
టీడీపీ కార్యకర్త మాదిరిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్లకు పుట్టినరోజు
శుభాకాంక్షలు చెబుతూ ఫ్లెక్సీ ఏర్పాటు
సాక్షాత్తూ కలెక్టర్ కార్యాలయానికి పక్కనే ఉన్న చర్చి సెంటర్‌లో ఫ్లెక్సీ ఏర్పాటు
ఒంగోలు నగరంలో దాదాపు 20కిపైగా ఫ్లెక్సీల్లో ప్రభుత్వ ఉద్యోగి ఫొటోలు
చోద్యం చూస్తున్న కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు
ఒంగోలు సబర్బన్: కూటమి హయాంలో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొందరు బరితెగిస్తున్నారు. ప్రభుత్వమే మాది.. మమ్మల్ని ఎవరేం చేస్తారనే అహంకారంతో కాలర్ ఎగరేస్తున్నారు. కొందరు ప్రభుత్వ ఉద్యోగులు ఏకంగా టీడీపీ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు. ప్రజలు కట్టిన పన్నులతో జీతం తీసుకుంటున్న ఒక ప్రభుత్వ ఉద్యోగి టీడీపీ ఎమ్మెల్యేకి నగరంలో 20కిపైగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడంటే.. ప్రభుత్వ ఉద్యోగులు ఎంత విచ్చలవిడిగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూ జిల్లా కేంద్రం నడిబొడ్డున ఒక ప్రభుత్వ ఉద్యోగి ఎక్కడబడితే అక్కడ అతని ఫొటోలతోనే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. అది కూడా జిల్లా పరిపాలనా కార్యాలయమైన కలెక్టరేట్ వద్ద గల చర్చి సెంటర్‌లో భారీ ఫ్లెక్సీలను అతని ఫొటోలతోనే ఏర్పాటు చేశాడు. వాటిని చూసి ఇతర ప్రభుత్వ ఉద్యోగులంతా ముక్కున వేలేసుకుంటున్నారు. ఆ వివరాల్లోకెళ్తే..
వైద్యారోగ్యశాఖలో జిల్లా కోర్టు ప్రాంగణానికి ఆనుకుని ఉన్న మాతా శిశు వైద్యశాలలో పొన్నర్సు శ్రీహరి అలియాస్ బబ్లీ ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఎక్స్ రే విభాగంలో టెక్నీషియన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. రెగ్యులర్ ఉద్యోగిగా ఉంటూ ప్రభుత్వం నుంచి ప్రజల సొమ్మును జీతంగా తీసుకుంటున్న శ్రీహరి.. ఆ వైద్యశాలలో కూడా పచ్చచొక్కా వేసుకున్న టీడీపీ కార్యకర్త మాదిరిగా వ్యవహరిస్తున్నాడని ఇప్పటికే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీకి చెందిన ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పుట్టినరోజు సందర్భంగా నగర ప్రధాన కూడలి అయిన చర్చి సెంటర్‌లో ఎమ్మెల్యే భారీ కటౌట్లతో పాటు తన ఫొటోలతో శ్రీహరి ఫ్లెక్సీ వేశాడు.
చర్చి సెంటర్‌తో పాటు నగరంలోని జయరాం థియేటర్ సెంటర్, రాజాపానగల్ రోడ్డు, మరికొన్ని ప్రాంతాల్లోనూ ఎమ్మెల్యే ఫొటోలు, తన ఫొటోలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడు. సాక్షాత్తూ కలెక్టర్ కార్యాలయం ముందే ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాడంటే జిల్లా అధికారులంటే కూడా లెక్కలేదన్నట్లుగా అతని తీరు ఉంది. జిల్లా వైద్యారోగ్య శాఖాధికారులు కూడా అతన్ని ఏమీ అనలేని పరిస్థితిలో ఉన్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యే జనార్దన్ అండదండలు అతనికి మెండుగా ఉన్నాయని, అందుకే ఇలా రెచ్చిపోతున్నాడని సహచర ఉద్యోగులు చెవులు కొరుక్కుంటున్నారు. ఎమ్మెల్యేకి ప్రభుత్వ ఉద్యోగి ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడాన్ని జిల్లా అధికారులు ఏ విధంగా పరిగణిస్తారో వేచి చూడాలి మరి.
ఫ్లెక్సీల కారణంగా చర్చి సెంటర్‌లో రోడ్డు ప్రమాదం...
నగరంలోని ప్రధాన కూడలి అయిన చర్చి సెంటర్‌లో రోడ్లకు అడ్డంగా ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ జన్మదిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కారణంగా ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదుటి వాహనాలు దగ్గరకు వచ్చేంత వరకూ పూర్తిగా కనిపించకుండా జంక్షన్‌లో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయటంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనదారులు రాకపోకలు సాగించే సమయంలో ఫ్లెక్సీలు అడ్డుగా ఉండి ఇతర వాహనాలు కనిపించక ఫెక్సీల పక్కనే కారు, మోటారు సైకిల్ ఢీకొన్నాయి. దాంతో ద్విచక్రవాహనంపై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక జీజీహెచ్‌కి తరలించారు. ఈ ప్రమాదంపై ఒంగోలు నగర పోలీసులు కేసు నమోదు చేసేందుకు సన్నద్ధమవుతున్నట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment