H1N1 Virus
-
TS: మూడేళ్ల తర్వాత అక్కడ స్వైన్‌ఫ్లూ కలకలం.. బాలికకు పాజిటివ్!
మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో మూడేళ్ల తర్వాత మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇచ్చిన శాంపిల్ పరీక్ష చేయగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. జిల్లాలో చివరగా 2019 ఆగస్టులో స్వైన్‌ఫ్లూ కేసు నమోదవగా.. తాజాగా మరొకటి వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. లక్షణాలు ఇలా.. ఇది హెచ్1 ఎన్1 రకం ఇన్ఫ్లూ ఎంజా వైరస్. ఇది సోకిన వారిలో ముందుగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి అదేపనిగా నీరుకారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్‌ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. గతంలో పందులు తిరుగుతున్న ఆవరణలో దగ్గరగా ఉన్న వారికి వచ్చేది. ప్రస్తుతం ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా త్వరగా సోకుతుంది. వైద్యుల పర్యవేక్షణలోనే.. స్వైన్‌ఫ్లూ టీకా, మందులు వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులోకి రాకుండా చూడాలి. ఆక్సిజన్‌తోపాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు వాడాల్సి ఉంటుంది. వారికే ఎక్కువగా.. స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మిన, దగ్గిన టేబుల్, ఇతర వస్తువుల మీద పడిన తుంపర్ల నుంచి ఇతరులకు సోకుతుంది. చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది త్వరగా సోకే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్ పీడితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడే వాళ్లకు ఎక్కువగా ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు ఇలా.. ఏడాది పాజిటివ్ కేసులు 2013 3 2014 5 2015 37 2016 3 2017 5 2018 4 2019 4 2022 1 జాగ్రత్తలు పాటించండి జిల్లాకేంద్రంలో ఒకరికి స్వైన్‌ఫ్లూ రావడంతో కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచడంతోపాటు అవసరమైన మందులు ఇచ్చాం. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. వైరస్ సోకిన వారు ఎక్కువ సమయం నిద్రించడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి. – కృష్ణ, డీఎంహెచ్ఓ -
అమెరికా విచారణకు చైనా నో!
బీజింగ్/ప్యారిస్/కరాచీ: కరోనా వైరస్ పుట్టుకపై విచారణకు తమ దేశ బృందాలను అనుమతించాలంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన డిమాండ్‌ను చైనా సోమవారం తోసిపుచ్చింది. మేము కరోనా బాధితులమేగానీ, నేరస్తులం కాదంటూ స్పష్టం చేసింది. వూహాన్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పినా ఆ దేశం నుంచి స్పందన లేదని ఆదివారం ట్రంప్ వ్యాఖ్యానించడం తెల్సిందే. కరోనా వైరస్ చైనాలోని వూహాన్లో ఒక పరిశోధనశాల నుంచి తప్పించుకుందా? అనే కోణంలో అమెరికా విచారణ ప్రారంభించింది. ఈ పరిణామాలపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి గెంగ్ షువాంగ్ సోమవారం స్పందిస్తూ.. ‘వైరస్ మానవాళి మొత్తానికి శత్రువు. అది ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రత్యక్షం కావచ్చు. ఏ దేశంపైనైనా విరుచుకు పడవచ్చు. మేమూ బాధితులమే. నేరస్తులం కాదు. ఈ వైరస్‌ను తయారు చేసిన వాళ్లలో మేము లేము’అని అన్నారు. సకాలంలో వైరస్ సమాచారం ఇవ్వని చైనాపై చర్యలు తీసుకోవాలని అమెరికా నేతలు డిమాండ్ చేయడంపై గెంగ్ మాట్లాడుతూ..‘వూహాన్లో తొలిసారి వైరస్‌ను గుర్తించింది మొదలు ఇప్పటివరకూ చైనా అన్ని అంశాలను పారదర్శకంగా, బాధ్యతాయుతంగా నిర్వహిస్తోంది. వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటోంది’అని తెలిపారు. వైరస్ కట్టడికి సంబంధించి చైనా అంతర్జాతీయ సమాజానికి విలువైన సమాచారాన్ని ఇచ్చిందని చెప్పారు. ప్రపంచవ్యాప్త మరణాలకు చైనాపై దావా వేయాలన్న అమెరికా నేతల మాటలకు స్పందిస్తూ.. ఇలాంటి ఘటన ఏదీ గతంలో జరగలేదని, 2009లో హెచ్1ఎన్1 అమెరికాలో బయటపడిందని, హెచ్ఐవీ/ఎయిడ్స్, 2008 నాటి ఆర్థిక సంక్షోభం అమెరికాలో మొదలై ప్రపంచాన్ని కుదిపేశాయని గెంగ్ గుర్తు చేశారు. అప్పట్లో ఎవరైనా అమెరికా బాధ్యత ఏమిటని అడిగారా? అని ప్రశ్నించారు. కరోనా వైరస్‌పై చైనాలో అంతర్జాతీయ బృందం ఒకటి విచారణ జరపాలన్న ఆస్ట్రేలియా విదేశీ వ్యవహారాలమంత్రి మరైస్ పేన్ పిలుపును గెంగ్ కొట్టివేశారు.. యూరప్‌లో 11లక్షల మందికి.. యూరప్ మొత్తమ్మీద 11.83 లక్షల మందికి కరోనా వైరస్ సోకింది. సోమవారం వరకూ దాదాపు లక్ష మంది ప్రాణాలు కోల్పోయారు. ఆసియాలో 1.66 లక్షల మంది కోవిడ్–19తో బాధపడుతూంటే సుమారు ఏడు వేల మంది ప్రాణాలు కోల్పోయారు. ► పాకిస్తాన్‌లోని సింధ్‌లో ఓ నిండు గర్భిణి ఆకలికి బలైంది. దేశవ్యాప్త లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో సుగ్రా బీబీ(30) గత వారం మరణించినట్లు వార్తలొచ్చాయి. దినసరి కూలీలమైన తమకు లాక్డౌన్ కారణంగా పని దొరకలేదని, ఆరుగురు పిల్లలున్న తమ కుటుంబానికి ఆహారం అందడం కష్టమైందని సుగ్రా భర్త చెప్పాడు. కేసులు తగ్గాయి: చైనా తమదేశంలో కొత్తగా కరోనా కేసులు తగ్గిపోతున్నాయని చైనా తెలిపింది. తాజాగా మొత్తం 12 కొత్త కేసులు బయటపడగా ఇందులో 8 విదేశాల నుంచి వచ్చిన చైనీయులవేనని అధికారులు చెప్పారు. చైనాలో ఆదివారం కోవిడ్ కారణంగా ఎలాంటి మరణాలు సంభవించలేదు. ఇదే సమయానికి విదేశాల నుంచి వచ్చిన చైనీయులు 1,583 మందికి వ్యాధి సోకింది. వీరిలో 43 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. -
కరోనా వైరస్ మాటున స్వైన్ ఫ్లూ
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలో కాలానుగుణంగా సంక్రమించే వైరస్ అంటు వ్యాధులను మొదటి సారిగా 2009లో గుర్తించారు. జనవరి నుంచి మార్చి, జూలై నుంచి సెప్టెంబర్ నెలల మధ్య ఈ వైరస్ల వల్ల ప్రజలు జబ్బు పడుతున్నారు. 2019లోనే భారత దేశాన్ని స్వైన్ ఫ్లూ కుదిపేసింది. శాస్త్ర విజ్ఞాన పరిభాషలో ‘హెచ్1ఎన్1’గా వ్యవహరించే ఈ వైరస్ కేసులు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 2019లో భారత్‌లో రెట్టింపు అయ్యాయి. (చదవండి: ప్రపంచ దేశాల్లో ప్రజా దిగ్భందనం) ఈ ఏడాది కూడా మార్చి వరకు దేశంలో స్వైన్ ఫ్లూ కేసులు 1100 దాఖలుకాగా, 28 మంది మరణించారు. ఈ స్వైన్ ఫ్లూ కారణంగా ఫిబ్రవరి నెలలో జర్మనీకి చెందిన కంపెనీ స్వాప్ భారత్‌లోని తన యూనిట్‌ను మూసివేసింది. బెంగళూరులోని తమ కంపెనీ ప్రధాన కార్యాలయంలో ఇద్దరు ఉద్యోగులకు ఈ వైరస్ సోకడంతో కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. మార్చి మొదటి వారానికి ఒక్క ఉత్తరప్రదేశ్‌లోనే 78 కేసులు నమోదయ్యాయి. వారిలో 19 మంది పోలీసులు అస్వస్థులుకాగా వారిలో 9 మంది మరణించారు. అదే నెలలో ఈ వైరస్ కారణంగా ఆరుగురు సుప్రీం కోర్టు జడ్జీలు అస్వస్థులయ్యారు. 2018 సంవత్సరంలో పోల్చినట్లయితే 2019లో స్వైన్ ప్లూ కేసులు రెట్టింపు అయినట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి అశ్వణి కుమార్ చౌబే స్వయంగా లోక్‌సభలో ఓ ప్రశ్నకు సమాధానంగా వెల్లడించారు. మరణాలు కూడా అదే నిష్పత్తిలో పెరిగాయి. కోవిడ్ మహమ్మారి గురించి వార్తలు వెలువడడంతో ఈ స్వైన్ ఫ్లూ కేసులు మరుగున పడిపోయాయి. వాస్తవానికి రెండు వైరస్ల లక్షణాలు ఒకే రీతిగా ఉంటాయి. జలుబు, దగ్గు, గొంతు మంట, శ్వాస ఇబ్బంది, జ్వరం బాధిస్తాయి. వైరస్ సోకకుండా ఉండాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ఒకటే! (కరోనా ఎఫెక్ట్ : అలిపిరి టోల్గేట్ మూసివేత) -
ఆరుగురు సుప్రీం జడ్జిలకు హెచ్1ఎన్1 వైరస్
సాక్షి, న్యూఢిల్లీ: స్వైన్ ఫ్లూ కేసులు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్లో ఆందోళన రేపుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు చెందిన ఆరుగురు జడ్జిలకు ప్రాణాంతక మైన హెచ్1ఎన్1 (స్వైన్‌ప్లూ) వైరస్ సోకింది. దీంతో న్యాయమూర్తులు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డేతో అత్యవసరంగా సమావేశమయ్యారు. స్వైన్ ప్లూ వ్యాప్తి చెందుతున్న వైనంపై సమీక్ష నిర్వహించారు. తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామని జస్టిస్ చంద్రచూడ్ వెల్లడించారు. అత్యవసర పరిస్థితులలో ముందు జాగ్రత్తగా తీసుకోవాల్సిన చర్యలపై ఆదేశాలు జారీ చేయాలని భారత ప్రధాన న్యాయమూర్తిని (సీజేఐ) కోరామని తెలిపారు. అలాగే సుప్రీంకోర్టులో పనిచేసే వ్యక్తులపై టీకాలు వేయడానికి సంబంధించి ఆదేశాలు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. అలాగే ప్రధాన న్యాయమూర్తి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దుష్యంత్ దేవ్‌తో కూడా సమావేశమయ్యారు. అనంతరం దేవ్ మాట్లాడాతూ వైరస్ వ్యాప్తిపై బాబ్డే చాలా ఆందోళన వ్యక్తం చేశారని, టీకాలు వేసేందుకు వీలుగా ఒక డిస్పెన్సరీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారన్నారు. కాగా కశ్మీర్, బెంగళూరు నగరాల్లో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు గాకా, తాజా కేసులతో ఈ వైరస్ ఢిల్లీ నగరానికి కూడా విస్తరించింది. బెంగళూరుకు చెందిన సాప్ ఇండియా సంస్థ తన ఉద్యోగుల్లో ఇద్దరికి హెచ్1ఎన్1 పాజిటివ్ రావడంతో ముందు జాగ్రత్త చర్యగా అన్ని కార్యాలయాలను (శుభ్రపరిచేందుకు)మూసివేసింది. ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సిందిగా సూచించిన సంగతి తెలిసిందే. -
ఇద్దరికి వైరస్, ఆఫీసులు మూసివేసిన టెక్ సంస్థ
సాక్షి, బెంగళూరు: ఒకవైపు ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్-19(కరోనా వైరస్) ప్రకంపనలుకొనసాగుతుండగానే బెంగళూరు నగరంలో స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడం మరింత ఆందోళన రేపుతోంది. తాజాగా జర్మనీ సాఫ్ట్వేర్ గ్రూప్ కుచెందిన భారత సంస్థ ‘సాప్’ ఉద్యోగులకు ప్రాణాంతక స్వైన్ ఫ్లూ కారక హెచ్1ఎన్1 వైరస్ సోకడంతో ఆ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. తాత్కాలికంగా తన కార్యాలయాలన్ని మూసివేయడంతో పాటు, ఉద్యోగులకు ఇంటినుంచే సదుపాయాన్ని కల్పించింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ప్రకారం, హెచ్1ఎన్1 లక్షణాలలో జ్వరం, చలి, గొంతు నొప్పిలాంటివి సాధారణ జలుబు లక్షణాలుగా పైకి కనిపించినప్పటికీ, ఈ వైరల్ న్యుమోనియా ఆరోగ్యకరమైన యువకులను కబళించే తీవ్రత ఉన్న కారణంగా ఈ ముందస్తు చర్యలు చేపట్టింది.బెంగళూరులో సాప్కు చెందిన ఇద్దరు ఉద్యోగులు హెచ్1ఎన్1 వైరస్ ఫలితం పాజిటివ్ వచ్చింది. దీంతో శానిటైజేషన్ కోసం భారత్‌లోని తన కార్యాలయాలను తాత్కాలికంగా మూసివేసినట్టు సాప్ ప్రకటించింది. బెంగళూరు, గుర్గావ్, ముంబై ఆఫీసులలో సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్టు తెలిపింది. అలాగే తదుపరి నోటీసు వచ్చేంతవరకు తమ ఉద్యోగులందరూ ఇంటి నుండే పని చేయాలని కోరింది. -
మళ్లీ ‘స్వైన్’ సైరన్!
సాక్షి, సిటీబ్యూరో: కొంతకాలంగా స్తబ్దుగా ఉన్న హెచ్1ఎన్1 స్వైన్‌ఫ్లూ కారక వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. పగటిపూట ఎండలు తగ్గుముఖం పట్టడం, సాయంత్రం చిరుజల్లులకు తోడు చలిగాలులు వీస్తుండటంతో వైరస్ బలపడుతోంది. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటి వరకు 1227 స్వైన్‌ఫ్లూ పాజిటివ్ కేసులు నమోదు కాగా, కేవలం రెండు వారాల్లోనే పదిహేను కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. ఇదిలా ఉంటే గత ఏడాది 1007 కేసులు నమోదు కాగా, వీరిలో 28 మంది మృత్యువాతపడ్డారు. ఈ ఏడాది ఇప్పటికే 20 మంది మృతి చెందినట్లు అధికారుల గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. అనధికారికంగా ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉన్నట్లు సమాచారం. జిల్లాలతో పోలిస్తే గ్రేటర్ పరిసర ప్రాంతాల్లోనే ఫ్లూ తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. చాప కింది నీరులా విస్తరిస్తున్న ఈ స్వైన్‌ఫ్లూపై మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. హైరిస్క్ గ్రూప్‌ను వెంటాడుతున్న ఫ్లూ భయం పదేళ్ల క్రితం ప్రపంచాన్ని గడగడలాండించిన స్వైన్‌ఫ్లూ వైరస్ మరోసారి విస్తరిస్తుంది. కేవలం గ్రేటర్‌లోనే కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనూ చాప కింది నీరులా విస్తరిస్తుండటంతో సామాన్య ప్రజలే కాదు రోగులు చికిత్స పొందుతున్న ఆయా ఆస్పత్రుల్లో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడ తమను ఆ వైరస్ వెంటాడుతుందోనని ఆందోళన చెందుతున్నాయి. కేవలం గ్రేటర్లో నమోదైన కేసులే కాకుండా జిల్లాల్లో నమోదైన కేసులు సైతం నగరంలోని ఆస్పత్రులకు తరలిస్తుండటంతో హెచ్1ఎన్1 వైరస్ ఎక్కడ తమకు చుట్టు కుంటుందోనని భయపడుతున్నారు. గతంలో హైరిస్క్ జోన్లో పని చేస్తున్న సిబ్బందికి రోగి నుంచి వైరస్ సోకడమే ఇందుకు కారణం. వ్యాధి నివారణలో భాగంగా వీరికి ముందస్తు వాక్సిన్ ఇవ్వాల్సి ఉండగా, స్వైన్‌ఫ్లూ రోగులకు చికిత్స అందిస్తున్న గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో ఈ మందు మచ్చుకైనా కన్పించడం లేదు. వైరస్ సోకకుండా ఒక్కక్కరికి ఒక్కో డోసు చొప్పున పంపిణీ చేయాల్సి ఉంది. కానీ స్వైన్‌ఫ్లూ కేసులు ఎక్కువగా నమోదవుతున్న ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల్లో కూడా వ్యాక్సిన్ లేక పోవడంతో అక్కడ పని చేసే వైద్యులే కాకుండా చికిత్సల కోసం అక్కడికి వస్తున్న రోగులు సైతం భయ పడుతున్నారు. చివరకు ఫ్లూ బాధితుల వద్దకు వెళ్లడానికి కూడా సిబ్బంది జంకుతున్నారు. ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరి సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరు కారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. కొందరికి వాంతులు, విరేచనాలు అవుతాయి. గర్భిణులు, శ్వాస కోశ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. వ్యాధి బారిన పడిన వ్యక్తి తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్ వాతావరణంలో రెండుగంటలకుపైగా జీవిస్తుంది. ఫ్లూ లక్షణాలతో బాధపడే వారికి దూరంగా ఉండాలి. మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. జనసమూహ ప్రాంతాలకు వెళ్లక పోవడమే ఉత్తమం. తీర్థయాత్రలు, ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ఇతరులకు షేక్‌హ్యాండ్ ఇవ్వడం, కౌగిలించుకోవ డం చేయరాదు. చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోకూడదు. అనుమానం వచ్చిన వెంటనే వ్యాధి నిర్ధారణ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. – డాక్టర్ శ్రీధర్, ఉస్మానియా ఆస్పత్రి -
స్వైన్‌ఫ్లూ విజృంభణ
మండు వేసవిలో స్వైన్‌ఫ్లూఘంటిక మోగింది. రానున్నది వర్షాకాలం కావడంతో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ అదుపులోకి రాకపోగా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ప్రాణాంతక హెచ్1ఎన్1 చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గత 15 రోజుల్లో 20 మంది బలి అయ్యారు. ఇందులో ఉడుపి నుంచి అత్యధికంగా 8 మంది, శివమొగ్గ నుంచి ఆరుగురు మరణించారు. ఈమేరకు ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికల ద్వారా తెలుస్తోంది. కాలానికి అనుగుణంగా వచ్చే అంటువ్యాధి కావడంతో జాగ్రత్తలు వహించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉడుపి – 8, శివమొగ్గ – 6, దావణగెరె 2, బెంగళూరు నగరం, చిక్కమగళూరు, గదగ్, రామనగర జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గత 15 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా హెచ్1ఎన్1 బాధితుల సంఖ్య గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సజ్జన్ శెట్టి తెలిపారు. జనవరి నుంచి 76 మంది బలి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 6,138 మందికి హెచ్1ఎన్1 వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 1,607 మందికి వైరస్ సోకినట్లు నిర్దారించారు. కాగా వారిలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈనెల 28వ తేదీన డెత్ ఆడిట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. సమావేశంలో భాగంగా వైద్యాధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు. అదేవిధంగా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. హెచ్1ఎన్1 బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 64,126 టామిఫ్లూ మందులు అందజేశారు. రోగులకు ప్రత్యేక చికిత్స ఇచ్చేందుకు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్‌తో కూడిన ఐదు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. -
హడలెత్తిస్తున్న స్వైన్‌ఫ్లూ
కర్నూలు(హాస్పిటల్): జిల్లాలో 2010–11 ప్రాంతంలో స్వైన్‌ఫ్లూ అంటే అదో కొత్త రోగం. అప్పట్లో మీడియాలో సైతం ఈ వ్యాధిపై విస్తృతంగాప్రచారం జరిగింది. ఈ కారణంగా అప్పట్లో ఎక్కడ చూసినా ప్రజలు నోటికి మాస్క్‌లు ధరించి లేదా చేతిరుమాలు అడ్డుగా పెట్టుకుని తిరిగేవారు. ఇప్పుడు కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. రోజూ కొన్ని కేసులు బయటపడుతుండడం, అదే స్థాయిలో మరణాలు సంభవిస్తుండటంతో ప్రజల్లో ఆందోళన నెలకొంది. తాజాగా కర్నూలు మండలం వెంగన్నబావి ప్రాంతానికి చెందిన 27 ఏళ్ల యువకుడు, ప్యాపిలికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి, ఆదోనికి చెందిన 54 ఏళ్ల వ్యక్తి ఈ వ్యాధితో చనిపోయారు. నెలరోజుల వ్యవధిలో 25 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా..వీరిలో పది మంది మృతిచెందడం ఆందోళన కల్గించే విషయం. మిగిలిన వారిలో ఏడుగురు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎనిమిది మంది కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వ్యాధికి గురైన వారిలో నలుగురు మాత్రమే ఇతర జిల్లాలకు చెందిన వారున్నారు. మిగతా 21 మంది ఈ జిల్లా వారే. ఈ ఏడాది ఫిబ్రవరిలోనూ గోనెగండ్ల మండలంలో ఒకరు ఈ వ్యాధికి గురై మరణించారు. ఇవి కర్నూలు సర్వజన ఆసుపత్రిలో నమోదైన లెక్కలు మాత్రమే. స్వైన్‌ఫ్లూ ఉందంటే ఎక్కడ దూరం పెడతారేమోనని భయపడి చాలా మంది ప్రైవేటు నర్సింగ్‌హోమ్‌లలోని వైద్యుల వద్ద చికిత్స తీసుకుంటున్నట్లు సమాచారం. కర్నూలు కొత్తబస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ముగ్గురు రోగులు చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. ఈ వ్యాధి నిర్ధారణ పరీక్షలు కేవలం కర్నూలు మెడికల్ కాలేజీలోని మైక్రోబయాలజీ విభాగంలో మాత్రమే ఉన్నా.. వ్యాధి లక్షణాలను బట్టి ప్రైవేటు ఆసుపత్రుల్లో రోగులకు చికిత్స అందిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ పేరిట సాధారణ రోగులను కూడా భయపెట్టి భారీగా ఫీజులు వసూలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. వైద్య ఉద్యోగుల్లో ఆందోళన స్వైన్‌ఫ్లూ బారిన పడిన వారిలో ఇద్దరు జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఉద్యోగులతో పాటు కర్నూలు మెడికల్ కాలేజీలో ఒకరు ఉన్నారు. వీరిలో ఒక్కరు మాత్రమే ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా.. మిగిలిన ఇద్దరు ఇంటి వద్దే ఉంటూ వైద్యుల సూచనల మేరకు వైద్యం అందుకుంటున్నారు. ఇక ఆసుపత్రిలో పది మంది స్వైన్‌ఫ్లూ రోగులు చికిత్స పొందుతున్నారు. కొందరు ఐసోలేషన్ విభాగంలో ఉండగా, మరికొందరు ఏఎంసీలో చికిత్స తీసుకుంటున్నారు. మరికొందరు వ్యాధి లక్షణాలతో జనరల్ వార్డుల్లోనే ఉన్నారు. రోగులు జలుబు, దగ్గు, ఒళ్లు నొప్పులు, తలనొప్పి, ఊపిరి తీసుకోలేకపోవడం వంటి లక్షణాలతో బాధపడుతుంటే వైద్యసిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ లక్షణాలు కనిపించిన వారందరికీ ముక్కులో స్వైప్ ద్వారా గళ్లను తీసి పరీక్షకు పంపిస్తున్నారు. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వారి వద్దకు కొంత మంది వైద్యసిబ్బంది, నర్సులు వెళ్లేందుకు జంకుతున్నారు. ఆసుపత్రిలోని నాల్గవ తరగతి సిబ్బంది, సెక్యూరిటీ గార్డులు, పారిశుద్ధ్య సిబ్బంది ద్వారా వారికి వైద్యసేవలు అందేలా పనిచేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మాస్క్‌లతో వైద్య, ఆరోగ్య శాఖలో విధులు వైద్య, ఆరోగ్య శాఖ కార్యాలయంలో పనిచేసే ఇద్దరికి స్వైన్‌ఫ్లూ నిర్ధారణ కావడంతో కార్యాలయంలో అధికారులతో పాటు అన్ని స్థాయిల ఉద్యోగులు మంగళవారం నుంచి విధిగా మాస్క్‌లు ధరించి విధులు నిర్వర్తిస్తున్నారు. అధికారులు, వైద్యులు సైతం స్వైన్‌ఫ్లూ నివారణకు స్వీయ నియంత్రణ ముఖ్యమని చెప్పడంతో ప్రతి ఒక్కరూ రక్షణ చర్యలు పాటిస్తున్నారు. బుధవారం వైద్య,ఆరోగ్యశాఖతో పాటు ప్రాంతీయ శిక్షణ కేంద్రాల్లోనూ అధిక శాతం ఉద్యోగులు మాస్క్‌లు ధరించి విధులు నిర్వర్తించారు. -
మళ్లీ ‘స్వైన్’ సైరన్
గ్రేటర్లో స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. గత రెండు వారాల్లో 20 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. గాంధీలో ఓ మహిళ స్వైన్ ఫ్లూ కారణంగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తొమ్మిదేళ్ల క్రితం నగరంలో స్వైన్ కేసులు వెలుగు చూశాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా స్వైన్ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం బాధితులకు ‘ఒసల్టా మీవీర్ టాబ్లెట్స్, సిరప్’లను ఉచితంగా సరఫరా చేస్తున్నా.. చికిత్సల పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడం వల్లే చాలా మంది కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. ఇక దోమల కారణంగా డెంగీ సైతం నగరవాసులను భయపెడుతోంది. వేలాది మంది డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సాక్షి, సిటీబ్యూరో/గాంధీఆస్పత్రి: స్వైన్‌ఫ్లూ(హెచ్1ఎన్1 వైరస్) మళ్లీ విజృంభిస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం రెండు వారాల్లోనే 20 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, తాజాగా మూసారంబాగ్‌కు చెందిన అజిజాభాను(52)గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ముగ్గురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం నగర వాతావరణంలోకి ప్రవేశించిన ఈ ఫ్లూ వైరస్ అనేక మంది ప్రాణాలను బలిగొంది. స్పందించిన ప్రభుత్వం అప్పట్లో వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను సైతం ఏర్పాటు చేసి చికిత్స అందించింది. రెండేళ్లుగా ఈ ఫ్లూ ఆనవాళ్లు కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ స్వైన్‌ఫ్లూ పంజా విసరడంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం బాధితులకు ‘ఒసల్టా మీవీర్ టాబ్లెట్స్, సిరప్’లను ఉచితంగా సరఫరా చేస్తున్నా.. చికిత్సల పేరుతో కార్పొరేట్ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నోడల్ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడం వల్లే చాలా మంది కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. రోగుల నుంచి నమూనాలు సేకరించి, ఐపీఎంకు పంపడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రిపోర్టు వచ్చేలోపే మృతిచెందుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మృత్యు ఘంటికలు మోగిస్తున్న డెంగీ మరోపక్క డెంగీ దోమలు సైతం మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే జనవరి నుంచి ఇప్పటి వరకు 2,287 మంది రోగుల నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 557 డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. హైదరాబాద్ జిల్లాలో ఇప్పటి 250పైగా డెంగీ పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం మరో 12 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జియాగూడకు చెందిన 15 ఏళ్ల బాలుడితో పాటు అజామాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు గాంధీ, ఫీవర్ సహా ఇతర కార్పొరేట్ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. బాధితుల నుంచి నిలువు దోపిడీ నిజానికి శరీరంలో 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. సాధారణ జ్వర పీడితుల్లోనూ ప్లేట్లెట్స్ కౌంట్స్ తగ్గుతుంది. కౌంట్స్ 20 వేలలోపు ఉంటే వారికి ప్లేట్లెట్స్ ఎక్కించాలి. కానీ లక్షలోపు ఉన్నవారిని కూడా కార్పొరేట్ ఆస్పత్రులు వదలడం లేదు. కానీ నగరంలోని పలు ఆస్పత్రులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ జాబితాలో చేరుస్తున్నాయి. ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిందనే పేరుతో రోగులను నిలువునా దోచుకుంటున్నాయి. ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షలో బాధితుడికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆ బాధితుడి పూర్తి వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అందజేయడమే కాకుండా రెండో శాంపిల్‌ను ఐపీఎంకు పంపాలి. కానీ ప్రైవేటు ఆస్పత్రులు ఇవేమీ చేయడం లేదు. ‘ఐజీఎం ఎలిసా’ టెస్టును ప్రమాణికంగా ప్రభుత్వం నిర్ణయించగా, కార్పొరేట్ ఆస్పత్రులు మాత్రం ‘ఎన్ఎస్ 1’టెస్టును తీసుకుంటూ వైద్యసేవల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. స్వైన్‌ఫ్లూ సోకకుండా ఉండాలంటే.. ♦ తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్ గాలిలోకి ప్రవేశిస్తుంది. ♦ ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్ వాతావరణంలో 2గంటలకుపైగా జీవిస్తుంది. ♦ గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది. ♦ సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి. ♦ ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరుకారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి. ♦ ముక్కుకు మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి. ♦ వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి. ♦ జన సమూహ ప్రాంతాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. ప్రయాణాలు రద్దు చేసుకోవాలి. ♦ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు. ♦ ఇతరులకు షేక్హ్యాండ్ఇవ్వడ ం, కౌగిలించుకోవడం చేయరాదు. ♦ చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోవద్దు.– డాక్టర్ శ్రీహర్ష,జిల్లా సర్వేలెన్స్ ఆఫీసర్ దోమలు వ్యాప్తిచెందకుండా ఉండాలంటే.. ♦ ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ♦ నీటి ట్యాంకులు, కుండలు, క్యాన్లను వారానికోసారి శుభ్రం చేసుకోవాలి. ♦ పాత టైర్లు, కొబ్బరి బొండాలు, చెత్త కుండీలు అస్సలు ఉంచకూడదు. ♦ ఇంటి గదుల్లో గాలి వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. ♦ పిల్లలకు విధిగా పగటిపూట దోమ తెరలు వాడాలి. ♦ దోమలు ఇంటి లోపలికి రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలి. ♦ ఓవర్ హెడ్ ట్యాంక్‌లపై మూతలు విధిగా ఉంచాలి. ♦ మూడు రోజులకు మించి నిల్వ ఉన్న నీరు తాగరాదు. –డాక్టర్ నాగేందర్,సూపరింటెండెంట్, ఉస్మానియా -
కర్నూలులో స్వైన్‌ప్లూ కలకలం
కర్నూలు : కర్నూలు నగరంలో స్వైన్‌ప్లూ కలకలం సృష్టిస్తోంది. ప్రభుత్వాస్పత్రిలో ఏఎంసీ విభాగంలో ఇద్దరు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఈ మేరకు వైద్యాధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. వీరితో పాటు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ప్రకాష్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో అక్కడి వైద్యులు స్వాప్ ద్వారా పరీక్షకు పంపించారు. ఒకే రోజు నగరంలో ముగ్గురు రోగులకు స్వైన్‌ప్లూ లక్షణాలు కనిపించడంతో ఆందోళన నెలకొంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య ఆరోగ్యశాఖ సూచించింది. -
స్వైన్‌ఫ్లూ విజృంభణ : మరొకరి మృతి
-
స్వైన్‌ఫ్లూ విజృంభణ : మరొకరి మృతి
హైదరాబాద్ : రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మళ్లీ పంజా విసురుతోంది. గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూతో ఆదివారం రాత్రి మరో యువకుడు మరణించాడు. నాగర్‌కర్నూలు జిల్లా తాడూరు మండలం ఆకునెల్లికుదురు గ్రామానికి చెందిన లక్ష్మయ్య(31) స్వైన్‌ఫ్లూ కారణంగా మృతి చెందాడు. నాలుగు రోజులుగా కర్మన్‌ఘాట్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు స్వైన్‌ఫ్లూ సోకిందని నిర్ధారించి గాంధీ ఆస్పత్రికి తరలించారు. లక్ష్మయ్య చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో ఈ నెలలో ఇప్పటి వరకు ఐదుగురు మృతి చెందారు. చలి తీవ్రతకు హెచ్1ఎన్1 వైరస్ మరింత బలపడినట్లు వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. -
స్వైన్‌ఫ్లూతో మరో నలుగురి మృతి
హైదరాబాద్: ఎండలు ముదిరితే స్వైన్‌ఫ్లూ ప్రభావం తగ్గిపోతుందనే వైద్యుల అంచనాలను తలక్రిందులు చేస్తూ హెచ్1ఎన్1 వైరస్ మరింతగా విజృంభిస్తోంది. రెండు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎనిమిదేళ్ల బాలుడితో పాటు ముగ్గురు బాధితులు స్వైన్‌ఫ్లూతో మృతిచెందారు. హైదరాబాద్ కార్వాన్కు చెందిన మహ్మద్ మెహమూద్(55) స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చేరి ఆదివారం రాత్రి మృతి చెందాడు. మెహదీపట్నానికి చెందిన కమలమ్మ(70) స్వైన్‌ఫ్లూతో ఈనెల 15న ప్రీమియర్ ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై వచ్చి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన అల్తాఫ్(08), హైదరాబాద్ చింతల్‌కు చెందిన నాగలక్ష్మీ (50)లు గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొం దుతూ శనివారం రాత్రి మృతిచెందారు. సోమవారం అందిన నివేదికలో వీరికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 63కు పెరిగింది. గాంధీ ఐసోలేషన్ వార్డులో 39 మంది, చిల్డ్రన్స్ వార్డులో 13 మంది స్వైన్‌ఫ్లూ బాధితులు, మరో 26 మంది అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ నోడల్ అధికారి కె.నర్సింహులు తెలిపారు. -
ఆగని స్వైన్‌ఫ్లూ ఘంటికలు
-
ఆగని స్వైన్‌ఫ్లూ ఘంటికలు
‘గాంధీ’లో మరో ఇద్దరి మృత్యువాత 30కి చేరిన మృతుల సంఖ్య నల్లగొండ, మెదక్, మహబూబ్‌నగర్‌లలో మరో 4 ‘పాజిటివ్’ కేసులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న మరో 80 మంది బాధితులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో స్వైన్‌ఫ్లూ మరణ మృదంగం మోగిస్తోంది. వైరస్ నియంత్రణలో అధికారుల నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తున్నా, రోగులకు అందించాల్సిన చికిత్సపై కేంద్ర వైద్య బృందం పలు సూచనలు చేసినా ఆస్పత్రుల్లో మృత్యుఘంటికలు మాత్రం ఆగట్లేదు. ఫలితంగా రోజూ సగటున ఇద్దరు చొప్పున మృతి చెందుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం వరకు 1472 మందికి స్వైన్‌ఫ్లూ పరీక్షలు నిర్వహించగా, వారిలో 523 మందికి హెచ్1ఎన్1 వైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. బాధితుల్లో ఇప్పటివరకు 28 మంది మృతిచెందినట్లు ప్రభుత్వం ప్రకటించగా శుక్రవారం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు (చాదర్‌ఘాట్‌కు చెందిన అబ్దుల్ మన్నన్ (26), సయ్యద్‌నగర్‌కు చెందిన గులాం హుస్సేన్ (50)) స్వైన్‌ఫ్లూ రోగులు మరణించారు. మరోవైపు నల్లగొండ జిల్లాలో రెండు, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఒక్కోటి చొప్పున శుక్రవారం స్వైన్‌ఫ్లూ కేసులు బయటపడ్డాయి. గాంధీ, ఉస్మానియా సహా పలు కార్పొరేట్ ఆస్పత్రుల్లో మరో 80 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. హే...‘గాంధీ’... గాంధీ ఆస్పత్రిలోని స్వైన్‌ఫ్లూ వార్డులో నిత్యం 60-70 మంది చికిత్స పొందుతుండగా వారిలో ఇద్దరు, ముగ్గురు ప్రైవేటు ఆస్పత్రుల్లో చికిత్స పొంది పరిస్థితి విషమించడంతో చేరుతున్నారు. అయితే స్వైన్‌ఫ్లూతోపాటు న్యూమోనియా, మధుమేహం, కాలేయ, హ–ద్రోగ సంబంధిత సమస్యలతో బాధపడుతూ శ్వాస తీసుకోలేని రోగులకు క–త్రిమ శ్వాస కోసం ఏర్పాటు చేసిన 8 వెంటిలేటర్లను ఇన్పేషంట్లకు అమరుస్తుండగా రిఫరల్ కేసులతో చేరే రోగులకు అవి దొరకడంలేదు. దీనికితోడు ఉదయం పూట రౌండ్లకు వచ్చి వెళ్తున్న వైద్యులు మధ్యాహ్నం తర్వాత వచ్చే కేసులను పట్టించుకోవట్లేదని...అందుకే రోగులు మృతిచెందుతున్నారని బంధువులు ఆరోపిస్తున్నారు. నోడల్ ఆఫీసర్ సహా ఇతర వైద్యులు రోగులకు నిత్యం అందుబాటులో ఉండాల్సి ఉన్నా హౌస్సర్జన్లు, నర్సులకు బాధ్యతలు అప్పగించి వారు స్వైన్‌ఫ్లూ వార్డు వైపు కూడా వెళ్లట్లేదని తెలుస్తోంది. ఉస్మానియాలోనూ అంతే... ఉస్మానియా ఆస్పత్రిలో 20 రోజుల క్రితం 10 పడకలతో స్వైన్‌ఫ్లూ వార్డును ఏర్పాటు చేసి ఒక నోడల్ ఆఫీసర్, మరో స్టాఫ్ నర్సుకు రోగుల బాధ్యతలు అప్పగించినా రోగుల నిష్పత్తి స్థాయిలో పడకలతోపాటు వైద్యులు కూడా లేరు. ఫ్లూ ల క్షణాలతో బాధపడుతున్న రోగులను సైతం జనరల్ వార్డులోని ఇతర రోగుల పక్కనే ఉంచుతున్నారు. రిపోర్టులో పాజిటీవ్‌గా నిర్ధారించాకే ఐసోలేషన్ వార్డుకు తరలిస్తున్నారు. అప్పటికే వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరిస్తోంది. ఇలా ఇప్పటికే 12 మంది హౌస్సర్జన్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు ఫ్లూబారిన పడ్డారు. ఐసోలేషన్ వార్డులో ఒక్క వెంటిలేటర్ కూడా లేకపోవడంతో స్వైన్‌ఫ్లూ రోగులను కూడా ఏఎంసీకి తరిలించాల్సి వస్తోందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు. అయితే అత్యవసర పరిస్థితుల్లో పిలిచినా వైద్యులెవరూ రావడం లేదని నర్సులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రిలో సబ్బులు, యాంటీసెప్టిక్ లోషన్లు కూడా లేకపోవడం గమనార్హం. ‘ఫీవర్’కు సాధారణ రోగుల క్యూ.. ఉస్మానియా, గాంధీ ఆస్పత్రుల కు నిత్యం స్వైన్‌ఫ్లూ రోగులు వస్తుండటంతో సాధారణ రోగులు ఆయా ఆస్పత్రులకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఆస్పత్రి వాతావరణంలో ఫ్లూ కారక వైరస్ ఎక్కువగా ఉండటంతో అది ఎక్కడ తమకు అంటుకుంటుందోనని అటు వైపు వెళ్లడానికే జంకుతున్నారు. దీంతో ఇటీవల ఆయా ఆస్పత్రుల ఓపీకి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా తగ్గింది. సాధారణ జ్వరంతో బాధపడుతున్న వారు రెండు రోజులుగా చికిత్స కోసం న ల్లకుంటలోని ఫీవర్ ఆస్పత్రికి క్యూ కడుతున్నారు. అందుబాటులో హోమియో మందులు.. స్వైన్‌ఫ్లూ నివారణకు హోమియో మందులు అందుబాటులో ఉన్నాయని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా వెల్లడించారు. రామంతాపూర్ హోమియో వైద్యశాల సహా ఆయుష్ డిస్పెన్సరీల్లో ఉచితంగా లభిస్తాయని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటి వరకు 1,472 మంది శాంపిల్స్ పరీక్షించగా.. 523 మందికి ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయిందన్నారు. అందులో 25 మంది చనిపోయారని వెల్లడించారు. గత ఐదు రోజుల్లో (29 తేదీ నాటికి) 205 పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. 2009తో పోలిస్తే స్వైన్‌ఫ్లూ వైరస్ చాలా బలహీన పడిందన్నారు. జిల్లా, ఏరియా, బోధనాసుపత్రుల్లో అవసరమైన మేర మందులు అందుబాటులో ఉన్నాయని సురేశ్‌చందా తెలిపారు. -
ఉడిపిలో స్వైన్ ఫ్లూతో ఏడుగురి మృతి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో స్వైన్ ఫ్లూ విజృంభిస్తోంది. ఇప్పటివరకు ఈ ఏడాది 40 కేసులు నమోదు కాగా, వారిలో ఏడుగురు మరణించారు. ఈ విషయాన్ని ఉడిపి జిల్లా వైద్యాధికారి తెలిపారు. ఒక్క ఉడిపి తాలూకాలోనే 22 కేసులు నమోదయ్యాయని, వారిలో నలుగురుమరణించారని జిల్లా వైద్య, కుటుంబ సంక్షేమాధికారి డాక్టర్ రామచంద్ర బైరి తెలిపారు. అలాగే కరకల లో మూడు కేసులు నమోదై ఒకరు మరణించారని, కుందాపూర్‌లో 15 కేసులు నమోదై ఇద్దరు మరణించారని చెప్పారు. హెచ్1ఎన్1 వైరస్‌తో పోరాడేందుకు జిల్లాలో తగినన్ని మందులు ఉన్నాయని, అలాగే ఎక్కడైనా ప్రైవేటు ఆస్పత్రులలో ఈ వైరస్ కనపడితే వెంటనే తమకు తెలియజేయాల్సిందిగా కోరామని అన్నారు. ఇప్పుడు వర్షాల కారణంగా మలేరియా కూడా ప్రబలుతోందని, అందువల్ల ప్రజలంతా పరిశుభ్రత పాటించాలని డాక్టర్ రామచంద్ర బైరి కోరారు. ఆస్పత్రులలో వెంటిలేటర్లు, ఇతర సదుపాయాలు తగినన్ని ఉండేలా చూసుకోవాలన్నారు.