శివపార్వతుల దర్శనం
నెల్లూరు (బృందావనం) మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజలకు జిల్లాలోని శైవక్షేత్రాలన్నీ ముస్తాబయ్యాయి. గురువారం వేకువజాము నుంచే స్వామి వారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు జరగనున్నాయి.
లింగోద్భవ కాలంలో ప్రత్యేక అభిషేకాలతో పాటు అన్నాభిషేకాలు చేసేందుకు ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. ఆదిదంపతులను భక్తిశ్రద్ధలతో పూజించేందుకు భక్తులు సిద్ధమయ్యారు. వేకువజాము నుంచే భక్తులు పోటెత్తే అవకాశమున్నందున ఆయా ఆలయాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
మూలాపేటలోని శ్రీభువనేశ్వరి సమేత మూలస్థానేశ్వరాలయం, దర్గామిట్టలోని శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సుందరేశ్వరుని సన్నిధి, నవాబుపేటలోని శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి, ఉస్మాన్‌సాహెబ్‌పేటలోని శ్రీ అన్నపూర్ణ సమేత కాశీవిశ్వనాథస్వామి, సంతపేటలోని శ్రీభ్రమరాంబ సమేత హరిహరనాథస్వామి, సీఏఎం ఉన్నత పాఠశాల సమీపంలోని శ్రీ ఉమామహేశ్వరస్వామి దేవస్థానం, కొండాయపాళెం గేటు సమీపంలోని శ్రీ అన్నపూర్ణసమేత విశ్వేశ్వరస్వామి ఆలయాల్లో విశేష పూజలు జరగనున్నాయి.