swine flue
-
స్వైన్‌ఫ్లూ..కరోనా..డెంగీ.. ఏదైనా ఒకే ఓపీ
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో అతిముఖ్యమైన గాంధీ ఆస్పత్రిలో నిర్లక్ష్యపు వైద్యసేవల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కరోనా, స్వైన్‌ఫ్లూ, డెంగీ వంటి ప్రాణాంతక వైరస్ సంబంధిత వ్యాధులు తీవ్రంగా ప్రబలి, ప్రజలు భయాందోళనకు గురవుతున్న నేపథ్యంలో వైద్యులు, అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలి. రోగులకు భరోసానిచ్చేలా సేవలందించాలి. కానీ గాంధీలో అడుగడుగునా నిర్లక్ష్యం తాండవిస్తోంది. ముఖ్యంగా వైరస్ వ్యాధుల విషయంలో అప్రమత్తం కావాల్సి ఉండగా..అలాంటి చర్యలేవీ ఇక్కడ కన్పించడం లేదు. కరోనా అనుమానితులు, స్వైన్ ఫ్లూ,డెంగీ వంటి వ్యాధులతో చికిత్స కోసం వచ్చిన వారందరినీ ఒకే చోట ఉంచుతున్నారు. ఒకే ఓపీ ఉండడంతో వీరంతా సాధారణ రోగుల మధ్యనే లైన్లో ఉంటూ ఓపీ చీటీలు రాయించుకుంటున్నారు. ముఖ్యంగా కరోనా, స్వైన్‌ఫ్లూ గాలి ద్వారా ఇతరులకు సోకే ప్రమాదం ఉంది. అలాంటప్పుడు ఈ విభాగాల ఓపీ సెపరేట్‌గా ఏర్పాటు చేయాలి. కానీ ఇక్కడ అలాంటి చర్యలు తీసుకోకపోవడంతో సాధారణ జ్వరం, జలుబు, తలనొప్పి వంటి చిన్నచిన్న సమస్యలతో వచ్చిన వారు ఆందోళనకు గురవుతున్నారు. ఫ్లూ వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని వారు భయపడుతున్నారు. సిబ్బంది కొరత గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు వస్తున్న రోగుల నిష్పత్తికి అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో మందులు, వైద్య పరికరాలు, నిపుణులు, స్టాఫ్ నర్సులు, ఇతర పారా మెడికల్ స్టాఫ్ లేకపోవడంతో వైద్య సేవలకు విఘాతం కలుగుతోంది. అంతే కాదు సాధారణ రోగుల మధ్యే ప్రమాదకరమైన ఫ్లూ, కరోనా అనుమానితులు తిరుగుతుండటం, వారిని గుర్తించేందుకు ఆస్పత్రుల్లో ప్రత్యేక వ్యవస్థ అంటూ ఏమీ లేకపోవడం, వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం ఉండటంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన వ్యక్త మవుతుంది . ప్రస్తుతం నగరంలో 15 రకాల వైరస్లు ఉన్నట్లు అంచనా. వీటికి తోడు తాజాగా కరోనా వైరస్ వచ్చి చేరుతుండటంతో గ్రేటర్ వాసుల్లో ఆందోళన మొదలైంది. ఈ బాధితులకు చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి సహా గాంధీ ఆస్పత్రులను ప్రత్యేక నోడల్ కేంద్రాలుగా ఎంపిక చేసింది. ఎర్రగడ్డ ఛాతి ఆస్పత్రి, సరోజినిదేవి కంటి ఆస్పత్రి, ఉస్మానియాలోనూ వార్డులు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ..అక్కడ సరైన మౌలిక సదుపాయాలు లేక పోవడంతో ఆయా బాధితులంతా చికిత్సల కోసం గాంధీ నోడల్ కేంద్రాన్నే ఆశ్రయిస్తున్నారు. వీరికి ఓపీలో ప్రత్యేక బ్లాక్ అంటూ ఏమీ లేదు . గాంధీ క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వసంత్‌కుమార్ ఇదే అంశంపై సదరు అధికారులను ప్రశ్నించడం, వారు ఆయనపై క్రమశిక్షణా చర్యలకు పూనుకోవడం, ఆ తర్వాత ఆయన ఇదే ప్రాంగణంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, ఆస్పత్రిలోని అక్రమాలు...అధికారుల అవినీతి...వంటి అంశాలపై తీవ్రమైన ఆరోపణలు చేయడం, ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకోవడం, విజిలెన్స్ విచారణకు ఆదేశించడం తెలిసిందే. ఓపీలో ఫ్లూ, ఇతర రోగుల కోసం ప్రత్యేక చర్యలు చేపట్టలేదు. ఏరియా ఆస్పత్రుల్లో అంతంతే... నగరంలోని బోధనాసుపత్రులపై ఒత్తిడి తగ్గించేందుకే కాదు కుక్కకాటు, డెంగీ, మలేరియా జ్వర పీడితులకు సత్వర వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం వనస్థలిపురం, మలక్‌పేట్, కొండాపూర్, గొల్కొండ, కింగ్‌కోఠి, నాంపల్లి, సూరజ్‌భాను ఏరియా ఆస్పత్రులను ఏర్పాటు చేసింది. అన్ని రకాల వైద్య పరికరాలను సమకూర్చింది. వైద్యసేవలపై సరైన నిఘా లేకపోవడంతో వైద్య సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం పది తర్వాత ఆస్పత్రికి చేరుకోవడం, మధ్యాహ్నం 12.30 తర్వాత మాయమవుతున్నారు. ఆ తర్వాత వచ్చే రోగులను పట్టించుకునే నాధుడే లేకపోవడంతో వారంతా అత్యవసర పరిస్థితుల్లో గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. అంతేకాదు నెలలు నిండిన గర్భిణులుకు సుఖ ప్రసవం కోసం ఆయా ఆస్పత్రుల్లో లేబర్రూమ్లతో పాటు పీడియాట్రిక్ వార్డులను కూడా ఏర్పాటు చేసినప్పటికీ..