హడలెత్తిస్తున్న స్వైన్‌ఫ్లూ | Three Patients Death With H1N1 Virus In Kurnool | Sakshi
Sakshi News home page

హడలెత్తిస్తున్న స్వైన్‌ఫ్లూ

Published Thu, Oct 25 2018 2:02 PM | Last Updated on Thu, Oct 25 2018 2:02 PM

Three Patients Death With H1N1 Virus In Kurnool - Sakshi

వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో మాస్క్‌లు ధరించి విధులు నిర్వర్తిస్తున్న ఉద్యోగులు

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో 2010–11 ప్రాంతంలో  స్వైన్‌ఫ్లూ అంటే అదో కొత్త రోగం. అప్పట్లో మీడియాలో సైతం ఈ వ్యాధిపై విస్తృతంగాప్రచారం జరిగింది. ఈ కారణంగా అప్పట్లో ఎక్కడ చూసినా ప్రజలు నోటికి మాస్క్‌లు ధరించి లేదా చేతిరుమాలు అడ్డుగా పెట్టుకుని తిరిగేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. రోజూ కొన్ని కేసులు బయటపడుతుండడం, అదే స్థాయిలో మరణాలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా కర్నూలు మండలం వెంగన్నబావి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు, ప్యాపిలికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి, ఆదోనికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో చనిపోయారు. నెలరోజుల వ్యవధిలో 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా..వీరిలో పది మంది మృతిచెందడం ఆందోళన కల్గించే విషయం.

మిగిలిన వారిలో ఏడుగురు కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం ఎనిమిది మంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వ్యాధికి గురైన వారిలో నలుగురు మాత్రమే ఇతర జిల్లాలకు చెందిన వారున్నారు. మిగతా 21 మంది ఈ జిల్లా వారే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ గోనెగండ్ల మండలంలో ఒకరు ఈ వ్యాధికి గురై మరణించారు. ఇవి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో నమోదైన లెక్కలు మాత్రమే. స్వైన్‌ఫ్లూ ఉందంటే ఎక్కడ దూరం పెడతారేమోనని భయపడి చాలా మంది ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లలోని వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కర్నూలు కొత్తబస్టాండ్‌ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ముగ్గురు రోగులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేవలం కర్నూలు మెడికల్‌ కాలేజీలోని మైక్రోబయాలజీ విభాగంలో మాత్రమే ఉన్నా.. వ్యాధి లక్షణాలను బట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ పేరిట సాధారణ రోగులను కూడా భయపెట్టి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. 

వైద్య ఉద్యోగుల్లో ఆందోళన
స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారిలో ఇద్దరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులతో పాటు కర్నూలు మెడికల్‌ కాలేజీలో ఒకరు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా.. మిగిలిన ఇద్దరు ఇంటి వద్దే ఉంటూ వైద్యుల సూచనల మేరకు వైద్యం అందుకుంటున్నారు. ఇక ఆసుపత్రిలో పది మంది  స్వైన్‌ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు.  కొందరు ఐసోలేషన్‌ విభాగంలో ఉండగా, మరికొందరు ఏఎంసీలో చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు వ్యాధి లక్షణాలతో జనరల్‌ వార్డుల్లోనే ఉన్నారు. రోగులు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటే వైద్యసిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ లక్షణాలు కనిపించిన వారందరికీ ముక్కులో స్వైప్‌ ద్వారా గళ్లను తీసి పరీక్షకు పంపిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వారి వద్దకు కొంత మంది వైద్యసిబ్బంది, నర్సులు వెళ్లేందుకు జంకుతున్నారు. ఆసుపత్రిలోని నాల్గవ తరగతి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా వారికి వైద్యసేవలు అందేలా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. 

మాస్క్‌లతో వైద్య, ఆరోగ్య శాఖలో విధులు
వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే ఇద్దరికి స్వైన్‌ఫ్లూ  నిర్ధారణ కావడంతో కార్యాలయంలో అధికారులతో పాటు అన్ని స్థాయిల ఉద్యోగులు మంగళవారం నుంచి విధిగా మాస్క్‌లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు, వైద్యులు సైతం స్వైన్‌ఫ్లూ నివారణకు స్వీయ నియంత్రణ ముఖ్యమని చెప్పడంతో ప్రతి ఒక్కరూ రక్షణ చర్యలు పాటిస్తున్నారు. బుధవారం వైద్య,ఆరోగ్యశాఖతో పాటు ప్రాంతీయ శిక్షణ కేంద్రాల్లోనూ అధిక శాతం ఉద్యోగులు మాస్క్‌లు ధరించి విధులు నిర్వర్తించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement