టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం
ఇతర రాష్ట్రాల భక్తులకు ఇబ్బందులు తప్పవు
తిరుమల: టూరిజం కార్పొరేషన్లకు కేటాయిస్తున్న శ్రీవారి దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నూతన పాలక మండలి నిర్ణయం తీసుకుంది. తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవిదేశాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు వస్తుంటారు. వీఐపీ దర్శనం, ప్రత్యేక ప్రవేశ దర్శనం, సర్వదర్శనం తదితర విధానాల్లో భక్తులకు టీటీడీ స్వామివారి దర్శనం కల్పిస్తుంటుంది. వీటితో పాటు వివిధ రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ నిత్యం ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను కేటాయిస్తుంటుంది.
ఇందులో ఏపీ టూరిజం, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి, కేరళ, ఐఆర్‌టీసీల ద్వారా భక్తులకు శ్రీవారి దర్శన భాగ్యం కల్పిస్తుంటుంది. దీనివల్ల సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు తక్కువ సమయంలోనే స్వామివారిని దర్శనం చేసుకొని తిరిగి వెళ్లేవారు. కానీ టీటీడీ నూతన పాలకమండలి తొలి సమావేశంలోనే ఈ దర్శన టికెట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇతర రాష్ట్రాల టూరిజం కార్పొరేషన్లకు టీటీడీ రోజూ 4 వేల టికెట్లు కేటాయిస్తుండేది. ఇందులో ఏపీ టూరిజానికి 1,000, తెలంగాణకు 800 టికెట్లు, మిగతా వాటికి 500, 400 చొప్పున టికెట్లు కేటాయించేది
వీరికి మధ్యాహ్నం 2 గంటల స్లాట్ ద్వారా దర్శనం కల్పించేది. అయితే ఈ టికెట్ల అవకతవకలపై ఫిర్యాదులు రావడంతో ఏడు టూరిజం కార్పొరేషన్లకు దర్శన టికెట్లను రద్దు చేస్తూ టీటీడీ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తీవ్ర ఇబ్బందులు తప్పవు. తప్పు చేసిన వారిని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి గానీ.. ఇలా అందరికీ దర్శన టికెట్లు నిలిపివేయడం సరికాదని ఇతర రాష్ట్రాల భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment