ఖైరతాబాద్: ఈ సంవత్సరం యథావిధిగానే హుస్సేన్ సాగర్‌లో ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో చేసిన విగ్రహాలను నిమజ్జనానికి అనుమతించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయనున్నట్లు పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఆదివారం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను హుస్సేన్ సాగర్‌లో నిమజ్జనం చేయవద్దని హైకోర్టు అదేశించిన నేపథ్యంలో భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని కోర్టు కూడా ఆలోచించాలని కోరుతున్నామన్నారు. ఇప్పటికిప్పుడు వినాయక నిమజ్జనాలకోసం బేబీ పాండ్స్ ఏర్పాటు చేయడం కష్టమని పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 35 వేలకు పైగా విగ్రహాలను ప్రతిష్టించారని, ఇంత తక్కువ సమయంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయడం సాధ్యం కాదని, పర్యావరణ ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటుందని తెలిపారు.
నిమజ్జనం జరిగిన 48 గంటల్లో వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తామని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా నిమజ్జనంపై ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సవరించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం హైకోర్టును ఆశ్రయించింది. హౌస్ మోషన్ రూపంలో ఈ పిటిషన్‌ను విచారించాలని కోరగా, ధర్మాసనం తిరస్కరిస్తూ, సోమవారం ఉదయం ఇదే విషయాన్ని ధర్మాసనం ముందు నివేదించాలని సూచించింది.
Comments
Please login to add a commentAdd a comment