ఎండలు ముదిరితే స్వైన్‌ఫ్లూ ప్రభావం తగ్గిపోతుందనే వైద్యుల అంచనాలను తలక్రిందులు చేస్తూ హెచ్1ఎన్1 వైరస్ మరింతగా విజృంభిస్తోంది.
హైదరాబాద్: ఎండలు ముదిరితే స్వైన్‌ఫ్లూ ప్రభావం తగ్గిపోతుందనే వైద్యుల అంచనాలను తలక్రిందులు చేస్తూ హెచ్1ఎన్1 వైరస్ మరింతగా విజృంభిస్తోంది. రెండు రోజుల్లో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఎనిమిదేళ్ల బాలుడితో పాటు ముగ్గురు బాధితులు స్వైన్‌ఫ్లూతో మృతిచెందారు. హైదరాబాద్ కార్వాన్‌కు చెందిన మహ్మద్ మెహమూద్(55) స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చేరి ఆదివారం రాత్రి మృతి చెందాడు. మెహదీపట్నానికి చెందిన కమలమ్మ(70) స్వైన్‌ఫ్లూతో ఈనెల 15న ప్రీమియర్ ఆస్పత్రి నుంచి రిఫరల్‌పై వచ్చి చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది.
నల్లగొండ జిల్లా చౌటుప్పల్‌కు చెందిన అల్తాఫ్(08), హైదరాబాద్ చింతల్‌కు చెందిన నాగలక్ష్మీ (50)లు గాంధీ ఆసుపత్రి ఐసోలేషన్ వార్డులో చికిత్స పొం దుతూ శనివారం రాత్రి మృతిచెందారు. సోమవారం అందిన నివేదికలో వీరికి స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి గాంధీ ఆస్పత్రిలో స్వైన్‌ఫ్లూ మృతుల సంఖ్య 63కు పెరిగింది. గాంధీ ఐసోలేషన్ వార్డులో 39 మంది, చిల్డ్రన్స్ వార్డులో 13 మంది స్వైన్‌ఫ్లూ బాధితులు, మరో 26 మంది అనుమానితులకు వైద్యసేవలు అందిస్తున్నామని గాంధీ నోడల్ అధికారి కె.నర్సింహులు తెలిపారు.