గద్దెరాళ్ల(దేవనకొండ): జిల్లాలో ప్రసిద్ధి చెందిన గద్దెరాళ్ల మారెమ్మవ్వ దేవర ఉత్సవాలు బుధవారం ప్రశాంతంగా జరిగాయి. ఈ ఉత్సవాలకు ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి దాదాపు మూడు లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. ఉత్సవాల్లో పల్లెదొడ్డి బోనాల ఊరేగింపుకు ప్రత్యేకత ఉంది. జాతరకు ముందు గ్రామస్తులు ఐక్యంగా వారివారి ఇళ్ల నుంచి ఇంటికొక బోనం ప్రకారం దాదాపు 520 బోనాలను (కుండలు) నెత్తిన పెట్టుకొని దాదాపు 3 కి.మీ. దూరం నుంచి నడుచుకుంటూ వచ్చారు. అవ్వ ఆలయం ఎదుట ఆ బోనాలను ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పల్లెదొడ్డి బోనాలు ఆలయం ఆవరణలోనికి చేరుకునే సమయంలో ఉత్సవాలకు హాజరైన భక్తులందరూ అవ ఆలయం వెనుకభాగంలో ఉన్న కొండవైపు చూశారు. ఉత్సవాల్లో భాగంగా ప్రతిసారి అవ్వ రూపంలో ఒక గద్ధ ఆలయం వెనుకభాగంలో ఉన్న కొండపై కూర్చొంటుందని భక్తుల నమ్మకం. అయితే ఈ ఏడాది కూడా పల్లెదొడ్డి బోనాలు ఆలయ ఆవరణలోకి వచ్చిన వెంటనే ఒక గద్ద ఆలయం చుట్టూ తిరిగి అక్కడున్న కొండపై కాసేపు కూర్చొంది. అనంతరం వెళ్లిపోయింది. ఆ గద్ద కొండపై నుంచి వెళ్లిపోయే సమయంలో భక్తులు అవ్వఉత్సవాలను తిలకించేందుకు వచ్చిందంటూ మారెమ్మవ్వకు జై అంటూ నినాదాలు చేశారు. అనంతరం సంప్రదాయ పద్ధతుల్లో 50 వేలకు పైగా వివిధ మూగజీవులను అవ్వ ఆలయం ముందు బలిచ్చారు.
ఆ సమయంలో ఆలయ ఆవరణం భక్తుల సందడితో కిక్కిరిసింది. ఉత్సవాలకు హాజరైన భక్తులకు దేవదాయశాఖ ముఖ్య కార్యనిర్వహణాధికారి రాధాకృష్ణ అన్ని సౌకర్యాలు కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డోన్ డీఎస్పీ పి.ఎన్.బాబు, పత్తికొండ సీఐ గంటా సుబ్బరావు ఆధ్వర్యంలో దాదాపు వంద మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దేవనకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యసిబ్బంది దాదాపు 15 మంది ఆరోగ్య కార్యకర్తలతో ఉచిత వైద్యశిబిరాన్ని నిర్వహించారు.
అవ్వను దర్శించుకున్న ప్రముఖులు
గద్దెరాళ్ల మారెమ్మవ్వను మాజీ మంత్రి కేఈ ప్రభాకర్, ఆలూరు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరుడు శ్రీనివాసులు, దేవనకొండ ఎంపీపీ రామచంద్రనాయుడు, ఆస్పరి, దేవనకొండ జెడ్పీటీసీ సభ్యులు బొజ్జమ్మ, సరస్వతి, ఉచ్చీరప్ప, మలకన్న, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు కిట్టు, తపాల శ్రీనివాసనాయుడు, కందనాతి రంగ న్న, కబీర్, అంజి దర్శించుకున్నారు.
జాతరలో దొంగల హల్‌చల్...
బోనాలను సమర్పించే సమయంలో ఆలయ ఆవరణమంతా భక్తులతో కిక్కిరిసింది. దీంతో దొంగలు కొంతమంది చేతివాటం ప్రదర్శించారు. దీంతో బంగారు నగలు తదితర వాటిని పోగొట్టుకున్న మహిళలు బోరున విలపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నగలు దోపిడీకి గురైన వారిలో దేవనకొండకు చెందిన మంగళి మహేశ్వరి ఒకరు. ఆమె ఒంటిపైనున్న రెండు తులాల బంగారు గొలుసు, మంగళసూత్రాన్ని దొంగలు అపహరించారు. అలాగే దాదాపు 20 మందికి పైగా మహిళలకు సంబంధించిన చిన్నచిన్న నెక్లెస్‌లు, పిక్‌ప్యాకెట్లు కూడా చోరీకి గురయ్యాయి.
మారెమ్మవ్వా.. వరాలివ్వమ్మా!
Published Thu, Mar 12 2015 2:32 AM | Last Updated on Sat, Sep 2 2017 10:40 PM
Advertisement