సాయంత్రం తర్వాత అక్కడ వైద్యులు అందుబాటులో ఉండక వారంతా సుల్తాన్ బజార్, పేట్లబురుజు, గాంధీ, నిలోఫర్ ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. పీహెచ్‌సీలు..బస్తీ దవాఖానాల్లోనూ.. గ్రేటర్‌లోని హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో వందకుపైగా పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉండగా, వీటిలో 24 గంటలు పని చేసే ఆస్పత్రులు తొమ్మిది ఉన్నాయి. చందులాల్ బారాదరి, ముషీరాబాద్, మహారాజ్‌గంజ్, ఆర్‌హెచ్ అండ్ఎఫ్డబ్ల్యూటీసీ, వినాయక్‌నగర్, గా>ంధీఆస్పత్రి, బొల్లారం పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో గత ఐదేళ్ల నుంచి డాక్టరే లేరు.ఇక చార్మినార్, ఈద్‌బజార్, పంజేషా–1,2, హరాజ్‌పెంట, అఫ్జల్‌గంజ్, పాన్‌బజార్, బైబిల్‌హౌస్, బోయిన్పల్లి, పికెట్, తిరుమలగిరి, చింతల్‌బస్తీ, తిలక్‌నగర్, బేగంబజార్, అఫ్జల్‌సాగర్, సయ్యద్‌నగర్, ఆఘంపురా, శాంతినగర్, కుమ్మరివాడి, గగన్‌మహల్, కార్వాన్–1 పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలకు కాంట్రాక్ట్ వైద్యులే దిక్కయ్యారు. నిజానికి ప్రతి పదివేల మందికి ఒక వైద్యుడు అవసరం కాగా, నగరంలో 30 వేల మందికి ఒక్కరే ఉన్నారు. ఒక్కో వైద్యుడు రోజుకు 25–30 మందికి మాత్రమే వైద్యసేవలు అందించగలరు. కానీ పీహెచ్‌సీల్లో ఒక్కో వైద్యుడు 200 మందిని చూడాల్సి వస్తుంది. వీటితో పాటు కొత్తగా వందకుపైగా బస్తీ దావాఖానాలను ఏర్పాటు చేసింది. వీటిని కూడా వైద్యుల కొరత తీవ్రంగా వేధిస్తుంది. ఆయా ఆస్పత్రుల్లో సరైన వైద్యసేవలు అందక పోవడంతో రోగులంతా గాంధీ, ఉస్మానియా, ఫీవర్ ఆస్పత్రులను ఆశ్రయిస్తుండటం, రోగుల నిష్పత్తికి తనగినన్ని వైద్య పరికరాలు, మందులు, వైద్య సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు తప్పడం లేదు. అంతేకాదు ఈ సాధారణ రోగుల మధ్య ప్రమాదకరమైన ఫ్లూ, కోరానా బాధితులు కూడా తిరుగుతుండటం ఆందోళన కలిగిస్తుంది. -
ఆస్పత్రులు హౌస్‌ఫుల్
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో డెంగీ, డిఫ్తీరియా, స్వైన్‌ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు డెంగీతో చనిపోగా, మరొకరు డిఫ్తీరియాతో మృతి చెందారు. తాజాగా శుక్రవారం కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన గర్భిణి డెంగీతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మృతి చెందడంపై ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు స్వైన్‌ఫ్లూ సైతం నగరవాసుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రమాదకరమైన డెంగీ, మలేరియా జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుకుంటున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల ఔట్ పేషెంట్ విభాగాలకు సుమారు 8 వేల మంది రోగులు వచ్చారు. వీరిలో కొత్తగా ఒక్కో ఆస్పత్రిలో 150 నుంచి 200 మంది ఇన్‌పేషంట్లుగా చేరారు. ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో పడకల నిష్పత్తి కంటే ఎక్కువ సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ, డిఫ్తీరియా బాధితులు పెరగడంతో ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిచింది. అదనంగా 21 కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు అదనపు పడకలను సమకూర్చినట్లు చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే జనరల్ మెడిసిన్ విభాగాలన్నీ డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోగా, కొత్తగా వచ్చే రోగులకు పడక దొరకని పరిస్థితి. నిలోఫర్ చిన్నప్లిలల ఆస్పత్రిలో ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తుండగా.. ఉస్మానియాలో పడకలు లేక నేలపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాంధీలో పడకల సంఖ్య కంటే రెట్టింపు రోగులు చికిత్స పొందుతుండడంతో కొత్తగా వచ్చిన వారికి ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ‘ప్రైవేటు’లో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతార్ సాధారణంగా మనిషి శరీరంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్లెట్స్ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ ప్లేట్ లెట్కౌంట్ పడిపోవడం సహజం. 25 వేల వరకు పడిపోయినా పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఈ కౌంట్ 20 వేల కంటే తగ్గిపోతే ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించాలి. కానీ చాలా ప్రైవేటు ఆస్పత్రులు రోగుల ఆందోళనను ఆసరాగా చేసుకుని అవసరం లేకపోయినా ఐసీయూ చికిత్సలు, ఉదయం, సాయంత్రం పరీక్షల పేరుతో భారీగా డబ్బు పిండుతున్నాయి. ఆస్పత్రి పరీక్షలో డెంగీ పాజిటివ్‌గా నిర్థారణ అయిన రోగి నుంచి రెండో శాంపిల్ సేకరించి నారాయణగూడలోని ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉంది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రులు మినహా నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా పంపడం లేదు. మళ్లీ విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ సాధారణంగా చలితీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్1ఎన్1 కారక స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తరిస్తుంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సీజన్‌తో సంబంధం లేకుండా నగరవాసులను ఇప్పుడు ‘ఫ్లూ’ వెంటాడూతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 409 పాజిటివ్ కేసులు నమోదవగా, వీరిలో 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం గాంధీలో ఒకరు చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వళ్లు నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటు డయేరియా...అటు టైఫాయిడ్.. నగరానికి కృష్ణ, గోదావరి ప్రాజెక్టుల నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ఇటీవల ఆయా ప్రాజెక్టులకు వరదలు పోటెత్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. సాధారణంగా ’సాల్మోనెల్లా టైఫి’ బ్యాక్టీరియా కలిసిన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్ సోకుతుంది. అధిక జర్వంతో మొదలై...అలసట, తలనొప్పి, కడుపునొప్పి, మలబద్ధకం, వికారం, ఛాతిపై గులాబీరంగు మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వీరికి సరైన వైద్యసేవలు అందక పోవడంతో వారంతా ఫీవర్ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మల, మూత్ర విసర్జన త ర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం, వేడివేడి ఆహారం తీసుకోవడం, కాచివడపోసిన నీటిని తాగడం ద్వారా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల భారీ నుంచి బయటపడొచ్చు అని డాక్టర్ రంగనాథ్ సూచించారు. డెంగీతో గర్భిణి మృతి కీసర: డెంగీతో గర్భిణి మృతి చెందింది. కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొల్కూరి స్వాతి(24) ఎనిమిది నెలల గర్భిణి. ఐదు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆమెను మేడ్చల్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె గురువారం తీవ్ర అస్వస్తతకు గురవడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్లేట్లెట్స్ 20 వేలకు పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయి శుక్రవారం తెల్లవారుజామున కడుపులో ఉన్న బిడ్డతో పాటు స్వాతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. -
స్వైన్‌ఫ్లూ విజృంభణ
మండు వేసవిలో స్వైన్‌ఫ్లూఘంటిక మోగింది. రానున్నది వర్షాకాలం కావడంతో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1) వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. స్వైన్‌ఫ్లూ అదుపులోకి రాకపోగా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. సాక్షి బెంగళూరు: కర్ణాటక రాష్ట్రంలో ప్రాణాంతక హెచ్1ఎన్1 చాపకింద నీరులా వ్యాపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా గత 15 రోజుల్లో 20 మంది బలి అయ్యారు. ఇందులో ఉడుపి నుంచి అత్యధికంగా 8 మంది, శివమొగ్గ నుంచి ఆరుగురు మరణించారు. ఈమేరకు ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదికల ద్వారా తెలుస్తోంది. కాలానికి అనుగుణంగా వచ్చే అంటువ్యాధి కావడంతో జాగ్రత్తలు వహించాలని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. ఉడుపి – 8, శివమొగ్గ – 6, దావణగెరె 2, బెంగళూరు నగరం, చిక్కమగళూరు, గదగ్, రామనగర జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున గత 15 రోజుల వ్యవధిలో ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రవ్యాప్తంగా హెచ్1ఎన్1 బాధితుల సంఖ్య గతేడాది కంటే ఈసారి ఎక్కువగా ఉందని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్ సజ్జన్ శెట్టి తెలిపారు. జనవరి నుంచి 76 మంది బలి ఈ ఏడాది ఆరంభం నుంచి ఇప్పటి వరకు సుమారు 6,138 మందికి హెచ్1ఎన్1 వైద్య పరీక్షలు నిర్వహించారు. అందులో 1,607 మందికి వైరస్ సోకినట్లు నిర్దారించారు. కాగా వారిలో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. మరణాల సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఈనెల 28వ తేదీన డెత్ ఆడిట్ కమిటీ సమావేశం నిర్వహిస్తారు. సమావేశంలో భాగంగా వైద్యాధికారులు సూచనలు, సలహాలు ఇస్తారు. అదేవిధంగా వ్యాధి నియంత్రణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తారు. హెచ్1ఎన్1 బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆస్పత్రుల్లో మందుల కొరత లేకుండా చూసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే 64,126 టామిఫ్లూ మందులు అందజేశారు. రోగులకు ప్రత్యేక చికిత్స ఇచ్చేందుకు ప్రతి ప్రభుత్వాస్పత్రిలో వెంటిలేటర్‌తో కూడిన ఐదు ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేశారు. -
స్వైన్ ఫ్లూతో ఎమ్మెల్యే మృతి
సాక్షి, జైపూర్ : రాజస్థాన్ భారతీయ జనతా పార్టీ(బీజేపీ)కి చెందిన ఎమ్మెల్యే కిర్తీ కుమారి సోమవారం స్వైన్ ఫ్లూ కారణంగా మృతి చెందారు. భిల్వారా జిల్లాలోని మందల్‌ఘర్ నియోజకవర్గానికి ఆమె ప్రాతినిధ్యం వహిస్తున్నారు. స్వైన్ ఫ్లూతో బాధపడుతున్న ఆమెను కుటుంబసభ్యులు ఆదివారం జైపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అర్థరాత్రి తర్వాత శ్వాస తీసుకోలేకపోతుండటంతో కిర్తీని వెంటీలేటర్‌పై ఉంచారు. కాగా, సోమవారం ఉదయం ఆమె తుది శ్వాస విడిచారు. ఎమ్మెల్యే కిర్తీ కుమారి అకస్మిక మరణంపై రాజస్థాన్ ముఖ్యమంత్రి వసుంధరా రాజే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2013లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె 83 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. -
మిడుతూరు మహిళకు స్వైన్‌ఫ్లూ
కర్నూలు(హాస్పిటల్): నందికొట్కూరు నియోజకవర్గంలోని మిడుతూరు గ్రామానికి చెందిన ఓ మహిళకు స్వైన్‌ఫ్లూ ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. వారం రోజుల క్రితం ఈమెను కుటుంబ సభ్యులు ఊపిరితిత్తుల పనితీరులో సమస్య రావడంతో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తీసుకొచ్చారు. వైద్యులు ఆమెను పరిశీలించి టీబీసీడీ వార్డులో చేర్పించారు. స్వైన్‌ఫ్లూగా అనుమానించి నిర్ధారణ కోసం వైద్యపరీక్షలు చేయించారు. ఆమెకు స్వైన్‌ఫ్లూ వ్యాధి ఉన్నట్లు సోమవారం ఆసుపత్రి అధికారులకు నివేదిక అందింది. దీంతో ఆమెను పేయింగ్‌బ్లాక్‌లోని ఐసోలేషన్ వార్డులో ఉంచి చికిత్స చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటికే డోన్‌లో ఓ మహిళ స్వైన్‌ఫ్లూ సోకి మరణించింది. ఈమెతో పాటు కర్నూలు నగరంలోని ప్రకాష్‌నగర్, నందికొట్కూరు మండలం ప్రాతకోట గ్రామానికి చెందిన వ్యక్తులకు ఈ వ్యాధి సోకిన విషయం విదితమే.