిమెంట్స్, వికా ఇండియా కార్పొరేట్ కార్యాలయంలో వేడుకగా వినాయక నిమజ్జనోత్సాహం
-
నిమజ్జనం రోజు ట్రాక్టర్‌పై నుంచి పల్టీ.. 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు ..
రాజంపేట : వినాయక నిమజ్జనం సందర్భంగా ట్రాక్టర్ పైనుంచి పల్టీ కొట్టి ప్రాణాలమీదకు తెచ్చుకున్న యువకుడు 20 రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరకు తనువు చాలించాడు. ఈ విషాద సంఘటన రాజంపేట పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని మన్నూరుకు చెందిన కిరణ్ (30) గతనెల 22న గణేష్ నిమజ్జనంలో ఉత్సాహంగా ట్రాక్టర్‌పై నుంచి విన్యా సం చేసి చివరికి ప్రాణాల మీదకు తెచ్చుకున్న సంఘటన సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా తమ ప్రాంత వినాయకుని నిమజ్జనం ర్యాలీ భారీగా వాయ్యిదాలు, బాణసంచాలను కాలుస్తూ పట్టణంలోని పాత బస్టాండుకు చేరుకుంది. ఈ క్రమంలో కిరణ్ ఉన్నఫళంగా ట్రాక్టర్ ఇంజిన్‌పై నుంచి పల్టీ కొట్టేందుకు ప్రయత్నించే క్రమంలో అదుపుతప్పి పడ్డాడు. దీంతో మెడ, తలకు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం తిరుపతిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. నరాలు దెబ్బతినడంతో లాభం లేదని ఇంటికి తీసుకొచ్చారు. అప్పటి నుంచి 20రోజుల పాటు మృత్యువుతో పోరాడాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు చికిత్స చేయించినా ఫలితం లేకుండా పోయింది. మృతుడికి అమ్మానాన్నతో పాటు అన్న ఉన్నాడు. -
హైదరాబాద్‌లో పలుచోట్ల భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, హైదరాబాద్: నగరంలో వినాయక నిమజ్జనం దృష్ట్యా.. శుక్రవారం పలు ఏరియాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది. రెండోరోజు నగరం నలుమూలల నుంచి ట్యాంక్ బండ్ వైపు విగ్రహాలు కదులుతుండడంతో.. పలు ప్రాంతాల్లో ఆంక్షలు ఇంకా అమలు చేస్తున్నారు. నిమజ్జనం కోసం ఇంకా వందల సంఖ్యలో విగ్రహాలు రోడ్ల వెంట బారులు తీరాయి. ఈ క్రమంలో పోలీసులు కీలక సూచన చేశారు. ట్యాంక్ బండ్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఎన్టీఆర్ మార్గ్‌లో వెళ్లే వాహనాలు.. ఇతర మార్గాల్లో వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. తద్వారా ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు. నగరంలో నిన్న(గురువారం) ఉదయం నుంచి విగ్రహాల నిమజ్జనం మొదలైంది. ఖైరతాబాద్ మహాగణపతి విగ్రహ నిమజ్జనం తర్వాత చాలాసేపు విగ్రహాల నిమజ్జనం జరగలేదు. సాయంత్రం నుంచి విగ్రహాలు ట్యాంక్‌బండ్ వైపు రావడం మొదలైంది. ఈ క్రమంలో ఇవాళ రెండో రోజూ కూడా ట్యాంక్‌బండ్‌లో విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది. లిబర్టీ మీదుగా హిమాయత్ నగర్, నారాయణగూడ, తిలక్‌నగర్.. కోరంటి ఆస్పత్రి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. అబిడ్స్, లక్డీకాపూల్ వైపు భారీగానే ట్రాఫిక్ ఉంది. మరోవైపు ట్యాంక్‌బండ్ వద్ద ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్‌బండ్‌పై గణనాథులు బారులు తీశారు. మధ్యాహ్నాంలోగా నిమజ్జనాలు పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. -
నిమజ్జనానికి ఎంఎంటీఎస్ స్పెషల్స్
హైదరాబాద్: వినాయక నిమజ్జనం సందర్భంగా 8 ఎంఎంటీఎస్ సర్వీసులను అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో సీహెచ్.రాకేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ రాత్రి 11 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 4 గంటల వరకు ఈ రైళ్లు వివిధ మార్గాల్లో రాకపోకలు సాగిస్తాయి. సికింద్రాబాద్–నాంపల్లి, ఫలక్‌నుమా–లింగంపల్లి. నాంపల్లి–సికింద్రాబాద్, లింగంపల్లి–నాంపల్లి, లింగంపల్లి–సికింద్రాబాద్ మధ్య ఈ ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగించనున్నాయి. -
వినాయక నిమజ్జనంపై హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో జీహెచ్ఎంసీ రివ్యూ పిటిషన్ దాఖలు చేసింది. హైకోర్టు తమ తీర్పును పునః పరిశీలించాలని జీహెచ్ఎంసీ కోరింది. హుస్సేన్ సాగర్, ఇతర జలాశయాల్లో పీవోపీ విగ్రహాల నిమజ్జనంపై నిషేధం ఎత్తేయాలని పిటిషన్లో జీహెచ్ఎంసీ పేర్కొంది. ట్యాంక్ బండ్ వైపు నుంచి నిమజ్జనానికి అనుమతించాలని కోరింది. హుస్సేన్‌సాగర్‌లో రబ్బర్ డ్యాం నిర్మించాలన్న ఉత్తర్వులను సవరించాలని జీహెచ్ఎంసీ విజ్ఞప్తి చేసింది. నిమజ్జనం తర్వాత 24 గంటల్లో వ్యర్థాలు తొలగిస్తామని జీహెచ్ఎంసీ పేర్కొంది. ఇవీ చదవండి: మియాపూర్‌లో దారుణం: చిన్నారి అనుమానాస్పద మృతి డిగ్రీ చేశానని నమ్మించి నిశ్చితార్థం -
నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం: తలసాని
-
నిమజ్జనంపై హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేస్తాం: తలసాని
ఖైరతాబాద్: ఈ సంవత్సరం యథావిధిగానే హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికిప్పుడు వినాయక నిమజ్జనాలకోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమని పేర్కొన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారని, ఇంత తక్కువ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు. నిమజ్జనం జరిగిన 48 గంటల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిమజ్జనంపై ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ రూపంలో ఈ పిటిషన్‌ను విచారించాలని కోరగా, ధర్మాసనం తిరస్కరిస్తూ, సోమవారం ఉదయం ఇదే విషయాన్ని ధర్మాసనం ముందు నివేదించాలని సూచించింది. -
TS: వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఖైరతాబాద్ వినాయకుడిని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, వినాయక నిమజ్జనంపై హైకోర్టులో రేపు రివ్యూ పిటిషన్ వేస్తామని తెలిపారు. కాలుష్యం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి పేర్కొన్నారు. నిమజ్జనం పూర్తయ్యాక హుస్సేన్‌సాగర్‌ను శుభ్రం చేస్తామన్నారు. హైకోర్టు తమ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని కోరతామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు ఇవీ చదవండి: ఆనాటి నుంచి పన్నెండు మెట్ల కిన్నెర పాట వరకు.. సూపర్ సక్సెస్ అనాథను ఆదరించింది.. అదే ఆమె పాలిట శాపంగా మారింది -
హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు ఆంక్షలు
-
TS: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై హైకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, హైదరాబాద్: గణేష్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు విధించింది. గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు అమలు చేయాలని హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి గురువారం ఆదేశాలు జారీ చేసింది. హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు నిమజ్జనం చేయొద్దని స్పష్టం చేసింది. ప్రత్యేక కుంట్లలో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను నిమజ్జనం చేయాలని హైకోర్టు సూచించింది. హుస్సేన్‌సాగర్‌లో ట్యాంక్‌బండ్ వైపు నిమజ్జనానికి అనుమతించొద్దని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్‌సాగర్‌లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. చిన్న, పర్యావరణహిత విగ్రహాలను ప్రోత్సహించాలని ధర్మాసనం పేర్కొంది. (చదవండి: డైరీలో.. మమ్మీ నేను బతకడానికి వెళ్తున్నా, నా కోసం..) -
హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా?.. హైకోర్టు ఆగ్రహం
సాక్షి, హైదరాబాద్: వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రిజర్వ్ చేసింది. వినాయక నిమజ్జనంపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నిమజ్జనం సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుంది అంటూ వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్ఎంసీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా అని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడంలేదని హైకోర్టు ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని, లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది. ఇవీ చదవండి: వీడని మిస్టరీ: జయశీల్‌రెడ్డి ఏమయ్యారు? తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా.. -
‘బలవంతంగా నిమజ్జనం చేయడం లేదు’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని పండుగలకు ప్రాధాన్యమిస్తూ ముందుకు వెళుతున్నారని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. మంగళవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం బుధవారం ఉదయం 12 గంటల వరకు ఎన్టీఆర్ మార్గ్‌ను చేరుతుందన్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం పూర్తి అవుతుందని తెలిపారు. కాగా మహాగణపతి పూర్తిగా నిమజ్జనం అయ్యేలా హెచ్ఎండీఏ అధికారులు హుస్సేన్ సాగర్‌లో పూడిక తీశారని పేర్కొన్నారు. హుస్సేన్ సాగర్ పరిసరాలతో పాటు వివిధ ప్రాంతాల్లో అధికారులు ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారన్నారు. మొదటి రోజు నుంచి కూడా అధికారులు భక్తులకు, సందర్శకులకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జనం కోసం నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారని, మేము బలవంతంగా ఈ కార్యక్రమాన్ని చేయడం లేదు స్పష్టం చేశారు. ఒకవైపు ముస్లింల పండుగ మొహర్రం జరుగుతోంది.. మరోవైపు వినాయకచవితి కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. పోలీసులు అన్ని ఏర్పాట్లుచేసి.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. నిమజ్జన ఏర్పాట్లలో జీహెచ్ఎంసీ ప్రధాన భూమిక పోషిస్తోందని చెప్పారు. క్రేన్ నెంబర్ 6 వద్ద ఖైరతాబాద్ వినాయకుడి విగ్రహం సాగర్‌లో నిమజ్జనం అవుతుందని తెలిపారు. -
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
చేవెళ్లరూరల్(రంగారెడ్డి జిల్లా): వినాయక నిమజ్జనంలో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయక నిమజ్జనోత్సవంలో పాల్గొన్న ఓ యువకుడు అదుపు తప్పి ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లిలో ఆదివారం రాత్రి ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఏర్పాటు చేసిన గణేశుని విగ్రహాన్ని ఆదివారం రాత్రి సమీపంలోని చెరువులో నిమజ్జనం చేశారు. అనంతరం యువకులంతా ట్రాక్టర్లో వస్తుండగా సురేశ్(19) ప్రమాదవశాత్తు కిందపడిపోయాడు. అతనిపైనుంచి ట్రాక్టర్ చక్రాలు వెళ్లటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర ఆలస్యం
-
వైభవంగా వినాయక నిమజ్జనం
హైదరాబాద్: జంట నగరాల్లో వినాయకుడి నిమజ్జన శోభాయాత్ర వైభవంగా సాగుతోంది. లక్షలాది మంది భక్తులు గణనాథుడిని దర్శించుకున్నారు. ఆదివారం సాయంత్రానికి దాదాపు 26 వేల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. నగరంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది విగ్రహాలు హుస్సేన్ సాగర్ వైపు కదులుతున్నాయి. మహానగరం అంతా డప్పులు, డ్యాన్సులు, డీజేలతో సందడిగా మారింది. ముఖ్యంగా ట్యాంక్‌బండ్, హుస్సేన్ సాగర్ ప్రాంతాలు జనసంద్రంగా మారాయి. ట్యాంక్‌బండ్‌తో పాటు 25 చెరువుల్లో వినాయకుడి నిమజ్జనానికి ఏర్పాట్లు చేశారు. తొమ్మిది ప్రధాన మార్గాల నుంచి వినాయక విగ్రహాలు ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నాయి. ఇదిలా ఉండగా, ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి నిమజ్జనం సోమవారం ఉదయానికి పూర్తయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. కాసేపట్లో ఖైరతాబాద్ మహా గణపతి నిమజ్జన యాత్ర ప్రారంభంకానుంది. వినాయక నిమజ్జనం కోసం 25 వేల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్, కర్నాటక, ఒడిశా, తమిళనాడు పోలీసులతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. దీంతో పాటు కమాండింగ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా 400 సీసీ కెమెరాలతో మానిటర్ చేస్తున్నారు. గతంలో ఇబ్బందులు ఎదురైన ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి... నిమజ్జనం దారిలోని ప్రతి కూడాలిలో సీసీ కెమెరాలు అమర్చారు. ఎలాంటి ఘటన జరగకుండా కమాండింగ్ కంట్రోల్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేష్ కుమార్ జంట నగరాల్లో పలుప్రాంతాల్లో సందర్శించి ఏర్పాట్లును సమీక్షించారు. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ మహేందర్ రెడ్డి నగరంలో పటిష్ట పోలీసు బలగాలను ఉంచారు. ఎలాంటి ఇబ్బంది కలిగినా సమాచారం అందించాలని కోరారు. -
నేడు గణనాథుడి నిమజ్జనం
ఆదిలాబాద్, న్యూస్‌లైన్ : నవరాత్రులు పూజలందుకున్న గణనాథుడికి బుధవారం భక్తులు వీడ్కోలు పలకనున్నారు. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలతో సహా పలుచోట్ల వినాయక నిమజ్జనం జరగనుంది. ఇందుకోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఆధ్వర్యంలో ఆరుగురు అదనపు ఎస్పీలు, 8 మంది డీఎస్పీలు, 25 మంది సీఐలు, 50 మంది ఎస్సైలు, 2500 పోలీస్ కానిస్టేబుళ్లు, 600 మంది హోంగార్డులు, 38 మంది మహిళా పోలీసులు, 12 క్విక్ రియాక్షన్ టీమ్‌లు బందోబస్తులో పాల్గొంటాయి. ఆదిలాబాద్, నిర్మల్, ఖానాపూర్, ముథోల్, ఇచ్చోడపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. కాగజ్‌నగర్, మంచిర్యాల, బెల్లంపల్లి, లక్సెటిపేట, చెన్నూర్, ఉట్నూర్ ప్రాంతాల్లోనూ బందోబస్తు ఏర్పాటు చేశారు. నిర్మల్, ఆదిలాబాద్ ప్రాంతాల్లో 20 చోట్ల సమస్యాత్మక ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 15 మంది పోలీసు వీడియోగ్రాఫర్లను నియమించారు. ఆదిలాబాద్‌లో హిందూ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఉదయం 9.30గంటలకు స్థానిక శిశుమందిర్‌లో నెలకొల్పిన వినాయక ప్రతిమకు పూజలు చేస్తారు. అనంతరం సభ నిర్వహిస్తారు. కలెక్టర్ అహ్మద్ బాబు, ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి శోభాయాత్ర ప్రారంభం అవుతుంది. ఆదిలాబాద్‌లోని ప్రధాన వీధుల గుండా పెన్‌గంగ వరకు 200 విగ్రహాల నిమజ్జన శోభాయాత్ర సాగుతుంది. పెన్‌గంగ వద్ద హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేశారు. క్రెయిన్ ద్వారా విగ్రహాలను నిమజ్జనం చేయనున్నారు. గజ ఈతగాళ్లను నియమించారు. నిర్మల్‌లో స్థానిక బంగల్పేట్ వినాయక్ సాగర్‌లో విగ్రహాల నిమజ్జనం చేయనున్నారు. డీఎస్పీ శేష్‌కుమార్ బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. పెట్రోలింగ్ పార్టీలు, స్పెషల్ పార్టీలు కూడా బందోబస్తులో పాల్గొంటున్నాయి. ఉట్నూర్‌లో ఎల్లమ్మ చెరువులో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేస్తారు. మంచిర్యాలలో విశ్వనాథ ఆలయం నుంచి శోభాయాత్ర ప్రారంభం కానుంది. డీఎస్పీ రమణకుమార్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు. హిందు ఉత్సవ సమితి ముక్రం చౌరస్తా వద్ద శోభాయాత్ర ర్యాలీకి స్వాగతం పలకనుంది. కాగజ్‌నగర్‌లో డీఎస్పీ సురేశ్‌బాబు బందోబస్తును పర్యవేక్షిస్తున్నారు. కాగజ్నర్లోని పెద్దవాగులో వినాయకులను నిమజ్జనం చేయనున్నారు.