తెలుగువారి పండగ ఉగాదిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఆలయాలు సర్వాలంకారశోభితంగా కళకళలాడాయి. నూతన (మన్మథ నామ) సంవత్సరంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆలయాల్లోని తమ ఇష్టదైవాలను వేడుకునేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు.
నెల్లూరు(బృందావనం): తెలుగువారి పండగ ఉగాదిని పురస్కరించుకుని జిల్లావ్యాప్తంగా ఆలయాలు సర్వాలంకారశోభితంగా కళకళలాడాయి. నూతన (మన్మథ నామ) సంవత్సరంలో సుఖసంతోషాలను ప్రసాదించాలని ఆలయాల్లోని తమ ఇష్టదైవాలను వేడుకునేందుకు భక్తులు విశేషంగా తరలివచ్చారు. దీంతో ఆలయాలు కిటకిటలాడాయి. సూర్యభగవానుడు మేషరాశిలోకి ప్రవేశించే శుభదినాన జరుపుకొనే ఉగాది పండగను పురస్కరించుకుని ఆలయాలు వేదపండితుల పంచాగశ్రవణం, అర్చకుల విశేషపూజలు, వేదఘోషతో మార్మోగాయి. ప్రతి ఇంట ఉగాది శోభ కనిపించింది. నూతన వత్సరం తొలిరోజు బంధుమిత్రులు, కుటుంబసమేతంగా ‘షడ్రుచుల ఉగాది పచ్చడి’ ఆరగింపుతో పాటు తీపివంటకాలతో గృహాలు కళకళలాడాయి. నగరంలోని వివిధ ప్రాంతాల్లో పలు థార్మిక, స్వచ్ఛంద, సాహిత్య, సాంస్కృతిక సంస్థలతోపాటు వాకర్స్‌అసోసియేషన్‌ల ఆధ్వర్యంలో ఉగాది సంబరాలను ఘనంగా జరుపుకొన్నారు.
-పాడిపంటలతో కళకళలాడాలి..
సుఖసంతోషాలతో జీవించాలి:
- మేకపాటి రాజమోహన్‌రెడ్డి
దేశంలో, రాష్ట్రంలో, జిల్లాలో ప్రజలందరూ పాడిపంటలతో, సుఖసంతోషాలతో జీవించాలని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారిని వేడుకున్నట్లు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి తెలిపారు. ఉగాది పండగ సందర్భంగా స్థానిక కరెంటాఫీస్ సెంటర్ సమీపంలోని శ్రీరాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో శనివారం ఆయన కుటుంబసమేతంగా అమ్మవారిని దర్శించుకుని విశేషపూజలు చేశారు.
అనంతరం ఆయన మాట్లాడారు. తెలుగు వత్సరాది ఉగాది పండగనాడు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ ఏడాది అంతా సకాలంలో వర్షాలు కురియాలని, పంటలు విరివిగా పండాలని, ప్రజలందరికీ ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా భగవంతుడు చల్లంగా చూడాలని మొక్కుకున్నానని మేకపాటి రాజమోహన్‌రెడ్డి అన్నారు.