రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో టీడీపీ నేత ఇంటికి రోడ్డు
మార్కాపురం మండలం దరిమడుగులో
వివాదాస్పదంగా రోడ్డు నిర్మాణం
మార్కాపురం రూరల్: బావమరిది కళ్లలో ఆనందం కోసం ప్రభుత్వ నిధులతో బావ సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం మార్కాపురం ప్రాంతంలో వివాదాస్పదమైంది. మండలంలోని దరిమడుగు గ్రామానికి చెందిన ఒక టీడీపీ నేత ఏకంగా 10 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో బావమరిది ఇంటి వరకూ రోడ్డు వేయిస్తున్నాడు. ఇప్పటికే మట్టిరోడ్డు తవ్వి కంకరచిప్స్ వేశారు. రేపోమాపో సీసీ రోడ్డు నిర్మాణం పూర్తిచేయనున్నారు. ఈ విషయం తెలుసుకున్న పలువురు గ్రామస్తులు, టీడీపీ గ్రామ కార్యకర్తలు సైతం ఆశ్చర్యం,. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మెయిన్‌రోడ్డు నుంచి సరిగ్గా బావమరిది ఇంటివరకూ రోడ్డు ఏర్పాటు చేస్తున్నాడు.
ఇప్పటికే ఈ టీడీపీ నేత వ్యవహారశైలితో ఆ గ్రామంతో పాటు టీడీపీ మండల నాయకులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇదే పంచాయతీలో ఎస్సీకాలనీతో పాటు గ్రామంలో పలు అంతర్గత రోడ్లు అధ్వానంగా మారి రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. ఈ పంచాయతీలోనే ఉన్న ఆటోనగర్‌లో రోడ్లు లేక డ్రైవర్లు, వాహనాల యజమానులు, కార్మికులు అవస్ధలు పడుతున్నారు. ఇవన్నీ ఆ టీడీపీ నేతకు కనిపించడం లేదా..? అని గ్రామస్తులతో పాటు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలే మండిపడుతున్నారు.
బావమరిది కోసం ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో సుమారు 200 మీటర్ల రోడ్డు నిర్మిస్తుండటంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో పలు ఎస్సీకాలనీల ప్రజలు సమస్యలతో సతమతమవుతుండగా, బావమరిది కోసం ప్రభుత్వ నిధులతో టీడీపీ నేత రోడ్డు నిర్మించడం తీవ్రస్థాయిలో విమర్శలకు తావిస్తోంది. దీనిపై అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలా స్పందిస్తారో వేచిచూడాలి.
Comments
Please login to add a commentAdd a comment