పచ్చ కామెర్ల పైత్యం | - | Sakshi
Sakshi News home page

పచ్చ కామెర్ల పైత్యం

Published Wed, Apr 10 2024 1:40 AM | Last Updated on Wed, Apr 10 2024 9:15 AM

- - Sakshi

పచ్చ మీడియా పైత్యం ముదిరింది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక వర్గాల సమతుల్యతను పాటిస్తూ బీసీలకు పెద్ద పీట వేయడాన్ని జీర్ణించుకోలేని వారు తమ రాతలతో వికారాన్ని వండి వార్చుతోంది. టీడీపీ అధికారంలో ఉండగా జిల్లాను జలగల్లా పీల్చి పిప్పి చేసిందే ఆ పచ్చ గ్యాంగ్‌. సంక్షేమ పథకాలు, అభివృద్ధిలో నిష్పక్షపాతంగా వ్యవహరించిన వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై విషం చిమ్ముతూ దిగజారుడు రోతరాతలు రాస్తోంది. నాటి పచ్చ దండు మకిలిని వైఎస్సార్‌సీపీకి పూసేందుకు పూనుకోవడం సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది.

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ జిల్లా అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసింది. ఆ పార్టీ ప్రజాప్రతినిధులు అభివృద్ధి పేరుతో జిల్లాను పీల్చిపిప్పి చేశారు. సహజ వనరులపై రాక్షసుల్లా పడి అడ్డంగా దోచుకున్నారు. సంక్షేమ పథకాలను రాబందుల్లా తన్నుకుపోయారు. ఇలా చెప్పుకుంటూ పోతే జిల్లాలో పచ్చగ్యాంగ్‌ ఒకొక్కరిది.. ఒక్కొక్క అరాచక చరిత్ర. మురుగు కాల్వలను, మరుగు దొడ్లను కూడా వదిలి పెట్టకుండా విచ్చలవిడిగా ప్రభుత్వ నిధులను మింగేశారు. నీరు–చెట్టు పేరుతో చేసిన దోపిడీకి లెక్కేలేదు.

ఆ పార్టీ ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి చోటా నేతల వరకూ పాల్పడిన అవినీతి, అక్రమాలు నేటికీ జిల్లా వాసులు మర్చిపోలేదు. జన్మభూమి కమిటీల పేరుతో చేసిన ఆగడాలు ఇప్పటికీ జిల్లా ప్రజల ముందు కదలాడుతూనే ఉంటుంది. ఇవన్నీ రాజగురివింద మర్చిపోయినట్టున్నారు. మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను పరిచయం చేశారో లేదో మరుసటి రోజు పచ్చ పత్రికలు ఇష్టారాజ్యంగా కథనాలు వండి వార్చి అక్కసును వెళ్లగక్కాయి. 2014 నుంచి 2019 నడుమ పచ్చదండు అరాచకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు.

అప్పుడు, ఇప్పుడూ.. కనిపించలేదా గురవిందా?
టీడీపీ పాలనలో ప్రజాప్రతినిధులు ప్రజాసమస్యలను పట్టించుకున్న పాపాన పోలేదు. ఎన్నికల సమయంలో ఆ పార్టీ అధినేత చంద్రబాబు జిల్లాకు వచ్చి అలవికాని హామీ ఇచ్చి వెళ్లిపోతుండేవారు. అవి ఒక్కటీ కూడా అమలు కాలేదు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ పథకాలను ప్రజలకు అందజేస్తూనే గ్రామాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులను చేపట్టింది. నాడు–నేడు పేరుతో ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చేసింది.

పలు ప్రభుత్వాస్పత్రులను అభివృద్ధి చేసింది. రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటుచేసి రైతుల ముంగిటకే అన్నీ తీసుకువచ్చింది. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చి ప్రభుత్వ పథకాలను ప్రజల ముంగిటకు చేర్చింది. జిల్లా వాసుల దశాబ్ధాల కల వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసింది. పశ్చిమాన కృష్ణమ్మ పరుగులు తీసేలా పలు మంచి నీటి పథకాలకు శ్రీకారం చుట్టింది. ఇలా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంతో జిల్లావాసులు వైఎస్సార్‌సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఓటమి భయంతో ఉన్న తెలుగుదేశం పార్టీని భుజానెత్తుకుని మోస్తున్న పచ్చ మీడియా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోజుకో కథనాన్ని వండివారుస్తోంది.

అభ్యర్థులపై అక్కసు
సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అధికార వైఎస్సార్‌సీపీ అభ్యర్థులపై అక్కసు వెళ్లగక్కుతూ ‘జనం మీద వదిలిన జలగలు’ అనే కథనాలను ప్రచురించింది. వాస్తవానికి అధికార పార్టీ జిల్లాలో అన్నీ వర్గాలకు ప్రాధాన్యతనిస్తూ అభ్యర్థులను ఎంపిక చేసింది. కనిగిరి నుంచి యాదవ సామాజిక వర్గానికి చెందిన దద్దాల నారాయణ యాదవ్‌ అనే ఒక సామాన్యుడికి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీటు ఇచ్చి పోటీకి అవకాశం కల్పించారు. ఒక సామాన్యుడికి సీటు ఇవ్వడం సహించలేని ఎల్లో మీడియా ఆయన మీద తప్పుడు ప్రచారానికి పూనుకుందని జిల్లాలోని యాదవ సంఘాల నాయకులు మండి పడుతున్నారు. ఒక పక్క టీడీపీలో జిల్లా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న నూకసాని బాలాజీ యాదవ్‌ను అడుగడుగునా అవమానాలకు గురి చేయడమే కాకుండా ఆయనకు సీటు ఇవ్వకుండా ద్రోహం చేసిన టీడీపీ నాయకులు కనిగిరిలో పోటీ చేస్తున్న నారాయణ యాదవ్‌పై లేనిపోని ఆరోపణలు చేయడమేంటని బీసీ సంఘాలు మండి పడుతున్నాయి. అయినా 2014 నుంచి 2019 వరకు జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు, నాయకులు చేసిన అవినీతి , అరాచకాలు పచ్చమందకు కనిపించక పోవడంలో విడ్డూరమేమి నని, నాటి అరాచకాలను జిల్లావాసులు ఇప్పటికీ కథలు కథలుగా చెప్పుకుంటున్నారు.

అవినీతికి చిరునామా ధనార్జన్‌ :
ఒంగోలు నుంచి పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్‌ను ఇక్కడి ప్రజలు ముద్దుగా డ్రామచర్ల ధనార్జన్‌ అని పిలుచుకుంటారు. 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన ఎమ్మెల్యేగా వెలగబెట్టిన ఐదేళ్లూ ప్రజలకు నరకం చూపించారు. ఆయన హయాంలో సొంత సామాజిక వర్గం తప్ప మిగిలిన సామాజిక వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక అవినీతిలో దామచర్ల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కొత్తపట్నం, ఈతముక్కల రోడ్డు నిర్మాణం విషయంలో పర్సంటేజీలు తీసుకొని తన అనుయాయులకు కట్టబెట్టేందుకు చేసిన ప్రయత్నాలు జిల్లా ప్రజలందరికీ తెలుసు.

అప్పుడు తనకు వ్యతిరేకంగా టెండరు వేసిన చీమకుర్తికి చెందిన ఒక మాజీ మండలాధ్యక్షుడి ఇంటిని పగులగొట్టించేందుకు ప్రయత్నించడం సంచలం సృష్టించింది. నగరంలోని పాత చేపల మార్కెట్‌ వద్ద నుంచి మాగుంట సుబ్బరామిరెడ్డి విగ్రహం వరకు నిర్మించిన మురుగు కాలువ ప్రారంభించకుండానే కూలిపోయింది. కాంట్రాక్టర్లకు మాత్రం బిల్లులు పాసైపోయాయి. పింఛన్‌ ఇవ్వాలన్నా, పక్కా గృహాలు మంజూరు చేయాలన్నా పైసలు ఇవ్వందే పనులు చేసేవారు కాదన్నది ప్రతి ఒక్కరికి తెలిసిందే. చివరికి పసుపు కుంకుమ పథకానికి కూడా జన్మభూమి కమిటీలు డబ్బులు వసూలు చేయడం విమర్శల పాలైంది.

ఇక ఆర్యవైశ్య సోదరులు వ్యాపారాలు చేసుకోకుండా అధికారుల ద్వారా దాడులు చేయించి వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. కర్నూలు రోడ్డులో ఒక వ్యాపారి వద్ద రూ.40 లక్షలు అప్పు తీసుకొని తిరిగి ఇవ్వలేదన్న ఆరోపణలు ఉన్నాయి. తనకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడిగి అడిగి అలసిపోయిన ఆయన అదే బాధతో మరణించాడని చెబుతారు. ఇలాంటి అప్పు కథలు చాలా ఉన్నాయని తెలిసింది. అద్దంకి బస్టాండ్‌ సెంటర్లో ముస్లింలకు చెందిన దుకాణాలను పడగొట్టించడంతో పాటుగా ఆ సామాజిక వర్గానికి వ్యతిరేకంగా అనేక సార్లు నేరుగా విమర్శలు చేయడం గురించి ముస్లిం సోదరులు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.

హిమ్‌బాబా... ఆత్మహత్య రాగం
నాకు ఇవే చివరి ఎన్నికలు..ఈ సారి నన్ను గెలిపించకపోతే ఆత్యహత్య చేసుకుంటానంటున్నాడు మార్కాపురం తెలుగుదేశం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి. మార్కాపురం ప్రజలు 2009లో ఒకసారి ఓట్లేసి గెలిపించారు. నిజంగానే ప్రజా సేవ చేస్తాడేమో అనుకున్నారు. అయితే నారాయణరెడ్డి గెలిచిన తరువాత తన అసలు రూపం చూపించాడు. విపరీతంగా అవినీతికి పాల్పడ్డారు. నీరు చెట్టు పనులు చేయకుండానే కోట్లాది రుపాయలు బిల్లులు పాస్‌ చేసుకున్నాడు. నియోజకవర్గంలో ఒక్క ఇంకుడు గుంత తీయకుండానే కోట్లు డబ్బులు జేబులో వేసుకున్నాడు. ఇక హిమ్‌ సంస్థ అక్రమాలతో నారాయణరెడ్డి పేరు రాష్ట్రం అంతటా పాకింది.

నిరుపేద ప్రజలు, దళితులు, బీసీల నుంచి హిమ్‌ అనే సంస్థ డబ్బులు వసూలు చేసి ఒట్టి చేతులు చూపింది. మోసపోయిన ప్రజలు పోలీసుస్టేషన్‌లో కేసులు కూడా పెట్టారు. ఈ కేసు విచారణలో నారాయణరెడ్డి కీలకమైన వ్యక్తిగా బయటపడింది. దాంతో ఆయన మీద కూడా కేసు నమోదైంది. అప్పట్లో తెలుగుదేశం పార్టీ మద్దతులో పరిపాలన చేసిన కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో కేసును కొట్టివేయించుకున్నట్లు తెలుస్తుంది. ఆ తరువాత ఇక్కడి ప్రజలు ఆయనను ఓడించి ఇంటికి పరిమితం చేశారు. ఇప్పుడు మళ్లీ ఆయన సేవ చేసే అవకాశం ఇవ్వమని అడుగుతుంటే మార్కాపురం ప్రజలు భయపడిపోతున్నారు.

బావ కళ్లలో ఆనందం కోసం...
బావ కళ్లల్లో ఆనందం కోసం బావమర్ది డబ్బులు వసూళ్లకు పాల్పడడం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన ముత్తముల అశోక్‌రెడ్డి ఆ తరువాత నాడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయారు. ఎప్పుడైతే భుజాన పచ్చ కండువా వేసుకున్నాడో అతడిలో అవినీతి పరుడు బయటపడ్డాడు. అతడు ఎమ్మెల్యేగా బడా కాంట్రాక్టు పని పడుతుంటే ఆయన బావమర్డి ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార సంస్థల చుట్టూ తిరుగుతూ బావ కళ్లలో ఆనందం కోసం వసూళ్లకు పాల్పడేవాడు. నీరు చెట్టులో చెక్‌డ్యాంలు, కుంటలంటూ భారీగా బిల్లులు చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. సీసీ రోడ్లు వేసి కమీషన్లు దండుకున్నట్లు విమర్శలున్నాయి.

స్వామి ...మరుగుదొడ్డి నిధులు మింగేశాడు..
ఆయన పేరుకు మాత్రమే ఎమ్మెల్యే . పెత్తనం అంతా దామచర్ల సత్యదే. దామచర్ల కుటుంబ ప్రయోజనాల కోసం నియోజకవర్గ ప్రజలను ద్రోహం చేసిన ఆయన కొండపిలో ఇసుక స్వామిగా పేరొందాడు. 2014, 2019లో రెండు సార్లు గెలిచిన డోలా బాలాంజనేయ స్వామి నియోజక వర్గం కోసం చేసిందేమీ లేదని ప్రజలు మండిపడుతున్నారు. నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేసి దామచర్ల సత్యకు నమ్మిన బంటుగా పనిచేస్తున్నాడని విమర్శలు ఉన్నాయి. కొండపి నియోజకవర్గంలోని సింగరాయకొండ మండలం పాకల వద్ద పాత పాలేరుపై చెక్‌డ్యాం నిర్మాణాన్ని అడ్డుకున్న చరిత్ర స్వామిది.

ఈ చెక్‌డ్యాం నిర్మాణం జరిగితే 500 ఎకరాల ఆయకట్టుకు ప్రయోజం చేకూరుతుంది. భూగర్భ జలాలు పెరిగి నియోజకవర్గంలో మంచినీటి సమస్య పరిష్కారం అవుతుంది. కానీ ఈ ప్రాంతంలో దామచర్ల పూర్ణచంద్రరావుతో పాటుగా దామచర్ల బంధువులకు రొయ్యల చెరువులు ఉన్నాయి. చెక్‌డ్యాం నిర్మిస్తే ఈ రొయ్యల చెరువులకు దెబ్బ పడుతుంది. అయితేనేం ప్రజల ప్రయోజనాల కంటే దామచర్ల ప్రయోజనాలే స్వామికి ముఖ్యం కనుక ఈ డ్యాంను అడ్డుకున్నాడని రైతులు మండిపడుతున్నారు. ఇక చంద్రబాబు పాలనలో స్వామి ఎగబడి అవినీతికి పాల్పడినట్లు విమర్శలు వెత్తాయి. మరుగుదొడ్ల నిర్మాణాల నుంచి మొదలుకొని మురుగు కాలువల వరకు దేనిని వదిలిపెట్టకుండా అవినీతికి పాల్పడ్డారు. ఇసుక దందాలో జిల్లాలోనే పేరొందాడు.

అరాచకాలకు కేరాఫ్‌ ఉగ్ర...
కనిగిరి నియోజకవర్గం నుంచి 2009లో విజయం సాధించిన ఉగ్ర నరసింహారెడ్డి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులకు గురైనట్లు ప్రచారం జరుగుతోంది. ఉగ్ర ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో అతడి అనుచరులు చేసిన అరచకాలు అన్నీ ఇన్నీ కావు. సామాన్యులు, మధ్య తరగతి ప్రజలు దినదిన గండంగా రోజులు గడిపారని చెప్పుకుంటారు. ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పేరుతో పేదలకు ఇవ్వాల్సిన భూములను తన అనుచరులకు కట్టబెట్టినట్లు నియోజకవర్గ ప్రజలు ఇప్పటికీ చెప్పుకుంటున్నారు. ఇక విలువైన ప్రభుత్వ, ప్రైవేటు భూములను కాజీసినట్లు ఆరోపణలున్నాయి.

ఎక్కడా ఖాళీ భూమి కనిపిస్తే అక్కడ ఉగ్ర గ్యాంగ్‌ ప్రత్యక్షమయ్యేవాళ్లు. ఇక ఉద్యోగులు, వ్యాపారులను పీల్చి పిప్పి చేసినట్లు విమర్శలున్నాయి. ఎవరైనా ఇదేంటని ప్రశ్నిస్తే వారి మీద దాడులకు పాల్పడేవారు. ఉగ్ర హయాంను కనిగిరి ప్రజలు చీకటి రోజులుగా చెప్పుకుంటారు. తాజాగా అవ్వాతాత పింఛన్ల పంపిణీపై అవహేళనగా, అహంకారిక పూరితంగా చేసిన వాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. రూ. 3 వేల పింఛన్‌ లేక పోతే చచ్చిపోతారా అంటూ చేసిన వాఖ్యలపై వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు మండిపడుతున్నారు.

ఒకటే పని..రెండు బిల్లులు.. ఇది గూడూరి ప్రత్యేకత...
కనిగిరి నియోజకవర్గం నుంచి దిగుబడైన గూడూరి ఎరిక్షన్‌ బాబు స్టయిలే వేరు. ఆయన వెలిగండ్ల జెడ్పీటీసీగా పనిచేశాడు. తెలుగుదేశం హయాంలో జన్మభూమి కమిటీలను అడ్డం పెట్టుకొని పెద్ద మొత్తంలో నిధులను స్వాహా చేసినట్లు ఆరోపణలున్నాయి. వెలిగండ్లలో మట్టిరోడ్లు వేయకుండానే వేసినట్లు భారీగా నిధులను గోల్‌మాల్‌ చేసినట్లు సమాచారం. కనిగిరి నుంచి వెలిగండ్లకు, వెలిగండ్ల నుంచి కనిగిరికి రోడ్డు వేసినట్లు ఒకే పనికి రెండు బిల్లులు చేసిన ఘనాపాటి గూడూరి. ఇక రియల్‌ ఎస్టేట్‌ పేరుతో అనేక మంది నెత్తిన శఠగోపం పెట్టినట్లు ఇక్కడి ప్రజలు చెప్పుకుంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/2

2
2/2

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement