సాక్షి ప్రతినిధి, కర్నూలు: శ్రీశైలానికి స్వైన్ ఫ్లూ ఎఫెక్ట్ తగిలింది. మహాశివరాత్రి పండగ రోజు మంగళవారం కూడా పురవీధుల్లో భక్తుల రద్దీ పెద్దగా కనిపించలేదు. వచ్చినవారంతా వచ్చినట్టే తిరుగు ప్రయాణమయ్యారు.
రద్దీ ప్రాంతంలో ఎక్కువసేపు ఉంటే ఎక్కడ స్వైన్ ఫ్లూ సోకుతుందన్న భయం ఒకవైపు... మరోవైపు రాత్రి సమయాల్లో బస చేసేందుకు అనువైన ఏర్పాట్లు కూడా లేకపోవడంతో దర్శనం ముగిసిన వెంటనే తమ గమ్యస్థానాలకు వెళ్లిపోయారు. దీంతో గతంతో పోలిస్తే తమ వ్యాపారం తగ్గిపోయిందని పలువురు స్థానిక వ్యాపారులు వాపోతున్నారు. మొత్తం మీద స్వైన్ ఫ్లూ భయంతో శ్రీశైలంలో ఎక్కడ చూసినా అటు ఆలయ సిబ్బందితో పాటు ఇటు భక్తులు కూడా మాస్కులు ధరించి ఉండటం కనిపించింది.
ఇచ్చింది మాములు మాస్కులే...!
అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలల్లో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. అనేక మంది
మరణించారు కూడా. ఈ నేపథ్యంలో శ్రీశైలానికి ఇరు రాష్ట్రాల భక్తులు పెద్ద సంఖ్యలోనే వస్తారు. ఈ స్వైన్ ఫ్లూ భయంతో శ్రీశైలంలో రోజంతా ఉండకుండా... దర్శనం ముగిసిన వెంటనే తమ ప్రాంతాలకు వెళ్లాలనే తొందర భక్తులో కనిపించింది. మరోవైపు ఆలయ సిబ్బందికి, సెక్యూరిటీ సిబ్బందికి మాస్కులను పంపిణీ చేశారు. అయితే, ఇవి కేవలం మాములు మాస్కులు మాత్రమే. వాస్తవానికి స్వైన్ ఫ్లూ నుంచి రక్షణ పొందాలంటే మూడు లేయర్లు ఉన్న ఎన్-95 మాస్కులే సురక్షితం. ఈ మాస్కులను పెద్దగా ఆలయ అధికారులు పంపిణీ చేయలేదు. కేవలం మామూలు మాస్కులను పంపిణీ చేసి మమ అనిపించారు.
అంతేకాకుండా... వచ్చిన భక్తులు కూడా పెద్ద సంఖ్యలో మాస్కులు ధరించి ఉండటం గమనిస్తే స్వైన్ ఫ్లూ ప్రభావాన్ని అర్థం చేసుకోవచ్చు. ‘గతంలో శివరాత్రి కచ్చితంగా శ్రీశైలంలో ఉండాలన్న భావన భక్తుల్లో కనిపించేది. రోజులు మారడంతో పాటు ప్రజల ఆలోచనల్లో కూడా మార్పు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ వచ్చిన వారందరికీ వసతి సౌకర్యాలు లేకపోవడంతో దర్శనం చేసుకుని వెళితే సరిపోతుందిలే అన్న అభిప్రాయమే అధిక మందిలో వ్యక్తమవుతోంది. ఈ కారణం వల్లనే భక్తుల రద్దీ తగ్గింది’ అని ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న ఎస్‌ఐ ఒకరు అభిప్రాయపడ్డారు.
శివమాల దీక్ష విరమణ మారడమూ కారణమే...!
వాస్తవానికి శివదీక్ష విరమణ గతంలో శివరాత్రి రోజే ఉండేది. అయితే, శివరాత్రి రోజు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని గత ఏడాది నుంచి శివరాత్రి ముగిసిన రెండు రోజులకు పూర్ణాహుతి రోజు అంటే 19వ తేదీకి మార్చారు. ప్రధానంగా శివమాల భక్తుల రద్దీ తగ్గడానికి ఇది కూడా మరో కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
బిజినెస్ బేజార్...!
గతంతో పోలిస్తే తమ వ్యాపారమూ బాగా తగ్గిపోయిందని అధిక మంది వ్యాపారాలు అభిప్రాయపడుతున్నారు. వచ్చిన భక్తులు వచ్చినట్టే వెళ్లడం ఇందుకు కారణమని వారు అంటున్నారు. ‘గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది భక్తుల రద్దీ తగ్గింది. స్వైన్ ఫ్లూ ఫ్రబావమే ఇందుకు కారణం. మా వ్యాపారమూ కూడా తగ్గిపోయింది’ అని విభూది, ప్రసాదాలు, మాలల వ్యాపారం చేసే పుల్లయ్య అభిప్రాయపడ్డారు. ‘వచ్చిన వాళ్లు వచ్చినట్టే వెళ్లిపోతున్నారు. ఇక్కడే రాత్రి పూట బస చేయడం లేదు. గత ఏడాది చానా మంది వచ్చినారు’ అని జ్యూస్ వ్యాపారం తిరుమల ప్రసాద్ వివరించారు.
స్వైన్ భయం..!
Published Wed, Feb 18 2015 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 9:29 PM
Advertisement
Advertisement