‘ఓం నమశ్శివాయః .. హరహర మహాదేవ.. శంభో శంకర..హరోం హరా’..అంటూ శైవ క్షేత్రాలన్నీ మార్మోగాయి. శివాలయాలు గల కొండకోనలు భక్తుల పంచాక్షరి మంత్రోచ్చాటనతో ప్రతిధ్వనించాయి. గురువారం తెల్లవారుజాము నుంచి జిల్లాలోని శివాలయాలన్నీ భక్తులతో పోటెత్తాయి. శివుడిని మనసారా దర్శించుకున్న భక్తులు జన్మ పావనమైందని పులకించారు.
కడప కల్చరల్, న్యూస్‌లైన్: మహాశివరాత్రి పర్వదినాన్ని గురువారం జిల్లా అంతటా వైభవంగా నిర్వహించారు. ఉదయం 4 గంటల నుంచే శివాలయాలన్నీ భక్తులతో సందడిగా మారాయి. పలుచోట్ల భక్తులు స్వయంగా అభిషేకం చేశారు. గ్రామాలు, పట్టణాల్లోని ఆలయాలేగాక అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. సమీప ప్రాంతాల నుంచి బుధవారం రాత్రికే భక్తులు లక్షల సంఖ్యలో చేరుకున్నారు.
శైవ క్షేత్రాల దారులన్నీ భక్తజన ప్రవాహాలుగా మారాయి. గురువారం ఉదయాన్నే స్వామిని దర్శించుకున్న పలువురు భక్తులు వెనుదిరగగా, కొండ కోనల్లోని శైవ క్షేత్రాల్లో జాగరణ చేయడం పుణ్యదాయకమని భావించిన భక్తులు అక్కడే ఉండిపోయారు. నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అర్ధరాత్రి లింగోద్భవ పూజలు, మహన్యాసం తిలకించి పుణ్యం లభించిందని తృప్తి చెందారు. గురువారం మధ్యాహ్నం వరకు భక్తులు శైవ క్షేత్రాలకు తరలి వెళ్లారు.
ధార్మిక సంఘాల ప్రతినిధులు అడుగడుగునా వారికి ఆహారం, నీటి పొట్లాలను ఉచితంగా అందజేశారు. పలు కూడళ్లలో ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్నదానాలు చేశారు. జిల్లా అధికారులు, పోలీసులు తమవంతుగా సమన్వయంతో వ్యవహరించడంతో భక్తులు సులభంగా దర్శనాలు చేసుకోగలిగారు.
పెండ్లిమర్రి, న్యూస్‌లైన్ : రాయలసీమ జిల్లాల్లో ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రాల్లో ఒక్కటైన పొలతల క్షేత్రం భక్తులతో పోటెత్తింది. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా గురువారం జిల్లా నలుమూలల నుంచి కాకుండా మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు నుంచి భక్తులు లక్షల సంఖ్యలో తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. క్షేత్రంలో వెలసిన శ్రీ మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి, సుబ్రమణ్యంస్వామి, వినాయకస్వామి, అక్కదేవతలు, పులిబండెన్న స్వాముల వారికి గురువారం తెల్లవారుజాము నుంచి భక్తులు కోనేర్లలో స్నానాలాచరించి క్యూ లైన్లలో వేచి స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం మల్లేశ్వరస్వామికి వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకాలంకరణ, పూలాభిషేకం వంటి కార్యక్రమాలు చేపట్టారు.
కన్నులపండువగా మల్లేశుని కల్యాణం.. :
గురువారం ఉదయం 11గంటలకు పొలతల క్షేత్రంలో శ్రీ మల్లేశ్వరస్వామి, పార్వతి దేవి అమ్మవారికి ఆలయ ఇన్‌చార్జి ఈఓ కృష్ణా నాయక్, ఆలయ ఛెర్మైన్ విశ్వనాథరెడ్డిల ఆధ్వర్యంలో వేదపండితుల సమక్షంలో కల్యాణం కమనీయంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని కనులారా వీక్షించారు.
మల్లేశ్వరస్వామిని దర్శించుకున్న ఎస్పీ :
జిల్లా ఎస్పీ జివిజి అశోక్‌కుమార్ పొలతల మల్లేశ్వరస్వామి, పార్వతిదేవి అమ్మవారిని ప్రత్యేక పూజలు, అభిషేకం నిర్వహించారు. అలాగే కడప ఆర్డీఓ హరిత, మండల ప్రత్యేకాధికారులు రమణారెడ్డి, తహశీల్దార్ నిత్యానందరాజు, ఇతర అధికారులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
చల్లంగ చూడు సోమేశ్వరా..
సింహాద్రిపురం, న్యూస్‌లైన్ : సింహాద్రిపురం మండలం రావులకొలను సమీపంలోని భానుకోట సోమేశ్వర క్షేత్రంలో గురువారం శివరాత్రి పర్వదిన సందర్భంగా భక్తులతో సందడి నెలకొంది. భక్తుల శివనామస్మరణతో భానుకోట క్షేత్రం హోరెత్తింది. భక్తులు స్వామి వారికి అభిషేక పూజలు, ప్రత్యేక పూజలు జరిపి తమ మొక్కుబడులను తీర్చుకున్నారు.
ఆలయం మెట్ల ప్రాంగణంలో శివ లింగంపై జలం జాలువారుతూ నాగదేవత పడగ విప్పి నాట్యం చేస్తున్నట్లు రూపొందించిన దృశ్యం భక్తులను ఆకట్టుకుంది. అర్థరాత్రి శివపార్వతులను ఊరేగించిన అనంతరం ఆలయ పూజారులు దేవగుడి కృష్ణయ్య, బద్రినాథ్‌ల ఆధ్వర్యంలో వైభవంగా స్వామి వారికి కల్యాణం చేశారు. పులివెందుల జేఎన్‌టీయూ ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు భానుకోటలో మంచి సేవలు అందించారు.
పూజలందుకోవయ్యా.. నిత్యపూజయ్యా..
సిద్దవటం, న్యూస్‌లైన్:లంకమల్ల అభయారణ్యంలో వెలసిన నిత్యపూజయ్యస్వామి కోన గురువారం మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శివనామస్మరణలతో మార్మోగింది. పంచలింగాల గుడి వద్ద నుంచి కాలిబాటన నిత్యపూజయ్య నిజమైన దేవుడా, పంచలింగాలస్వామి అంటూ వృద్ధులు చిన్నపిల్లలను వెంటపెట్టుకుని కొండ పైకి వెళ్లారు. కొందరు భక్తులు తలనీలాల మొక్కు తీర్చుకునేందుకు నీటిగుండంలో స్నానాలు చేసి స్వామి వారిని దర్శించుకున్నారు.
బుధవారం అర్ధరాత్రి లింగోద్భవ కాలం, మహన్యాసపూర్వక, రుద్రాభిషేకం పూజలు ప్రారంభమయ్యాయి. గురువారం తెల్లవారుజాము నుంచి భక్తుల సర్వదర్శనం, మూలవిరాట్‌కు అభిషేకాలు, అర్చనలు చేశారు. కొందరు మహిళా భక్తులు సంతానం కోసం వరపడి ముడుపులు కట్టారు. మరి కొందరు భక్తులు మొక్కుబడిగా కొబ్బరి కాయలను గుండంలో కాల్చి మొక్కులు తీర్చుకున్నారు. మండలంలోని కపర్థీశ్వరస్వామి, జ్యోతి సిద్ధవటేశ్వరస్వామి, నీలకంఠేశ్వరస్వామి ఆలయాల్లో శివరాత్రి మహోత్సవ పూజలు జరిగాయి.
కరుణించరావా.. త్రేతేశ్వరా...
అత్తిరాల (రాజంపేట రూరల్), న్యూస్‌లైన్: శివరాత్రి పర్వదినం సందర్భంగా అత్తిరాలలోని శ్రీకామాక్షి సమేత త్రేతేశ్వరస్వామి ఉత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. వేకువజామున 3గంటల సమయం నుంచే ఆలయ ప్రధాన అర్చకుడు కె.పద్మనాభశాస్త్రి పూజా కార్యక్రమాలు ప్రారంభించారు. గురువారం రాత్రి శివరాత్రి జాగారం చేసేందుకు భక్తులు పెద్ద ఎత్తున అత్తిరాలకు చేరుకున్నారు. ఆర్డీఓ ఎం.విజయసునీత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
పోటెత్తిన పొలతల
Published Fri, Feb 28 2014 2:29 AM | Last Updated on Mon, Oct 8 2018 4:35 PM
Advertisement
Advertisement