సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. రాజకీయ పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలోని అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. ప్రతిపక్ష టీడీపీ కూటమి ఇంతవరకూ దర్శి స్థానానికి అభ్యర్థి ఎవరో తేల్చుకోలేక మల్లగుల్లాలు పడుతోంది. ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులను మార్చగా, తెలుగుదేశం అనుకూల మీడియా రోజుకో పేరును ప్రచారంలోకి తెస్తూ ఆ పారీ్టల కేడర్‌ను గందరగోళంలోకి నెట్టేస్తున్నాయి.
సాక్షి ప్రతినిధి,ఒంగోలు: జిల్లాలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలు ఉండగా ఏడు నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఖరారు చేసిన కూటమి పార్టీలు ఒక్క ’దర్శి’ లో మాత్రమే అభ్యర్థిని ఖరారు చేయలేక ఆపసోపాలు పడుతున్నాయి. ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ ప్రచారంలో దూసుకుపోతుంటే.. ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి మాత్రం ఇక్కడ అభ్యర్థిని ఎవరిని నియమించాలో తెలియక మల్లగుల్లాలు పడుతున్నాయి.
ఒక వైపు ఐవీఆర్‌ఎస్ ద్వారా టీడీపీ రోజుకొక పేరును తెరపైకి తెస్తోంది. ఇంకో వైపు టీడీపీ అనుకూల మీడియా మరో మెట్టు ఎక్కి.. కొత్త కొత్త ముఖాల పేర్లు చెబుతూ కూటమి పార్టీల కేడర్ నే కాకుండా.. దర్శి ప్రజలను సైతం డైలామాలో పడేస్తున్నారు. వాస్తవంగా ఈ స్థానం నుంచి జనసేన నేతలు పోటీ చేయాలని భావించారు. అయితే ఇక్కడ నుంచి తామే పోటీ చేయాలా? జనసేనకు ఇవ్వాలా? అనే అంశాన్ని తేల్చుకోలేకపోతోంది టీడీపీ నాయకత్వం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా ఇంతవరకూ స్పష్టత రాకపోవడం గమనార్హం.
ఆది నుంచి ఇదే తంతు..
దర్శి నియోజకవర్గానికి సంబంధించి ఐదేళ్లుగా తెలుగుదేశం పార్టీలో గందరగోళం నెలకొని ఉంది. 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన కదిరి బాబురావు ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అప్పుడు మొదలైన సమస్య నేటికీ కొనసాగుతోంది. బాబురావు వెళ్లిపోయిన తర్వాత టీడీపీ అధిష్టానం స్థానిక నాయకులను కాదని ఒంగోలుకు చెందిన పమిడి రమేష్‌కు పార్టీ బాధ్యతలు అప్పగించింది. ఆయన కొంత కాలం పార్టీ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రయత్నించారు. పెద్దగా ప్రయోజనం కనిపించకపోవడంతో సైకిల్ దిగి వెళ్లి పోయారు. దాంతో ఏడాదిన్నర నుంచి దర్శి టీడీపీకి నాయకుడు లేకుండా పోయారు.
తెరపైకి జనసేన..
పడమిడి పార్టీని వీడిన తర్వాత ఈ సీటుపై జనసేన నేతలు ఆశలు పెట్టుకున్నారు. గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన ఎన్నారై గరికపాటి వెంకట్ దర్శికి వచ్చి పార్టీ కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. దీంతో కూటమి తరఫున ఈ సీటు జనసేనకు కేటాయిస్తారని ప్రచారం జరుగుతూ వచ్చింది. అయితే వెంకట్.. లోకేష్ సూచనల మేరకే ఇక్కడకు వచ్చి హడావుడి చేశారని ప్రచారం కూడా ఉంది. ఈ సీటును టీడీపీకి కేటాయిస్తారని ప్రచారం జరగడంతో కొద్ది రోజులుగా గరికపాటి వెంకట్ అదృశ్యమయ్యారు. గరికపాటి ఎక్కడా అంటే పార్టీ నేతల నుంచి సరైన సమాధానం రావడంలేదు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ఉన్నట్లు సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రెండు రోజులుగా ఆయన పేరు టీడీపీ పరిశీలినలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా బాచిన కృష్ణచైతన్యను ఇన్‌చార్జిగా టీడీపీ నియమించింది. అయితే జనసేన తరఫున టికెట్ ఇస్తామని, గ్లాసు గుర్తుపై పోటీ చేయాలని పార్టీ అధిష్టానం ఆదేశించినట్టు తెలిసింది. ఆయన దీనికి ససేమిరా అన్నట్టు తెలిసింది. బాచిన చీరాల సీటు అడుగుతున్న సమాచారం. ఇదిలా ఉండగా గొట్టిపాటి నర్సయ్య కుమార్తె లక్ష్మి పేరును పరిశీలించినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆమె నర్సరావుపేటలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె మామ డాక్టర్ కడియాల వెంకటేశ్వరరావు నరసరావుపేట సీటు ఆశించారు.
నర్సరావుపేట ఇవ్వడం కుదరదని, జనసేనలో చేరితే దర్శిని నుంచి పోటీ చేసేందుకు అవకాశం కల్పిస్తామని చంద్రబాబు చెప్పినట్టు తెలిసింది. దీనికి వారు తిరస్కరించారని సమాచారం. సుమారు పది రోజుల కిందట ఒక కళాశాల అధిపతి గోరంట్ల రవికుమార్‌ను నియోజకవర్గ ఇన్‌చార్జిగా టీడీపీ నియమించింది. రెండు రోజుల క్రితం తెలుగు దేశం పార్టీ నిర్వహించిన ఐవీఆర్‌ఎస్ సర్వేలో గరికపాటి వెంకట్ పేరు ఉంది. ఇంతకూ గరికపాటిని టీడీపీ తరుఫున బరిలోకి దించుతారా లేక జనసేన నుంచి పోటీ పెడతారా అనేది తెలియక కేడర్ తలలు పట్టుకుంటోంది.
మీడియాలో రోజుకో పేరు..
తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఈ నియోజకవర్గం నుంచి ఫలానా వారు పోటీ చేస్తారంటూ రోజుకో కొత్త పేరును ప్రచారంలోకి తీసుకొస్తోంది. పాత కాపులెవరూ పార్టీలో లేకపోవడం, కొత్త నేతలు పెద్దగా ఆసక్తి చూపకపోవడంతో తెలుగుదేశం పార్టీ గందరగోళంలో ఉంది. ఈ రోజు..రేపు అంటూ వాయిదాల పర్వం కొనసాగుతోంది. చివరి ప్రయత్నంగా టీడీపీ ఐవీఆర్‌ఎస్ సర్వే చేపట్టింది. ఈ సర్వేలో గరికపాటి, గోరంట్ల వైపే మొగ్గు చూపినట్లు తెలిసింది. ఈ ఇద్దరిలో ఒకరికి పట్టం కట్టబెడతారో లేక కొత్త వారిని దిగుమతి చేస్తారో వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment