జనం...జనం...దేవుని కడప వీధులన్నీ జనమయం. బ్రహ్మోత్సవాలలో ముఖ్యమైన రథోత్సవాన్ని తిలకించేందుకు వచ్చిన జనం. తేరును లాగి పుణ్యం పొందేందుకు.. రథంపై వెలిగే స్వామిని దర్శించుకొని తరించేందుకు వచ్చిన జనం.. జనసంద్రం మధ్య కడపరాయుని రథం గంభీరంగా కదిలింది. వైభవోపేతంగా నిర్వహించిన రథోత్సవాన్ని భక్తజనం తిలకించి పులకించిపోయారు.
కడప కల్చరల్, న్యూస్‌లైన్: దేవుని కడప శ్రీ లక్ష్మి వేంకటేశ్వరస్వా మి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలలో ప్రధాన అంశమైన రథోత్సవం గురువారం కనులపండువగా జరిగింది. ఉదయం ఆరు గంటల నుంచి తేరుపై గల స్వామిని దర్శించుకునేందుకు భక్తులు దేవునికడప వీధుల్లో బారులు తీరారు. సాయంత్రం 3.50కి వేద పండితులు చిలకపటి తిరుమలాచార్యులు, స్థానిక అర్చక బృందంతో కలిసి తొలి పూజలు చేశారు. రథదాత ముత్యాల శేషయ్య హారతి, సర్కారు హారతుల అనంతరం కొబ్బరి కాయలు కొట్టి రథాన్ని కదిలించారు. ఆలయ నిర్వాహకులు మేళతాళాలతో సంప్రదాయంగా ఆహ్వానించగా దేవునికడప, పాతకడప యువకులు ఉత్సాహంతో కేరింతలు కొడుతూ రథచక్రాల కింద సన్న (ఊత మొద్దు)లు వేసి, కర్రల ఆధారంతో చక్రాలను కదిలించారు. మహామేరు పర్వతమే కదిలినట్లుగా రథం గంభీరంగా ముందుకు సాగింది. తెల్లనిగుర్రాలు పూన్చిన రథాన్ని సాక్షాత్తు బ్రహ్మదేవుడే సారథిగా నడిపించినట్లు రథంపై బొమ్మలను ఏర్పాటు చేశారు. దేవునికడప, పాతకడప పెద్దలు అడుగడుగునా యువకులను ఉత్సాహపరుస్తూ రథం ముందుకు కదిలేందుకు సహకరించారు.
భక్తిపారవశ్యం
రథంపై ఉభయ దేవేరులతో కొలువుదీరిన దేవదేవుడిని భక్తులు మాడవీధుల్లో మిద్దెలు, మేడలపైకి ఎక్కి మరీ దర్శించుకున్నారు. రథం ఆగినప్పుడు అర్చకులు భక్తులకు మంగళ హారతులిచ్చారు. పలువురు భక్తులు రథం చక్రాల కింద గుమ్మడికాయలను ఉంచి పగిలాక ముక్కలను ప్రసాదంగా స్వీకరించి మొక్కులు తీర్చుకోగా, మరికొందరు మహిళా భక్తులు రథాన్ని లాగి మొక్కులు తీర్చుకున్నారు. యువకులు రథాన్ని లాగేందుకు పోటీలు పడ్డారు. మాసాపేట నుంచి దేవునికడప వరకు రోడ్లకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేయడంతో కొనుగోలుదారులతో రోడ్లన్నీ కిటకిటలాడాయి.
రథోత్సవంలో పోలీసుల దౌర్జన్యం
కడప అర్బన్, న్యూస్‌లైన్ : దేవునికడప శ్రీ లక్ష్మివెంకటేశ్వరస్వామి రథోత్సవంలో పోలీసుల దౌర్జన్యం కనిపించింది. రథం వద్ద మహిళా భక్తులను పంపించేందుకు స్కౌట్ వారుగానీ, మహిళా కానిస్టేబుళ్లుగానీ విధులు నిర్వర్తించాలి. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ఏఆర్, స్పెషల్ పార్టీ పోలీసులు మహిళలను చేతులతో లాగిపడేయడం, వారిపట్ల అసభ్యకరంగా ప్రవర్తించడం గమనించిన మీడియా ప్రతినిధులు ఆ దృశ్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించారు.
దీంతో పోలీసులు ఓ ఫొటోగ్రాఫర్‌కు చెందిన కెమెరాను లాక్కొని లెన్స్‌ను సైతం ధ్వంసంచేశారు. మీడియా ప్రతినిధులు స్పెషల్ పార్టీ పోలీసుల గురించి ఏఆర్ డీఎస్పీ చిన్నికృష్ణను వివరణ కోరగా తాను విచారిస్తానన్నారు. ఈ సంఘటనపై ఎస్పీ అశోక్‌కుమార్ విచారణ జరిపి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోకపోతే పోలీసు ప్రతిష్ఠకు భంగం వాటిల్లే ప్రమాదముంది.
గోవిందా..!
Published Fri, Feb 7 2014 2:54 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM
Advertisement
Advertisement