మళ్లీ ‘స్వైన్‌’ సైరన్‌ | swine flu Cases Filed In Hyderabad | Sakshi
Sakshi News home page

మళ్లీ ‘స్వైన్‌’ సైరన్‌

Published Thu, Sep 27 2018 9:35 AM | Last Updated on Tue, Oct 2 2018 2:05 PM

swine flu Cases Filed In Hyderabad - Sakshi

గ్రేటర్‌లో స్వైన్‌ఫ్లూ మళ్లీ విజృంభిస్తోంది. గత రెండు వారాల్లో 20 కేసులు నమోదు కావడమే ఇందుకు నిదర్శనం. గాంధీలో ఓ మహిళ స్వైన్‌ ఫ్లూ కారణంగా మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. మరో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. దీంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. తొమ్మిదేళ్ల క్రితం నగరంలో స్వైన్‌ కేసులు వెలుగు చూశాయి. అప్పటి నుంచి ప్రతి ఏటా స్వైన్‌ మరణాలు సంభవిస్తూనే ఉన్నాయి. మరోవైపు ప్రభుత్వం బాధితులకు ‘ఒసల్టా మీవీర్‌ టాబ్లెట్స్, సిరప్‌’లను ఉచితంగా సరఫరా చేస్తున్నా.. చికిత్సల పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నోడల్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడం వల్లే చాలా మంది కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. ఇక దోమల కారణంగా డెంగీ సైతం నగరవాసులను భయపెడుతోంది. వేలాది మంది డెంగీ జ్వరాలతో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.    

సాక్షి, సిటీబ్యూరో/గాంధీఆస్పత్రి: స్వైన్‌ఫ్లూ(హెచ్‌1ఎన్‌1 వైరస్‌) మళ్లీ విజృంభిస్తుండటంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం రెండు వారాల్లోనే 20 స్వైన్‌ఫ్లూ కేసులు నమోదు కాగా, తాజాగా మూసారంబాగ్‌కు చెందిన అజిజాభాను(52)గాంధీలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మరో ముగ్గురు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. తొమ్మిదేళ్ల క్రితం నగర వాతావరణంలోకి ప్రవేశించిన ఈ ఫ్లూ వైరస్‌ అనేక మంది ప్రాణాలను బలిగొంది. స్పందించిన ప్రభుత్వం అప్పట్లో వివిధ ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను సైతం ఏర్పాటు చేసి చికిత్స అందించింది. రెండేళ్లుగా ఈ ఫ్లూ ఆనవాళ్లు కనిపించకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. మళ్లీ స్వైన్‌ఫ్లూ పంజా విసరడంతో గ్రేటర్‌ వాసుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రభుత్వం బాధితులకు ‘ఒసల్టా మీవీర్‌ టాబ్లెట్స్, సిరప్‌’లను ఉచితంగా సరఫరా చేస్తున్నా.. చికిత్సల పేరుతో కార్పొరేట్‌ ఆస్పత్రులు సొమ్ము చేసుకుంటున్నాయి. ప్రభుత్వం గాంధీ, ఉస్మానియా, ఫీవర్‌ ఆస్పత్రుల్లో స్వైన్‌ఫ్లూ నోడల్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినా ఆశించిన స్థాయిలో సేవలు అందకపోవడం వల్లే చాలా మంది కార్పొరేట్‌ ఆస్పత్రులకు వెళ్లిపోతున్నారు. రోగుల నుంచి నమూనాలు సేకరించి, ఐపీఎంకు పంపడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో రిపోర్టు వచ్చేలోపే మృతిచెందుతుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

మృత్యు ఘంటికలు మోగిస్తున్న డెంగీ
మరోపక్క డెంగీ దోమలు సైతం మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. ఒక్క గాంధీ ఆస్పత్రిలోనే జనవరి నుంచి ఇప్పటి వరకు 2,287 మంది రోగుల నుంచి నమూనాలు సేకరించి నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 557 డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. హైదరాబాద్‌ జిల్లాలో ఇప్పటి 250పైగా డెంగీ పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, వీరిలో ఇప్పటికే ముగ్గురు మృతి చెందారు. ప్రస్తుతం మరో 12 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. జియాగూడకు చెందిన 15 ఏళ్ల బాలుడితో పాటు అజామాబాద్‌కు చెందిన 26 ఏళ్ల యువకుడు ఉస్మానియాలో చికిత్స పొందుతుండగా, మిగిలిన వారు గాంధీ, ఫీవర్‌ సహా ఇతర కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్సలు పొందుతున్నారు. 

బాధితుల నుంచి నిలువు దోపిడీ
నిజానికి శరీరంలో 1.5 లక్షల నుంచి 4 లక్షల వరకు ప్లేట్‌లెట్స్‌ ఉంటాయి. సాధారణ జ్వర పీడితుల్లోనూ ప్లేట్‌లెట్స్‌ కౌంట్స్‌ తగ్గుతుంది. కౌంట్స్‌ 20 వేలలోపు ఉంటే వారికి ప్లేట్‌లెట్స్‌ ఎక్కించాలి. కానీ లక్షలోపు ఉన్నవారిని కూడా కార్పొరేట్‌ ఆస్పత్రులు వదలడం లేదు. కానీ నగరంలోని పలు ఆస్పత్రులు సాధారణ జ్వరాలను కూడా డెంగీ జాబితాలో చేరుస్తున్నాయి. ప్లేట్‌లెట్స్‌ కౌంట్‌ తగ్గిందనే పేరుతో రోగులను నిలువునా దోచుకుంటున్నాయి. ఆస్పత్రిలో నిర్వహించిన పరీక్షలో బాధితుడికి డెంగీ పాజిటివ్‌గా నిర్ధారణ అయితే ఆ బాధితుడి పూర్తి వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు అందజేయడమే కాకుండా రెండో శాంపిల్‌ను ఐపీఎంకు పంపాలి. కానీ ప్రైవేటు ఆస్పత్రులు ఇవేమీ చేయడం లేదు. ‘ఐజీఎం ఎలిసా’ టెస్టును ప్రమాణికంగా ప్రభుత్వం నిర్ణయించగా, కార్పొరేట్‌ ఆస్పత్రులు మాత్రం ‘ఎన్‌ఎస్‌ 1’టెస్టును తీసుకుంటూ వైద్యసేవల పేరుతో నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి.

స్వైన్‌ఫ్లూ సోకకుండా ఉండాలంటే..
తుమ్మినప్పుడు, దగ్గినప్పుడు వైరస్‌ గాలిలోకి ప్రవేశిస్తుంది.
ఇలా ఒకసారి బయటికి వచ్చిన వైరస్‌ వాతావరణంలో 2గంటలకుపైగా జీవిస్తుంది.
గర్భిణులు, చిన్నపిల్లలు, వృద్ధులు, ఊబకాయులకు సులభంగా వ్యాపించే అవకాశం ఉంది.  
సాధారణ ఫ్లూ జ్వరాలు వచ్చే వ్యక్తిలో కన్పించే లక్షణాలన్నీ స్వైన్‌ఫ్లూ బాధితుల్లో కనిపిస్తాయి.
ముక్కు కారడం, దగ్గు, గొంతునొప్పి, తుమ్ములు, కళ్లవెంట నీరుకారడం, ఒళ్లు నొప్పులు ఉంటాయి.  
ముక్కుకు మాస్కు ధరించండంతో పాటు తరచూ చేతులు శుభ్రం చేసుకోవాలి.  
వీలైనంత ఎక్కువ సార్లు నీళ్లు తాగాలి. పౌష్టికాహారం తీసుకోవాలి.  
జన సమూహ ప్రాంతాలకు వెళ్లకపోవడమే ఉత్తమం. ప్రయాణాలు రద్దు చేసుకోవాలి.  
బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయరాదు.  
ఇతరులకు షేక్‌హ్యాండ్‌ఇవ్వడ ం, కౌగిలించుకోవడం చేయరాదు.  
చిన్న పిల్లలతో సహా ఎవరినీ ముద్దు పెట్టుకోవద్దు.– డాక్టర్‌ శ్రీహర్ష,జిల్లా సర్వేలెన్స్‌ ఆఫీసర్‌

దోమలు వ్యాప్తిచెందకుండా ఉండాలంటే..
ఇంటి పరిసరాల్లో మురుగు నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి.
నీటి ట్యాంకులు, కుండలు, క్యాన్లను వారానికోసారి శుభ్రం చేసుకోవాలి.  
పాత టైర్లు, కొబ్బరి బొండాలు, చెత్త కుండీలు అస్సలు ఉంచకూడదు.  
ఇంటి గదుల్లో గాలి వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
పిల్లలకు విధిగా పగటిపూట దోమ తెరలు వాడాలి.  
దోమలు ఇంటి లోపలికి రాకుండా కిటికీలకు జాలీలు ఏర్పాటు చేయాలి.  
ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌లపై మూతలు విధిగా ఉంచాలి.  
మూడు రోజులకు మించి నిల్వ ఉన్న నీరు తాగరాదు.  –డాక్టర్‌ నాగేందర్,సూపరింటెండెంట్, ఉస్మానియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement