భక్తవ శంకర లోక శుభంకర | ugadi celebrations in kurnool district | Sakshi
Sakshi News home page

భక్తవ శంకర లోక శుభంకర

Published Sun, Mar 22 2015 11:31 AM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM

ugadi celebrations in kurnool district

శ్రీశైలం: తెలుగు సంవత్సరాది.. ఉగాది పర్వదినాన జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం భక్తజనంతో పోటెత్తింది. భక్తవ శంకర..లోక శుభంకర నమోనమో అంటూ సుమారు మూడు లక్షలకుపైగా భక్తులు శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. ఈ నెల 18 నుంచి నిర్వహిస్తున్న ఉగాది మహోత్సవాల్లో భాగంగా శనివారం రథోత్సవాన్ని నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రథాంగపూజ, రథాంగహోమం, రథాంగబలి జరిపారు. అనంతరం శ్రీభ్రమరాంబా మల్లికార్జునస్వామివార్ల రథోత్సవం రమణీయంగా సాగింది. స్వస్తిశ్రీ మన్మథనామ సంవత్సరప్రారంభం సందర్భంగా స్వామిఅమ్మవార్ల ఆలయాల్లో సుప్రభాత సేవ, మహా మంగళ హారతి, పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పల్లకిలో ఊరేగిస్తూ మేళతాళాల మధ్య ఆలయ ప్రాంగణం నుంచి రథశాల వద్దకు తీసుకువచ్చారు. పల్లకిలో వచ్చిన స్వామిఅమ్మవార్లను రథంలోనికి అధిష్టింపజేశారు. రథాంగబలిలో భాగంగా ఈవో సాగర్‌బాబు, ఈఈ రమేష్, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, ఏఈఓ రాజశేఖర్, కేశవరావు, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ కడప అనిల్‌కుమార్, అర్చకులు, వేదపండితులు కూష్మాండబలిని సమర్పించారు.
 
  అనంతరం కన్నడ భక్తులు సిరిగిరి మల్లయ్య, మహాత్మ మల్లయ్య అని మల్లికార్జునస్వామిని కొనియాడుతూ ఓంకారనాద ధ్వనుల మధ్య రథశాల నుంచి రథోత్సవం బయలుదేరింది.  రథం మీదికి అరటి పండ్లు, ఎండు ఖర్జూరం, కలకండలను విసిరి తమ భక్తిని చాటుకున్నారు. ఆ తర్వాత నంది మండపం నుంచి తిరిగి రథోత్సవం బయలుదేరి రథశాలకు చేరింది. జిల్లా ఎస్పీ రవికృష్ణ నేతృత్వంలో ఆత్మకూరు డీఎస్పీ సుప్రజ ఆధ్వర్యంలో పోలీసులు  భారీ బందోబస్తు నిర్వహించారు.  
 
 జగద్గురు స్వామీ
 అడ్డపల్లకి మహోత్సవం..
 ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాన మాడా వీధిలో శ్రీశైల జగద్గురు సూర్యసింహాసన పీఠాధిపతి డాక్టర్ చెన్నసిద్ధరామ శివాచార్య మహాస్వామీజీ అడ్డపల్లకిలో ఊరేగుతూ భక్తులకు శుభాశ్సీసులను తెలిపారు.ప్రధాన మాడా వీధి నుంచి అడ్డపల్లకిలో వచ్చిన ఆయనకు కృష్ణ దేవరాయగోపురం వద్ద ఏఈఓ రాజశేఖర్ ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం స్వామీజీ ఆలయప్రాంగణంలోని జగద్గురు పీఠానికి వెళ్లారు.
 
 మల్లన్న సేవలో కేంద్ర హోంశాఖ
 అడిషనల్ సెక్రటరీ
 శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్లను కేంద్ర హోంశాఖ అడిషనల్ సెక్రటరీ అనంతకుమార్‌సింగ్ శనివారం మధ్యాహ్నం దర్శించుకున్నారు. ప్రధానాలయగోపురం వద్ద  ఈవో సాగర్‌బాబు  ఆలయమర్యాదలతో ఆహ్వానం పలికారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయప్రాంగణంలో వేదపండితులు ఆశీర్వచనాలు పలుకగా, అధికారులు.. స్వామిఅమ్మవార్ల శేషవస్త్రాలు, లడ్డూప్రసాదాలను అందజేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement