శ్రీకూర్మం(గార) : శ్రీకూర్మనాథాలయంలో తాబేళ్ల పార్కు ఆదాయ వనరు కేంద్రంగా మారింది. తాబేళ్ల సంరక్షణకు అవసరమమైన నిధులు సమకూరుస్తామని పలువురు భక్తులు ముందుకొచ్చినా కాదని.. తాబేళ్లను చూపి వసూళ్ల పర్వం వైపే అధికారులు మొగ్గు చూపుతుండటం వెనుక ఆంతర్యం చిలక్కొట్టుడేనని తెలుస్తోంది. కొన్నేళ్ల క్రితం ఆలయంలో ఉన్న తాబేళ్ల సంరక్షణకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా వారు పార్కు ఏర్పాటు చేశారు.
అయితే ఆలయ అధికారుల పర్యవేక్షణ లోపంతో ఆహారం అందక తాబేళ్లు శుష్కించిపోగా.. పార్కు పాడవడంతో కుక్కలు పార్కులో చొరబడి తాబేళ్లను చంపేసేవి. దీనిపై పత్రికల్లో వార్తలు రావడంతో తాబేళ్లను అడవిలో విడిచిపెట్టాలని అటవీ శాఖాధికారులు నిర్ణయించారు. దీన్ని వ్యతిరేకిస్తూ కమలానంద భారతి స్వామి హైకోర్టులో వ్యాజ్యం వేయడంతో తాబేళ్లను ఆలయంలోనే ఉంచి సంరక్షించాలని కోర్టు ఆదేశాలిచ్చింది. ఆ మేరకు 2011లో రూ. 4 లక్షలతో కృష్ణమ్ వందే జగద్గురుమ్ పేరిట ఆంధ్రా యూనివర్సిటీ ప్రొఫెసర్ల సూచనలతో తాబేళ్ల పార్కు ఏర్పాటు చేశారు. అయితే పార్కులో ఉన్న సుమారు 200 తాబేళ్ల ఆహార ఖర్చులకు రూ.100 కేటాయించడంతో ఆహారం అందించలే కపోతున్న పరిస్థితులపై ‘సాక్షి’లో కథనం ప్రచురించింది.
దాంతో స్పందించిన దేవస్థానం అధికారులు తాబేళ్ల పార్కు నిర్వహణకు శ్రీకాకుళానికి చెందిన గ్రీన్‌మెర్సీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. పార్కు నిర్వహణకు ఆ సంస్థకు నెలకు రూ.24 వేలు ఇవ్వాలన్నది ఈ ఒప్పందం సారాంశం. కాగా ఈ మొత్తాన్ని తానే చెల్లిస్తానని అప్పట్లోనే కృష్ణమ్ వందే జగద్గురుమ్ సంస్థ నిర్వాహకుడు శ్రీనివాసరావు అధికారులకు తెలియజేశారు. ఆ ప్రతిపాదనను తిరస్కరించిన అధికారులు.. అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తుందని భావించారో ఏమో గానీ.. తాబేళ్లను చూపి రోజువారీ వసూళ్లకు తెర తీశారు.
మళ్లీ అడవి బాటలోకి?
ఇదిలా ఉండగా తాబేళ్ల పేరిట వసూళ్లు చేయడం నేరమని అటవీ శాఖాధికారులు స్పష్టం చేయడంతో వాటిని ఆలయం నుంచి తరలించేందుకు దేవస్థానం అధికారులు యోచిస్తున్నట్టు తెలిసింది. సిబ్బంది, నిధుల కొరత సాకుతో వాటిని వదిలించుకునేందుకు మార్గాలు అన్వేషిస్తున్నట్లు తెలిసింది. శ్రీకూర్మనాథాలయంతోపాటు పాతాళ సిద్ధేశ్వర, ఆంజనేయ స్వామి ఆలయాల్లో మొత్తం 30 మంది సిబ్బంది ఉన్నారు. రూ. 30 లక్షల ఆదాయం వచ్చే ఆలయానికి ఈ సిబ్బంది ఎక్కువే. ఇక నిధుల కొరత సమస్య కాదు. తాబేళ్ల సంరక్షణకు దాతలే ముందుకొస్తునానరు. స్థానిక సర్పంచ్ బరాటం రామశేషు సైతం గతంలో ఆలయ అధికారులకు ఇదే విషయం చెప్పారు. మరోవైపు గోవుల సంరక్షణ కంటే తాబేళ్ల సంరక్షణ చాలా సులువు. తాబేళ్లు చాలా తక్కువ ఆహారం తీసుకుంటాయి. రెండు గోవుల కంటే వంద తాబేళ్ల పోషణ ఖర్చు తక్కువగానే ఉంటుంది. ఈ అంశాలను అధికారులు విస్మరిస్తున్నారు. కాగా తాబేళ్ల పేరిట వసూళ్లు చే స్తున్న విషయాన్ని జిల్లా అటవీ శాఖాధికారులు దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ మూర్తి దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. దేవస్థానం ఖాతాలో తాబేళ్ల పేరిట నగదు జమ అయ్యి ఉంటే ఇబ్బందులు వస్తామని ఆ శాఖ ఉన్నతాధికారులు అంటున్నారు.
దాతలను కాదని.. వసూళ్లపైనే శ్రద్ధ
Published Sat, Feb 7 2015 3:18 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement
Advertisement