శివోహం | mahashivaratri grand celebrations in Nellore district | Sakshi
Sakshi News home page

శివోహం

Published Fri, Feb 28 2014 2:51 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM

mahashivaratri grand celebrations in Nellore district

నెల్లూరు (బృందావనం), న్యూస్‌లైన్ : మహాశివరాత్రి పర్వదినాన్ని జిల్లా ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. గురువారం వేకువజాము నుంచే పరమేశ్వరుని దర్శనం కోసం శివాలయాల్లో బారులుదీరారు. ఓం నమఃశివాయ..శంభో శంకర..హరహర మహదేవ..పాహిమాం..పాహిమాం..అంటూ ముక్కంటి ముందు మోకరిల్లారు. విశేష అభిషేకాలను తిలకిస్తూ భక్తపారవశ్యంలో మునిగారు.
 
  మూలాపేటలోని శ్రీ భువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరస్వామి ఆలయంలో గిన్నెభిక్ష, లింగోద్భవ కాలాభిషేకం, వెండి నందిసేవ వైభవంగా జరిగాయి. శ్రీరామకవచం కోటేశ్వరశర్మ, రమేష్‌కుమార్‌శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజా కార్యక్రమాలకు ఉభయకర్తలుగా భీమశెట్టి వెంకటరత్నం, ధనమ్మ , రేబాల వెంకటరెడ్డి, ఇందిరమ్మ, పులిమి రమేష్‌రెడ్డి, కమలాకర్‌రెడ్డి, దినకర్‌రెడ్డి వ్యవహరించారు. ఈఓ కోవూరు జనార్దన్‌రెడ్డి, ధర్మకర్తల మండలిసభ్యులు పర్యవేక్షించారు.
  దర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరి ఆమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీ మీనాక్షి సమేత సుందరేశ్వరస్వామి వారికి వేకువజాము నుంచి రాత్రి విశేష పూజలు జరిగాయి.
 
 ఆలయ ప్రధానార్చకుడు తంగిరాల రాధాకృష్ణశర్మ ఆధ్వర్యంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, గిన్నెభిక్ష, రుద్రహోమం, లింగోద్భవాభిషేకం, నందిసేవ తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. స్వామి వారు కాశీ విశ్వేశ్వర జ్యోతిర్లింగ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉభయకర్తలుగా ఆల్తూరు ఆదినారాయణరెడ్డి, సులోచనమ్మ దంపతులు వ్యవహరించారు. ఏర్పాట్లను ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త రత్నం జయరామ్, కార్యనిర్వహణాధికారి పాయసం నాగేశ్వరరావు పర్యవేక్షించారు. నేలనూతల శ్రీనివాసమూర్తి, తంగిరాల రాధాకృష్ణశర్మ పర్యవేక్షణలో శ్రీలలితా లక్ష కుంకుమార్చన జరిగింది.

  సీఏఎం ఉన్నత పాఠశాల సమీపంలోని శ్రీఉమామహేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లింగోద్భవాభిషేకం చేశారు. స్వామి వారు చందనాలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయాన్ని పూలతో విశేషంగా అలంకరించారు. అర్చకులు పోగుల వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమాలను ధర్మకర్త గరుడసింగ్, ఈఓ రామకృష్ణ పర్యవేక్షించారు.
 
 భక్తులకు అన్నప్రసాదం పంపిణీ చేశారు. ఉభయకర్తలుగా బోగోలు మోహన్‌రెడ్డి, నిర్మలమ్మ, దుగ్గి వెంకటేశ్వర్లు, అంచనాల నాగేశ్వరరావు, గాలి కేశవులునాయుడు, చుండూరు శివకృష్ణకుమార్, కమలమ్మ  వ్యవహరించారు.= నవాబుపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరిశెట్టి హనుమాయమ్మ కుమారులు ఉభయకర్తలుగా వ్యవహరించారు.  
 
  కొండాయపాళెం రోడ్డు రామకృష్ణనగర్‌లో కొలువైన శ్రీఅన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి దేవస్థానంలో విశేష పూజలు, సహస్ర దీపోత్సవం నిర్వహించారు. అర్చకులు పులిజాల సురేష్‌శర్మ, తం గిరాల వరప్రసాద్‌శర్మ ఆధ్వర్యంలో జరిగిన పూజలను మేనేజింగ్ ట్రస్టీ కోట ప్రభాకర్‌రావు, బండి శ్రీనివాసులురెడ్డి, పోలవరపు హనుమంతరావు పర్యవేక్షించారు. ఉభయకర్తలుగా వడ్లమూడి మధుసూదన్‌రావు, సుజాతమ్మ దంపతులు వ్యవహరించారు. శుక్రవారం స్వామివార్ల కల్యాణ మహోత్సవం, రాత్రి గ్రామోత్సవం నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని శ్రీ అన్నపూర ్ణసమేత కాశీవిశ్వనాథ స్వామి దేవస్థానం, సంతపేటలోని శ్రీభ్రమరాంబ సమేత హరిహరనాథస్వామి దేవస్థానం శ్రీకన్యకాపరమేశ్వరి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు జరిగాయి.
 
 ఆకట్టుకున్న మంచుశివలింగం
 శివరాత్రి సందర్భంగా మూలస్థానేశ్వరస్వామి ఆలయంలో బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచు లింగం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.
 
 ముందే కూసిన ‘కోడ్’
 కోవూరు, న్యూస్‌లైన్: ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాకమునుపే అనధికారికంగా కోడ్ అమల్లోకి వచ్చింది. అమ్మహస్తం పథకంలో భాగంగా తెల్లకార్డుదారులకు ప్రతినెలా అందించే తొమ్మిది రకాల సరుకుల సంచిపై నేతల ఫొటోలను తొలగిస్తున్నారు. పేదలకు పామాయిల్, పంచదార, పసుపు, చింతపండు, కందిపప్పు, గోధుమలు, గోధుమ పిండి, ఉప్పు, కారం సరుకులను ప్యాకెట్లగా చేసి వాటిపై ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, మన్మోహన్‌సింగ్, కిరణ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు ఫొటోలను ముద్రించి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారానికి తెరతీసింది.
 
 ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ ప్రచారానికి తెరదించాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. మార్చి, ఏప్రిల్, మే మాసాల్లో ఈ బొమ్మలను తొలగించాలని ఉత్తర్వులు వెలువడ్డాయి. ఎన్నికల నోటిఫికేషన్ మార్చి మొదటి వారంలో  విడుదల కావచ్చని అంతా భావిస్తున్నారు. ఈసీ నిబంధనలకు అనుగుణంగా జిల్లా  అధికారులు  గోడౌన్లలో ఉన్న స్టాకుకు తెల్ల స్టిక్కర్లు అంటించాలని ప్రతిపాదనలు రూపొందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement