యర్రగొండపాలెం నియోజకవర్గంలో వరుస పరాజయాలను మూటగట్టుకున్న తెలుగుదేశం పార్టీ పరిస్థితి రోజు రోజుకూ దిగజారిపోతోంది. నియోజకవర్గంలో అసమ్మతి బుసలు కొడుతోంది. పార్టీ సీనియర్ నేతకు, నియోజకవర్గ ఇన్‌చార్జికి మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటున్నాయి. ఒకరిపై ఒకరు సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇరువర్గాలు కారాలు మిరియాలు నూరుతున్నాయి.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: యర్రగొండపాలెంలో డాక్టర్ మన్నె రవీంద్ర కారణంగా ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవడం లేదు. అతని దరిద్రాన్ని వదిలిస్తాం. టీడీపీని గెలిపించి మా సత్తా చూపుతాం
– నియోజకవర్గ ఇన్‌చార్జి, ఎరిక్షన్ బాబు వర్గం
ఎరిక్షన్ బాబు పార్టీలో గ్రూపులను ప్రోత్సహిస్తున్నాడు. సీనియర్ నాయకులను కలుపుకొని పోవాలనే ఆలోచన అతనికి లేదు. ఎరిక్షన్ బాబుకు సీటు ఇస్తే సహకరించేది లేదు
– డాక్టర్ రవీంద్ర వర్గం
ఇది యర్రగొండపాలెంలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి. నిత్యం గ్రూపు తగాదాలతో తెలుగు తమ్ముళ్లు సిగపట్లు పడుతున్నారు. సందు దొరికితే చాలు ఒకరిపై ఒకరు తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించుకుంటున్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయికి విభేదాలు చేరుకున్నాయి. సోషల్ మీడియా వేదికగా పరస్పర ఆరోణలు చేసుకుంటున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి ఎరిక్షన్ బాబు, సీనియర్ నాయకుడు డా.రవీంద్ర వర్గాల మధ్య ఉప్పు నిప్పులా ఉంది పరిస్థితి. సాక్షాత్తు అధినేత చంద్రబాబు చెప్పినా ఇరువర్గాల నేతలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కత్తులు దూసుకోవడం మానడం లేదు. నిన్నామొన్నటి వరకు తెరచాటున కొనసాగిన గ్రూపు తగాదాలు గత బుధవారం విలేకరుల సమావేశంతో భగ్గుమన్నాయి.
రానున్న ఎన్నికల్లో ఎరిక్షన్ బాబుకు సీటు ఇస్తే తామ సహకరించేది లేదంటూ రవీంద్ర వర్గం బహిరంగంగా ప్రకటించడం నియోజకవర్గంలో సంచలనంగా మారింది. ఈ పరిణామాలు పార్టీ కేడర్‌ను మరింత అయోమయంలో పడేశాయి. పార్టీ ఆవిర్భావం నుంచి యర్రగొండపాలెంలో డాక్టర్ రవీంద్ర పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. వేగినాటి కోటయ్య మరణం తర్వాత ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చిన ఆయన క్రమంగా టీడీపీలో పట్టు పెంచుకొన్నారు. అధినేత చంద్రబాబు సొంత సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కావడంతో ఇన్నాళ్లూ ఆయన ఆధిపత్యం కొనసాగింది. నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2009లో యర్రగొండపాలెం నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి టీడీపీ వరుస ఓటములతో పడరాని పాట్లు పడుతోంది.
ఎస్సీ నియోజకవర్గమైన యర్రగొండపాలెం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా మారింది. 2014, 2019 ఎన్నికల్లో ఇక్కడ నుంచి టీడీపీ తరఫున బరిలోకి దిగిన బూదాల అజితారావు వైఎస్సార్ సీపీ అభ్యర్థుల చేతిలో ఓటమి పాలయ్యారు. ఎన్నికల అనంతరం ఆమె నియోజకవర్గ ప్రజలకు ముఖం చాటేశారు. ఈ క్రమంలో టీడీపీ అధిష్టానం గూడూరి ఎరిక్షన్ బాబును నియోజకవర్గ ఇన్‌చార్జిగా నియమించింది. ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గ్రూపు తగాదాలు ఎక్కువయ్యాయి. అధిష్టానంతో సన్నిహిత సంబంధాలు కలిగిన ఎరిక్షన్ బాబు పార్టీలో రవీంద్ర వర్గాన్ని పూర్తిగా పక్కన పెట్టారు. రవీంద్ర వర్గం దీన్ని జీర్ణించుకోలేకపోయింది. దీంతో ఇద్దరు నాయకుల మధ్య దూరం పెరుగుతూ వచ్చింది.
సోషల్ మీడియా వేదికగా..
యర్రగొండపాలెం నియోజకవర్గంలో డాక్టర్ రవీంద్ర వ్యవహార శైలి వల్లే టీడీపీ ఓడిపోతోందని ఎరిక్షన్ బాబు వర్గం సోషల్‌మీడియా వేదికగా ఆరోపిస్తోంది. అజితారావు ఓటమికి రవీంద్ర వెన్నుపోటు రాజకీయాలే కారణమని విమర్శలు గుప్పించడంతోపాటు టీడీపీ నుంచి రవీంద్రను సస్పెండ్ చేయిస్తామంటూ చాలెంజ్ చేశారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న తనను సస్పెండ్ చేసే మగాడే పుట్టలేదంటూ రవీంద్ర కౌంటర్ ఇచ్చారు. రవీంద్ర వ్యవహారశైలిని అధినేత చంద్రబాబుకు ఎరిక్షన్ వర్గం వివరించడంతో సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం.
అయితే రవీంద్ర సామాజికవర్గానికి చెందిన దామచర్ల జనార్దన్ రంగప్రవేశం చేశారు. చంద్రబాబుపై ఒత్తిడి తెచ్చి రవీంద్ర సస్పెన్షన్‌ను అడ్డుకున్నారు. ఈ పరిణామాలు ఇరువర్గాల మధ్య మరింత దూరం పెంచాయి. ఆ మధ్య యర్రగొండపాలెం పర్యటనకు వచ్చిన చంద్రబాబు ఎరిక్షన్ బాబు అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేస్తూ ప్రకటన ఇచ్చారు. ఇరువర్గాలు కలిసి పని చేయాలని సూచించారు. కొంత కాలం ఇరువర్గాల నాయకులు కలిసి పనిచేసినట్టే కనిపించారు. అయితే బుధవారం మీడియా వేదికగా రవీంద్రబాబు ఎరిక్షన్ బాబుపై ఆరోపణలు గుప్పించడంతో ఆ ముచ్చట కూడా మున్నాళ్లకే ముగిసింది.
ఇదిలా ఉండగా ఎరిక్షన్ బాబు సైతం తన వర్గం మనుషులతో రవీంద్రబాబుపై ఆరోపణలు చేయిస్తున్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జిగా బాధ్యత కలిగిన పదవిలో ఉన్న నాయకుడు అందరినీ కలుపుకొని పోకుండా చిల్లర వ్యక్తులతో విమర్శలు చేయిస్తున్నారని రవీంద్ర వర్గం ఎరిక్షన్ బాబు మీద మండిపడుతోంది. ఈ క్రమంలోనే రవీంద్ర వర్గానికి చెందిన మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ఆంజనేయులు, మైనారిటీ నాయకుడు షేక్ జిలానీ విలేకరుల సమావేశం పెట్టి ఎరిక్షన్ బాబుకు సీటు ఇస్తే సహకరించేది లేదంటూ కుండబద్దలు కొట్టారు. ఇక లాభం లేదని, అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాలని రవీంద్ర వర్గం భావిస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది.
రాజీనామా దిశగా రవీంద్ర వర్గం
బాబుకు బదులుగా బూదాల అజితారావుకు సీటు ఇవ్వాలని రవీంద్ర వర్గం అధిష్టానం వద్ద ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. ఆమెను అభ్యర్థిగా పోటీకి నిలబెడితే తామంతా సహకరిస్తామని, గతంలో రెండు సార్లు ఓటమి చెంది ఉండటంతో సానుభూతి కూడా కలిసొస్తుందని చెబుతున్నారు. ఒకవేళ ఎరిక్షన్ బాబు అభ్యర్థిత్వం వైపే అధిష్టానం మొగ్గు చూపితే పార్టీకి రాజీనామా చేయాలని రవీంద్ర వర్గం భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకవేళ మాజీ శాసనసభ్యుడు డేవిడ్‌రాజు కనుక కాంగ్రెస్ సీటు తెచ్చుకుంటే ఆయన విజయానికి పాటుపడాలని, తద్వారా ఎరిక్షన్ బాబును దెబ్బతీయాలని రవీంద్ర వర్గం ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment