వైకుంఠవాసా.. గోవిందా | vaikunta ekadasi grand celebrations in kadapa district | Sakshi
Sakshi News home page

వైకుంఠవాసా.. గోవిందా

Published Sun, Jan 12 2014 1:51 AM | Last Updated on Fri, Nov 9 2018 6:29 PM

vaikunta ekadasi grand celebrations in kadapa district

 వైకుంఠ ఏకాదశిని  జిల్లా వ్యాప్తంగా భక్తి   శ్రద్ధలతోజరుపుకున్నారు.. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు.. దేవుని కడప శ్రీలక్ష్మీ వేంకటేశ్వర  స్వామిని వేలాది భక్తులు దర్శించుకున్నారు.. ఉదయం 2-30 గంటల నుంచే స్వామి దర్శనం కోసం వేచిఉన్నారు.. 5 గంటల నుంచి వైకుంఠ ద్వారం ద్వారా దర్శనం చేసుకున్నారు.
 
 కడప కల్చరల్, న్యూస్‌లైన్ : వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని శనివారం భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని వైష్ణవాలయాలలో నిర్వాహకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైకుంఠ ద్వారాన్ని ప్రత్యేకంగా అలంకరించి అక్కడి నుంచి స్వామిని దర్శించుకునే ఏర్పాట్లు చేశారు. తెల్లవారుజాము నుంచి స్వామి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో వేచివున్నారు.
 
 దేవుని కడప శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్తరద్వారాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. ద్వారం వద్ద శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను పూలతో కన్నులపండువగా అలంకరించి కొలువుతీర్చారు. ఉదయం 4గంటల నుంచి మూలమూర్తులను దర్శించుకునేందుకు భక్తులను అనుమతించారు.
 
  5గంటల నుంచి వైకుంఠ ద్వారం నుంచి భక్తులకు దర్శనభాగ్యం కలిగించారు. ఉదయం 2.30గంటల నుంచే భక్తులు స్వామి దర్శనం కోసం వచ్చారు.  రూ.10లు, రూ.25లతో కూడా వైకుంఠ ద్వారం నుంచి దర్శనం కల్పించారు. మూలమూర్తుల దర్శనానికి కూడా ఉచిత దర్శనంతోపాటు రూ.10, రూ.25ల టికెట్‌పై దర్శనాలు ఏర్పాటు చేశారు. ఉత్తరద్వారం వద్ద భక్తులు పెద్దసంఖ్యలో స్వామిని దర్శించుకున్నారు. కాగా, తిరుమల నుంచి ప్రత్యేకంగా తెప్పించిన లడ్డులు కొద్దిసేపటికే అయిపోయాయి.
 
 భక్తజన సందోహం..
 సాధారణంగా దేవునికడపలో శ్రీలక్ష్మి వేంకటేశ్వరస్వా మి బ్రహ్మోత్సవాలను మినహాయిస్తే జనవరి 1న నూ తన సంవత్సరం, వైకుంఠ ఏకాదశి రోజుల్లో స్వామిని దర్శించుకునేందుకు భక్తులు భారీ సంఖ్యలో వస్తారు. కానీ ఈ సంవత్సరం ప్రారంభం రోజున అమావాస్య కావడంతో స్వామిని దర్శించుకునే భక్తుల సంఖ్య చాలా తగ్గింది. వైకుంఠ ఏకాదశి శని వారం నాడు రావడం, అది రెండవ శనివారం కావడం, పిల్లలకు ఆరు నెలల పరీక్షలు ముగిసి సెలవులు ఉండడంతో శనివారం భక్తులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. జాయింట్ కలెక్టర్ నిర్మల, స్టెప్ సీఈఓ మమత, ఇంకా పలువురు నగర ప్రముఖులు, అధికారులు, న్యాయశాఖ అధికారులు స్వామిని దర్శించుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement