అధికారంలోకొస్తే నీళ్లిస్తానంటూ వెలిగొండపై గారడీ మాటలు
మూడు నెలల ముందు మాగుంటపై నిప్పులు.. నేడు ప్రశంసలు
రామాయపట్నం, ప్రత్యేక హోదాపై దొంగాట
కందుల ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్
జనం లేక చంద్రబాబు ప్రజాగళం అట్టర్ ఫ్లాప్
టీడీపీ అధినేత చంద్రబాబు అట్టహాసంగా చేపట్టిన ప్రజాగళం యాత్ర ప్రజలు లేక వెలవెల బోయింది. గంట ఆలస్యంగా వచ్చినా జనం లేక ఏకంగా రోడ్‌షోనే రద్దు చేసుకుని మొక్కుబడిగా సభపెట్టి మమ అనిపించారు. తాను అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ మార్కాపురం వైపు కన్నెత్తి చూడని.. అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విదల్చని బాబు తాను మళ్లీ అధికారంలోకి వస్తే మార్కాపురంలో నీటి సమస్య తీరుస్తానని చెప్పడంపై జనం మండిపడుతున్నారు. రామాయపట్నం పోర్టు, ప్రత్యేక హోదాపైనా అడ్డగోలుగా అబద్ధాలు మాట్లాడటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
మార్కాపురం, మార్కాపురం టౌన్: మార్కాపురంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదివారం నిర్వహించిన ప్రజాగళం యాత్ర అబద్ధాల మాటల గారడీతో జనం లేక అట్టర్ ఫ్లాప్ అయింది. 2014 నుంచి 2019 వరకూ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు పశ్చిమ ప్రకాశంపై నిర్లక్ష్యపు చూపు చూశాడు. అప్పట్లో ఉమ్మడి జిల్లాకు 8 సార్లు వచ్చినా మార్కాపురం ప్రాంతం వైపు కన్నెత్తి చూడలేదు. వచ్చిన ప్రతిసారీ వెలిగొండ ప్రాజెక్టు పూర్తిచేసే గడువు దసరాకి.. సంక్రాంతికి..ఉగాదికి అదిగో.. ఇదిగో.. అంటూ ఐదేళ్లు కాలం గడిపాడు. మళ్లీ ఆదివారం నాటి ప్రజాగళం సభలో వెలిగొండ ప్రాజెక్టు పునాది వేసింది తానేననీ, నీళ్లిచ్చేది తానేనంటూ ప్రకటించడంపై ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. ఈ ప్రాజెక్టును గత నెలలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పూర్తిచేసి జాతికి అంకితం చేశారు.
ఆ విషయం కూడా ఆయనకు తెలియక తాను అధికారంలోకి రాగానే నదులను అనుసంధానం చేసి నీళ్లిస్తానని చెప్పడంపై ప్రజలు అబద్ధాల బాబు మాటలపై మండిపడుతున్నారు. రామాయపట్నం పోర్టుపై కూడా మాట్లాడిన చంద్రబాబు తాను అధికారంలోకి వస్తే పూర్తిచేస్తానని చెప్పడంపై ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం చివర్లో రామాయపట్నం పోర్టును మినీ పోర్టుగా మార్చి హడావుడిగా టెంకాయ కొట్టి వదిలేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే రామాయపట్నం పోర్టు పనులు శరవేగంగా చేపట్టడమేకాక..దాదాపు నిర్మాణం పూర్తి చేస్తున్నారు.
చంద్రబాబు పర్యటనలో ప్రయాణికుల కష్టాలు
పొదిలి రూరల్: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మార్కాపురం పర్యటన సందర్భంగా గంటపాటు తర్లుపాడు రోడ్డులో అల్లూరి పోలేరమ్మ గుడి వద్ద బస్సులు, ఆటోలు, కార్లు, బైకులు ఆపటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అత్యవసర పనుల మీద మార్కాపురానికి వచ్చేవారు మార్గమధ్యంలోనే తమ వాహనాల్లో సుమారు గంట పాటు కూర్చోవాల్సి వచ్చింది. ఇదేం ఖర్మరా బాబూ అంటూ అవస్థలు పడ్డారు. పాత బస్టాండులో మూడున్నర గంటలకు బహిరంగ సభ అని ప్రకటించినప్పటికీ జనాలు లేకపోవంతో చంద్రబాబు హెలీప్యాడ్ వద్ద ఉన్న బస్సులోనే అరగంట సేపు కూర్చున్నారు. దీంతో ఆయన కాన్వాయ్ బయలుదేరేంత వరకూ పోలీసులు తర్లుపాడు రోడ్డులో రాకపోకలు నిలిపేశారు. అసలే ఎండాకాలం, ఆపై బస్సుల్లో కార్లలో ఉన్నవారు ఉక్కపోతకు అల్లాడారు. గర్భిణులు, పిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారు.
పోలీసుల అత్యుత్సాహం
తర్లుపాడు: చంద్రబాబు ప్రజాగళం యాత్రలో కొందరు పోలీసులు అత్యుత్సాహం చూపారు. బాబుపై ఉన్న మమకారాన్ని, ప్రేమను పోగొట్టుకోలేక పట్టణంలోని వివిధ షాపులను బలవంతంగా మూసివేయించారు. దీంతో అత్యంత పవిత్రంగా జరుపుకునే ఈస్టర్ పర్వదినం రోజున క్రైస్తవ సోదరులు ఇబ్బందులు పడ్డారు. హెలీప్యాడ్ నుంచి సభాస్థలికి రెండు కిలోమీటర్ల మేర చిరువ్యాపారులు, తోపుడు బండ్ల వ్యాపారులపై పోలీసుల కాఠిన్యం చూపారు. చివరకు జనాలు లేక చంద్రబాబు రోడ్‌షో రద్దు చేసుకోవడంతో ఇంతదానికి తమను ఇబ్బందులు పెట్టడం ఎందుకని పలువురు చిరు వ్యాపారులు, దుకాణదారులు పెదవి విరిచారు.
జిల్లాపై మాయమాటలు
అధికారంలో ఉన్న ఐదేళ్లు పశి్చమ ప్రకాశంపై కపట ప్రేమ చూపిన చంద్రబాబు సీట్లు, ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టేందుకు మార్కాపురాన్ని జిల్లా చేస్తానని ప్రకటించాడు. పశి్చమ ప్రకాశం వైఎస్సార్ సీపీకి పట్టున్న ప్రాంతమని అధికారంలో ఉన్న ఐదేళ్లు ఒక్కరూపాయి ఇవ్వకుండా ప్రతిపక్ష నేత హోదాలో మాత్రం ఇప్పటికి రెండు సార్లు మార్కాపురానికి వచ్చి చూపుతున్న కపట ప్రేమను కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఐదేళ్లపాటు అప్పటి బీజేపీ ప్రభుత్వంతో పొత్తుపెట్టుకుని ప్రత్యేక హోదా మాట మరిచి మళ్లీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం పట్ల ప్రజలు ముక్కున వేలేస్తున్నారు. ఐదేళ్లు అధికారంలో ఉండీ మార్కాపురం మున్సిపాలిటీకి తాగునీటి కోసం ఒక్కరూపాయి కూడా విడుదల చేయకుండా కాలం గడిపిన చంద్రబాబు సభలో తనను అధికారంలోనికి తీసుకొస్తే ఎస్‌ఎస్ ట్యాంకు కడతానని ప్రకటించడాన్ని ప్రజలు నమ్మలేదు. గతేడాది మార్కాపురం మున్సిపాలిటీలో పైపులైన్ల మరమ్మతులు, కొత్తపైపులైన్ల ఏర్పాట్లు, తాగునీటి ఎద్దడికి రూ.24 కోట్లను సీఎం జగన్ విడుదల చేశారు.
కందుల ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్
టీడీపీ మార్కాపురం అభ్యర్థి కందుల నారాయణరెడ్డి తన ప్రసంగంలో మాట్లాడిన మాటలు ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌గా ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఎన్నికలే నాకు చివరి అవకాశం.. పొరపాటు జరిగితే నా శవాన్ని చూడాల్సి వస్తుందన్న కందుల మాటలు ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగేనని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఓటమి భయంతోనే ఇలా మాట్లాడారన్న అభిప్రాయం వ్యక్తమైంది. వీటిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నారు.
అంతలోనే ఇంతటి కపట ప్రేమా ?
సరిగ్గా మూడు నెలల క్రితం లిక్కర్ స్కామ్‌లో ఉన్న ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి తనయుడు మాగుంట రాఘవరెడ్డిని టీడీపీ నేతలు తీవ్రంగా విమర్శించారు. తాజాగా మార్కాపురం సభలో చంద్రబాబు సేవా భావం కలిగిన పెద్దమనిషి మాగుంట అని సంభోదించటం పట్ల ప్రజలు నవ్వుకున్నారు. మూడు నెలల క్రితం అదే నోటితో విమర్శించి మళ్లీ పొగిడిన చంద్రబాబు అబద్ధాలు అనర్గళంగా మాట్లాడగలడని మరోసారి రుజువైందని ఆ పార్టీ కార్యకర్తలే బహిరంగంగా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment