మద్యం కొట్టు.. టీ కొట్టు ఒక్కటేట!
కనిగిరి రూరల్: ఇళ్ల మధ్య మద్యం షాపు పెట్టొద్దంటే ‘‘మద్యం కొట్టు కూడా టీకొట్టు లాంటిదే..వ్యాపారం జరిగే చోట పెట్టుకుంటాం’’ అంటూ నిర్వాహకులు తమ అభ్యంతరాలు పట్టించుకోకుండా దుకాణం ఏర్పాటు చేశారంటూ కనిగిరిలో కేసిరెడ్డి నగర్ వీధి వైపు ఏర్పాటు చేసిన మద్యం దుకాణం వద్ద మహిళలు శుక్రవారం ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న ఎస్సై టీ శ్రీరాం అక్కడకు చేరుకున్నారు. ఎస్సైతో మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.
నిబంధనలకు తూట్లు పొడిచి.. ఇష్టానుసారంగా గృహాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేశారన్నారు. ‘‘మద్యం షాపు ప్రారంభానికి సిద్ధం చేస్తున్న ముందు రోజే అభ్యంతరం తెలిపాం. ఆయినా ఆపలేదు. టెంట్‌లు వేసి మరీ మద్యం విక్రయిస్తున్నారు. రెండ్రోజులుగా మహిళలు వీధిల్లో నుంచి ఇంటికి పోలేక పోతున్నాం. మహిళలు సాయంత్రం బజారు నుంచి ఇంటికి వెళ్లే పరిస్థితి లేదు. వీధి చివరనే మద్యం షాపు కావడంతో రోడ్డుపైనే కూర్చుని తాగుతున్నారు. రోడ్లపైనే తప్ప తాగి.. ఒంటి మీద దుస్తులు కూడా లేకుండా పడిపోయారు.
రోడ్డుకు అడ్డంగా బైక్‌లను పెట్టారు.. మేము ఇళ్లల్లో నుంచి ఎలా బయటకు రావాలి? సుమారు 100 ఇళ్లు కాలనీలో ఉన్నాయి. తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ముందు మద్యం షాపు తీసి వేయించండి’’ అంటూ మహిళలు విన్నవించారు. లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తే దుకాణం తీసేసేందుకు చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు. అప్పటి దాక మాకు రక్షణ ఇవ్వాలని మహిళలు అడగ్గా... ఆ ఏరియాల్లో పోలీసులను ఏర్పాటు చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment