బడుగుజీవిపై పచ్చకక్ష
స్కూల్లో 11 ఏళ్లుగా పనిచేస్తున్న
దళిత శానిటరీ వర్కర్ తొలగింపు
కంభం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చిరుద్యోగులని కూడా చూడకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. గ్రామాల్లో పరిస్థితులు ఇంకా దారుణంగా మారిపోతున్నాయి. ప్రభుత్వ పాఠశాలలో 11 ఏళ్లుగా శానిటరీ వర్కర్‌గా పనిచేస్తూ వచ్చే అరకొర జీతంతో మానసిక విలాంగుడైన కుమారుడిని పోషించుకుంటూ బతుకుతున్న దళిత వితంతు మహిళను టీడీపీ నాయకుల ఒత్తిడితో విద్యాశాఖాధికారులు తొలగించడం వారి దాష్టీకానికి నిదర్శనంగా నిలుస్తోంది.
మండలంలోని చిన్నకంభం ప్రభుత్వ పాఠశాలలో 11 సంవత్సరాలుగా శానిటరీ వర్కర్‌గా పనిచేస్తున్న ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుర్రం భాగ్యానికి భర్త 23 ఏళ్ల క్రితం చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడు మానసిక వికలాంగుడు. పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే సదరమ్ సర్టిఫికెట్‌లో అంగవైకల్య శాతం సరిపోలేదంటూ పింఛన్ రాలేదు. అప్పట్లో వెయ్యి రూపాయల జీతం ఉండగా ప్రస్తుతం రూ.6 వేల జీతం వస్తోంది. వచ్చే కొద్దిపాటి జీతంతో కొడుక్కి మందులు ఇప్పించుకుంటూ జీవనం సాగిస్తోంది.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వైఎస్సార్ సీపీ సానుభూతిపరురాలనే నెపంతో పదకొండేళ్లుగా పాఠశాలలో పనిచేస్తున్న ఆమెను తొలగించాలని గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు పట్టుబట్టారు. వారి ఒత్తిడితో విద్యాశాఖాధికారులు ఆమెను తొలగించాలని నిర్ణయించుకుని ‘‘ఇక నువ్వు స్కూల్‌కు రావొద్దు.. నీస్థానంలో వేరొకరిని నియమించాం’’ అని చెప్పారని, శుక్రవారం గ్రామానికి చెందిన మరో మహిళ స్కూల్‌కు శానిటరీ పనిచేసేందుకు వెళ్లిందని దీంతో తాను రోడ్డున పడ్డానని భాగ్యం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది.
Comments
Please login to add a commentAdd a comment