నాలుగు రోజులుగా వినాయక నిమజ్జనానికి ఆటంకాలు చౌటపాలెంలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు 16 మందిపై కేసులు.. మరి కొంతమందిపై కేసులకు ప్రయత్నం రాజకీయ ఒత్తిడి తట్టుకోలేక సెలవుపై వెళ్లిన ఎస్సై గిరిబాబు బంధువుల ట్రాక్టర్లు, బైక్‌లను పోలీస్‌స్టేషన్‌కు తరలించిన పోలీసులు ఇంత జరుగుతున్నా పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్న జిల్లా అధికారులు
పొన్నలూరు: రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా చౌటపాలెంలో వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని అడ్డుకున్న మంత్రి డోల బాలవీరాంజనేయస్వామి నాలుగు రోజులైనా తన పట్టు వీడటం లేదు. పదే పదే పోలీసులకు ఫోన్ ద్వారా హుకుం జారీ చేస్తూ స్థానికంగా టీడీపీ నాయకులు చెప్పినట్లు వ్యవహరించాలని హెచ్చరిస్తున్నాడు. వినాయకుడి నిమజ్జనం విషయంలో మంత్రి స్వామి, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నా అవేవీ మాకు పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అయితే వినాయకుడికి నవరాత్రులు పూజలు, పునస్కారాలు చేపట్టిన గ్రామస్తులు మంత్రి స్వామి, పోలీసులు వినాయక నిమజ్జనం జరగకుండా అడ్డుకోవడంతో గత ఆదివారం నుంచి నాలుగు రోజులుగా ఎలాంటి పూజలు, లేకుండా అలాగే రోడ్డు పక్కన ఉండిపోయారు. బుధవారం గ్రామంలో వర్షం పడటంతో వర్షంలో తడుస్తున్న వినాయకుడి బొమ్మ చూసిన గ్రామస్తులు కన్నీటిపర్యంతమయ్యారు. చౌటపాలెం వినాయక నిమజ్జనం విషయంలో గత నాలుగు రోజులుగా ఇంత వ్యవహారం జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు అంతా తెలిసి కూడా పట్టీపట్టనట్లు వ్యవహరించడం గమనార్హం.
16 మందిపై కేసులు... మరికొందరిపై కూడా..
గ్రామంలోని వినాయక బొమ్మ నిమజ్జనానికి అనుమతులు ఇచ్చిన పోలీసులు ఆ తరువాత మంత్రి స్వామి చెప్పాడని నిమజ్జనాన్ని అడ్డుకున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని ఆదివారం రాత్రి పొన్నలూరు పోలీస్ స్టేషన్ ముందు ఓవీ రోడ్డుపై గ్రామస్తులు, మహిళలు ధర్నా చేసి నిరసన తెలిపారు. అయితే వారికి న్యాయం చేయని పోలీసులు వినాయక నిమజ్జనానికి అనుమతి ఇవ్వకుండా టీడీపీ నాయకులు చెప్పిన పేర్లు ప్రస్తావిస్తూ 16 మందిపై కేసులు బనాయించారు. అలాగే తమకు అనుకూలంగా మరోసారి మరికొందరిపై కేసులు పెట్టడానికి ఎఫ్‌ఐఆర్‌లో ఇతరులు అని కూడా నమోదు చేశారు. దీంతో పాటు గ్రామస్తుల పిలుపు మేరకు గ్రామానికి వచ్చిన వారి బంధువుల ట్రాక్టర్లు, బైక్‌లను సీజ్ చేసి బుధవారం పొన్నలూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఒత్తిడిని తట్టుకోలేక..సెలవుపై వెళ్లిన ఎస్సై
ఇదిఇలా ఉంటే చౌటపాలెం వినాయక బొమ్మ నిమజ్జన విషయంలో మంత్రి బాలవీరాంజనేయస్వామి, జిల్లా పోలీస్ అధికారి నుంచి తీవ్ర ఒత్తిళ్లు, హెచ్చరికలు పొందిన పొన్నలూరు ఎస్సై గిరిబాబు మంగళవారం రాత్రి సెలవు పెట్టి వెళ్లిపోయారు. వినాయక నిమజ్జనం విషయంలో రాజకీయ ఒత్తిళ్లతో తాము బాధ్యతలు, మానవత్వం మరిచి ప్రవర్తించామని కొందరి గ్రామస్తుల దగ్గర ఎస్సై గిరిబాబు వాపోయినట్లు సమాచారం. అలాగే చౌటపాలెం గ్రామస్తులకు న్యాయం చేయకపోయినా దేవుని నిమజ్జనం విషయంలో అన్యాయంగా కేసులు బనాయించడానికి మనసాక్షి ఒప్పుకోవడం లేదని, బాధ్యతాయుతమైన వృత్తిలో ఉండి మనసాక్షి చంపుకొని విధులు నిర్వర్తించలేనని అన్నట్లుగా సమాచారం. అయితే ఎస్సై గిరిబాబు వ్యక్తిగత పనుల నిమిత్తం సెలవు పెట్టి వెళ్లినట్లు అధికార పార్టీ నాయకులు ప్రచారం చేస్తున్నారు. కారణమేమైనా ఈ సమయంలో ఎస్సై సెలవులపై వెళ్లడం చర్చనీయంగా మారింది.
పట్టీపట్టనట్లుగా జిల్లా అధికారులు...
వాస్తవంగా మంత్రి స్వామి, స్థానిక పోలీసులు పైశాచిక ఆనందంతో చౌటపాలెం గ్రామస్తులు వినాయక బొమ్మ నిమజ్జనం చేయలేక నాలుగు రోజులుగా మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. ఇన్నేళ్లగా తమ గ్రామంలో ఇలాంటి సంఘటన జరగలేదని, మొదటి సారిగా వినాయక నిమజ్జనాన్ని మంత్రి స్వామి, పోలీసుల చేష్టలతో సకాలంలో చేయలేకపోయామని కన్నీటి పర్యంతమయ్యారు. నాలుగు రోజులుగా చౌటపాలెం లో ఇంత జరుగుతున్నా జిల్లా స్థాయి అధికారులు తమకు ఇవేమి పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. నిమజ్జనానికి నోచుకోని వినాయకుడి బొమ్మ నాలుగు రోజులుగా రోడ్డ పక్కన ఉంటే జిల్లా అధికారులు కనీసం స్పందించకపోవడం దారుణమని గ్రామస్తులు అంటున్నారు. రాజకీయ ఒత్తిళ్లకు జిల్లా అధికారులు సైతం తలొగ్గి పట్టించుకోకపోవడం మంచిది కాదని సామాన్య ప్రజలు సైతం ఆరోపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment