మహాశివరాత్రి పర్వదినాన్ని జిల్లావాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో మార్మోగాయి.
నెల్లూరు (రవాణా): మహాశివరాత్రి పర్వదినాన్ని జిల్లావాసులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శివాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. శివనామస్మరణతో మార్మోగాయి. స్వామిని దర్శించుకునేందుకు ప్రధాన ఆలయాలకు భక్తులు భారీసంఖ్యలో తరలి వచ్చారు. పాలాభిషేకాలు, మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకాలు నిర్వహించారు. నందివాహన సేవ, లింగోద్భవం నిర్వహించారు.
భక్తులు ఉపవాసం ఉండి మహాదేవుడిని దర్శించుకున్నారు. జిల్లాలో ప్రధానంగా భైరవకోన, గండవరం, సోమశిల, మొగిలిచర్ల, ఘటికసిద్ధేశ్వరం, నెల్లూరు శివాలయం, రామతీర్థం, మైపాడు, వాకాడు, కామాక్షి సమేత సంఘమేశ్వర స్వామి ఆలయం, పెంచలకోన తదితర దేవాలయాల్లో విశేషంగా భక్తులు పాల్గొని పూజలు నిర్వహించారు.
భక్తులకు అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ నిర్వాహకులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పలు ఆలయాలను విద్యుద్దీపాలతో అలంకరించారు. శివరాత్రి రోజున రాత్రంతా శివభజనలు చేస్తూ జాగరణ చేశారు. నవరాత్రి బ్రహ్మాత్సవాలు నిర్వహణకు దేవాదాయశాఖ, ఆలయ ధర్మకర్తల నేతృత్వంలో శివక్షేత్రాలు వేడుకులకు ప్రత్యేక సంతరించుకున్నారు. అయితే ఆలయాల్లో వీఐపీ తాకిడి ఎక్కువ కావడంతో భక్తులు ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి క్యూల్లో భక్తులు నిలచిపోయారు.