శాకంబరీ నమోస్తుతే
వర్గల్: విద్యాధరిలో సరస్వతీ అమ్మవారి జన్మ నక్షత్రం మహోత్సవ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. సరస్వతి అమ్మవారు శుక్రవారం శాకంబరీ దేవి అలంకారంలో సాక్షాత్కరించారు. నేత్రపర్వంగా సాగిన మూలా మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న భక్తులు శాకంభరీ మాత దివ్య మంగళ రూపంతో దర్శనమివ్వడంతో అశేషజనం భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. చదువుల తల్లి జన్మ నక్షత్రం పురస్కరించుకుని శుక్రవారం ఉదయం 6 గంటలకు గణపతి పూజతో మూల మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో వేద పండితులు అనంతగిరి శర్మ, శశిధర శర్మ, బాల ఉమామహేశ్వర శర్మల మంత్రోచ్ఛరణల మధ్య అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం జరిపారు. అనంతరం క్వింటాళ్ల కొద్దీ కూరగాయలతో అమ్మవారిని శాకంబరీదేవిగా అలంకరించారు. దేశం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థించారు. ఆషాఢ మాసంలో శాకంభరీగా కొలువుదీరిన అమ్మవారిని స్తుతిస్తూ సప్తశతీ పారాయణాలు చేసారు. మరోవైపు వేద విద్యార్థులు లలితా సహస్ర పారాయణాలు జరిపారు. ఆలయ యాగ మండపంలో చండీహోమం నిర్వహించారు. ఓ వైపు శాకంబరీ దేవిగా అమ్మవారి దివ్యమంగళ రూపం, మరోవైపు విశేష అర్చనలు, యాగాది కార్యక్రమాలతో భక్తులు పరవశించిపోయారు. నేత్రపర్వంగా సాగిన మూల మహోత్సవ వేడుకలు తిలకించేందుకు స్థానిక జిల్లా భక్తులతోపాటు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వర్గల్ క్షేత్రానికి తరలి వచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకు ఇబ్బంది కలగకుండా ఆలయ మేనేజర్ రఘుపవన్ పర్యవేక్షించారు.