మహబూబ్‌నగర్ క్రైం: పాలమూరులో మూడేళ్ల తర్వాత మరో స్వైన్‌ఫ్లూ కేసు నమోదైంది. జిల్లాకేంద్రంలోని టీచర్స్‌కాలనీకి చెందిన నాలుగేళ్ల బాలికకు దగ్గు, జలుబు, జ్వరంతోపాటు ఇతర లక్షణాలు కనిపించడంతో హైదరాబాద్‌లో నాలుగు రోజులపాటు ఉండి చికిత్స చేయించారు. ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చారు. అయితే అప్పటికే ఇచ్చిన శాంపిల్ పరీక్ష చేయగా స్వైన్‌ఫ్లూ పాజిటివ్ వచ్చింది. జిల్లాలో చివరగా 2019 ఆగస్టులో స్వైన్‌ఫ్లూ కేసు నమోదవగా.. తాజాగా మరొకటి వెలుగులోకి రావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.
లక్షణాలు ఇలా..
ఇది హెచ్1 ఎన్1 రకం ఇన్‌ఫ్లూ ఎంజా వైరస్. ఇది సోకిన వారిలో ముందుగా దగ్గు, జలుబు, జ్వరం, గొంతునొప్పి, ముక్కు నుంచి అదేపనిగా నీరుకారడం, చిన్నపిల్లల్లో వాంతులు, విరేచనాలు అవుతాయి. అయితే ఇవి ఉన్నంత మాత్రాన స్వైన్‌ఫ్లూ అనడానికి వీల్లేదు. ఈ లక్షణాలు ఉంటే మందులు వాడిన 48 గంటల్లో తగ్గకపోతే వెంటనే దగ్గరలో ఉన్న వైద్యులను సంప్రదించాలి. గతంలో పందులు తిరుగుతున్న ఆవరణలో దగ్గరగా ఉన్న వారికి వచ్చేది. ప్రస్తుతం ఈ వైరస్ మనుషుల నుంచి మనుషులకు చాలా త్వరగా సోకుతుంది.
వైద్యుల పర్యవేక్షణలోనే..
స్వైన్‌ఫ్లూ టీకా, మందులు వైద్యుల పర్యవేక్షణలోనే తీసుకోవాలి. తప్పనిసరిగా ఐసోలేషన్‌లో ఉండాలి. ఇతర రోగులు ఆ వార్డులోకి రాకుండా చూడాలి. ఆక్సిజన్‌తోపాటు బీపీ సరైన మోతాదులో ఉండేలా మందులు వాడాల్సి ఉంటుంది.
వారికే ఎక్కువగా..
స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపిస్తే తప్పనిసరిగా ఇంట్లోనే ఉండాలి. బహిరంగ ప్రదేశాల్లో సంచరించరాదు. ఒకవేళ బయటకు వెళ్లాల్సి వస్తే మాస్క్ ధరించాలి. స్వైన్‌ఫ్లూ లక్షణాలు ఉన్న వ్యక్తి తుమ్మిన, దగ్గిన టేబుల్, ఇతర వస్తువుల మీద పడిన తుంపర్ల నుంచి ఇతరులకు సోకుతుంది. చేతులను తరుచుగా శుభ్రం చేసుకోవాలి. రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వాళ్లకు ఇది త్వరగా సోకే అవకాశం ఉంది. మధుమేహం, క్యాన్సర్ పీడితులు, వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, శ్వాస సంబంధిత జబ్బులు ఉన్నవారు, స్టెరాయిడ్స్ వాడే వాళ్లకు ఎక్కువగా ఈ ఫ్లూ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
స్వైన్‌ఫ్లూ కేసుల నమోదు ఇలా..
ఏడాది పాజిటివ్ కేసులు
2013 3
2014 5
2015 37
2016 3
2017 5
2018 4
2019 4
2022 1
జాగ్రత్తలు పాటించండి
జిల్లాకేంద్రంలో ఒకరికి స్వైన్‌ఫ్లూ రావడంతో కుటుంబ సభ్యులను ఐసోలేషన్‌లో ఉంచడంతోపాటు అవసరమైన మందులు ఇచ్చాం. ప్రతిఒక్కరూ జాగ్రత్తలు పాటించాలి. వైరస్ సోకిన వారు ఎక్కువ సమయం నిద్రించడంతోపాటు పౌష్టికాహారం తీసుకోవాలి.
– కృష్ణ, డీఎంహెచ్‌ఓ
Comments
Please login to add a commentAdd a comment