మండు వేసవిలో స్వైన్‌ఫ్లూఘంటిక మోగింది. రానున్నది వర్షాకాలం కావడంతో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ అదుపులోకి రాకపోగా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి.
సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ప్రాణాంతక హెచ్1ఎన్1 చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గత 15 రోజుల్లో 20 మంది బలి అయ్యారు. ఇందులో ఉడుపి నుంచి అత్యధికంగా 8 మంది, శివమొగ్గ నుంచి ఆరుగురు మరణించారు. ఈమేరకు ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికల ద్వారా తెలుస్తోంది. కాలానికి అనుగుణంగా వచ్చే అంటువ్యాధి కావడంతో జాగ్రత్తలు వహించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉడుపి – 8, శివమొగ్గ – 6, దావణగెరె 2, బెంగళూరు నగరం, చిక్కమగళూరు, గదగ్, రామనగర జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గత 15 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా హెచ్1ఎన్1 బాధితుల సంఖ్య గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సజ్జన్ శెట్టి తెలిపారు.
జనవరి నుంచి 76 మంది బలి
ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 6,138 మందికి హెచ్1ఎన్1 వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 1,607 మందికి వైరస్ సోకినట్లు నిర్దారించారు. కాగా వారిలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈనెల 28వ తేదీన డెత్ ఆడిట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. సమావేశంలో భాగంగా వైద్యాధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు. అదేవిధంగా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. హెచ్1ఎన్1 బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 64,126 టామిఫ్లూ మందులు అందజేశారు. రోగులకు ప్రత్యేక చికిత్స ఇచ్చేందుకు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్‌తో కూడిన ఐదు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment