సాక్షి, చిట్టమూరు: ఎట‍్టకేలకు దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. తహశీల్దార్ జోక‍్యం చేసుకుని దళితులకు ఆలయ ప్రవేశం కల్పించిన సంఘటన నెల్లూరు జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
చిట‍్టమూరు మండలం ఆలేటిపాడులో తహసీల్దార్ పి.చంద్రశేఖర్ గురువారం జన్మభూమి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలేటిపాడు దళితవాడకు చెందిన సగుటూరు రమణయ్య అనే వ్యక్తి జన్మభూమి సభలో తమను గ్రామంలో ఉన్న శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోకి వెళ్లనీయడం లేదని తహశీల్దార్‌కు ఫిర్యాదుచేశాడు. గ్రామంలో నాలుగేళ్ల క్రితం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మించారని, అప్పటి నుంచి తమకు ఆలయ ప్రవేశం లేకుండా చేస్తున్నారన్నారు.
స్పందించిన తహశీల్దార్ వెంటనే చిట్టమూరు ఎస్సై వేణుగోపాల్‌ను గ్రామానికి పిలిపించారు. ఎంపీపీ ఎల్లసిరి మంజులమ్మ, తహశీల్దార్ చంద్రశేఖర్, ఎస్సై గ్రామంలోని శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయం తలుపులు తీయించి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు. ఆలయంలో పూజలు చేయించి, అర్చకులతో తీర్థ ప్రసాదాలు పంపిణీ చేయించారు. ఈ సందర‍్బంగా ఆలేటిపాడు దళితవాడ వాసులు తహశీల్దార్‌కు కృతజ్ఙతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment