స్వాతి(ఫైల్) ,నిలోఫర్, గాంధీలో ఒక బెడ్డుపై ముగ్గురు రోగులు
సాక్షి,సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో డెంగీ, డిఫ్తీరియా, స్వైన్‌ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులు మృత్యు ఘంటికలు మోగిస్తున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఐదుగురు చిన్నారులు డెంగీతో చనిపోగా, మరొకరు డిఫ్తీరియాతో మృతి చెందారు. తాజాగా శుక్రవారం కీసర మండలం అంకిరెడ్డిపల్లికి చెందిన గర్భిణి డెంగీతో సికింద్రాబాద్ యశోద ఆస్పత్రిలో మృతి చెందడంపై ఆందోళన కలిగిస్తోంది. మరో వైపు స్వైన్‌ఫ్లూ సైతం నగరవాసుల కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. ప్రమాదకరమైన డెంగీ, మలేరియా జ్వరాలతో బాధపడుతూ ఆస్పత్రులకు చేరుకుంటున్న రోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. శుక్రవారం ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల ఔట్ పేషెంట్ విభాగాలకు సుమారు 8 వేల మంది రోగులు వచ్చారు.
వీరిలో కొత్తగా ఒక్కో ఆస్పత్రిలో 150 నుంచి 200 మంది ఇన్‌పేషంట్లుగా చేరారు. ఇప్పటికే ఆయా ఆస్పత్రుల్లో పడకల నిష్పత్తి కంటే ఎక్కువ సంఖ్యలో రోగులు చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు డెంగీ, మలేరియా, స్వైన్‌ఫ్లూ, డిఫ్తీరియా బాధితులు పెరగడంతో ఆస్పత్రుల్లో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటిచింది. అదనంగా 21 కౌంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు అదనపు పడకలను సమకూర్చినట్లు చెబుతున్న క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. ఇప్పటికే జనరల్ మెడిసిన్ విభాగాలన్నీ డెంగీ, మలేరియా, వైరల్ ఫీవర్ బాధితులతో కిక్కిరిసిపోగా, కొత్తగా వచ్చే రోగులకు పడక దొరకని పరిస్థితి. నిలోఫర్ చిన్నప్లిలల ఆస్పత్రిలో ఒక్కో మంచంపై ఇద్దరు ముగ్గురు చిన్నారులకు చికిత్స అందిస్తుండగా.. ఉస్మానియాలో పడకలు లేక నేలపై పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. గాంధీలో పడకల సంఖ్య కంటే రెట్టింపు రోగులు చికిత్స పొందుతుండడంతో కొత్తగా వచ్చిన వారికి ఎక్కడ సర్దుబాటు చేయాలో తెలియక అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
‘ప్రైవేటు’లో ప్రభుత్వ ఆదేశాలు బేఖాతార్
సాధారణంగా మనిషి శరీరంలో 1.50 లక్షల నుంచి 4.50 లక్షల వరకు ప్లేట్‌లెట్స్ ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు ఈ ప్లేట్ లెట్‌కౌంట్ పడిపోవడం సహజం. 25 వేల వరకు పడిపోయినా పెద్ద ప్రమాదం ఏమీ ఉండదు. ఈ కౌంట్ 20 వేల కంటే తగ్గిపోతే ప్లేట్‌లెట్స్‌ను ఎక్కించాలి. కానీ చాలా ప్రైవేటు ఆస్పత్రులు రోగుల ఆందోళనను ఆసరాగా చేసుకుని అవసరం లేకపోయినా ఐసీయూ చికిత్సలు, ఉదయం, సాయంత్రం పరీక్షల పేరుతో భారీగా డబ్బు పిండుతున్నాయి. ఆస్పత్రి పరీక్షలో డెంగీ పాజిటివ్‌గా నిర్థారణ అయిన రోగి నుంచి రెండో శాంపిల్ సేకరించి నారాయణగూడలోని ఐపీఎంకు పంపాలనే నిబంధన ఉంది. ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ ఆస్పత్రులు మినహా నగరంలోని ఏ ఒక్క కార్పొరేట్ ఆస్పత్రి కూడా పంపడం లేదు.
మళ్లీ విజృంభిస్తున్న స్వైన్‌ఫ్లూ
సాధారణంగా చలితీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు హెచ్1ఎన్1 కారక స్వైన్‌ఫ్లూ వైరస్ విస్తరిస్తుంది. వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల సీజన్‌తో సంబంధం లేకుండా నగరవాసులను ఇప్పుడు ‘ఫ్లూ’ వెంటాడూతోంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 409 పాజిటివ్ కేసులు నమోదవగా, వీరిలో 15 మంది మృతి చెందారు. ప్రస్తుతం గాంధీలో ఒకరు చికిత్స పొందుతున్నారు. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, వళ్లు నొప్పులతో ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతుంది.
ఇటు డయేరియా...అటు టైఫాయిడ్..
నగరానికి కృష్ణ, గోదావరి ప్రాజెక్టుల నుంచి తాగునీరు సరఫరా అవుతోంది. ఇటీవల ఆయా ప్రాజెక్టులకు వరదలు పోటెత్తాయి. కలుషితమైన ఈ నీటిని తాగడం వల్ల అనేక మంది వాంతులు, విరేచనాలు, టైఫాయిడ్ జ్వరాల బారిన పడుతున్నారు. సాధారణంగా ’సాల్మోనెల్లా టైఫి’ బ్యాక్టీరియా కలిసిన నీటిని తాగడం వల్ల టైఫాయిడ్ సోకుతుంది. అధిక జర్వంతో మొదలై...అలసట, తలనొప్పి, కడుపునొప్పి, మలబద్ధకం, వికారం, ఛాతిపై గులాబీరంగు మచ్చలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో వీరికి సరైన వైద్యసేవలు అందక పోవడంతో వారంతా ఫీవర్ ఆస్పత్రికి పరుగులు తీస్తున్నారు. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, మల, మూత్ర విసర్జన త ర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం, వేడివేడి ఆహారం తీసుకోవడం, కాచివడపోసిన నీటిని తాగడం ద్వారా డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధుల భారీ నుంచి బయటపడొచ్చు అని డాక్టర్ రంగనాథ్ సూచించారు.
డెంగీతో గర్భిణి మృతి
కీసర: డెంగీతో గర్భిణి మృతి చెందింది. కీసర మండలం అంకిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొల్కూరి స్వాతి(24) ఎనిమిది నెలల గర్భిణి. ఐదు రోజుల క్రితం జ్వరం రావడంతో ఆమెను మేడ్చల్‌లోని మెడిసిటీ ఆస్పత్రికి చేర్పించారు. చికిత్స పొందుతున్న ఆమె గురువారం తీవ్ర అస్వస్తతకు గురవడంతో అక్కడి నుంచి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించారు. ప్లేట్‌లెట్స్ 20 వేలకు పడిపోవడంతో కోమాలోకి వెళ్లిపోయి శుక్రవారం తెల్లవారుజామున కడుపులో ఉన్న బిడ్డతో పాటు స్వాతి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment