‘స్వైన్ ఫ్లూ’ నివారణకు వాడే మందులు.. కిట్
‘స్వైన్ ఫ్లూ’ చాప కింద నీరులా ప్రవేశిస్తోంది. ప్రస్తుతం ఈ వ్యాధి కర్నూలు, చిత్తూరు జిల్లాలను వణికిస్తోంది. ఇప్పడు మన జిల్లాలో పాగా వేయడానికి సిద్ధమవుతోంది. 2017లో 50 కేసులు నమోదు కాగా పలువురు మృత్యువాత పడ్డారు. తాజాగా మొత్తం 10 కేసులు నమోదైతే ఒక్క నవంబర్ నెలలోనే 6 నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
కడప రూరల్: జిల్లాలో స్వైన్ ఫ్లూ సంచారం మొదలైంది. మొన్నటి వరకు 3 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఇప్పుడు ఆ సంఖ్య 10కి చేరింది. ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల నేపథ్యంలో కేసుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.
కేసుల వివరాలు..కారణాలు...
ఈ ఏడాది ప్రారంభంలో గడిచిన జూలైలో జమ్మలమడుగు పట్టణానికి చెందిన 35 సంవత్సరాల మహిళ ఈ వ్యాధికి గురైంది. హైదరాబాద్‌లో చికిత్స పొందుతూ మరణించింది. అధికారికంగా నమోదైన మృతి చేందిన కేసు ఇదే. తరువాత అక్టోబర్‌లో రైల్వేకోడూరు మండలానికి చెందిన ఒకరికి, ప్రొద్దుటూరులోని శ్రీనివాస నగర్‌కు చెందిన మరొకరికి ఈ వ్యాధి సోకింది. నవంబర్ నెలలో ఒకరికి చొప్పున రాయచోటి మండలం శిబ్యాల గ్రామం, రైల్వేకోడూరులోని శెట్టిగుంట, వీరబల్లె మండలం మట్లి గ్రామం, రాజంపేట పరిధిలోని ఆకేపాడు, జమ్మలమడుగు పట్టణంతో పాటు చిట్వేల్‌కు చెందిన ఒకరికి ఈ వ్యాధి సోకింది. వారంతా తిరుపతి, కర్నూలు ప్రాంతాల్లో చికిత్స పొందారు. ఆరోగ్యంగా ఉన్నారు. వీరిలో చాలామంది హైదరాబాద్, బెంగళూరు, తిరుపతి ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చారు. ఈ వ్యాధికి గురైన వారంతా 35 సంవత్సరాల పైబడినవారే. అలాగే అనధికారికంగా మృతి చెందిన వారు. ముగ్గురు ఉన్నారు. వారు ఇతర జబ్బుల కారణంగా మృతి చెందినట్లుగా వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
చలితో పాటు పెరుగుతున్న కేసులు..
సాధారణంగా ఈ వ్యాధి వేడి వాతావరణం కలిగిన ప్రాంతాల్లో పెద్దగా కనిపించదు. జిల్లాలో అత్యంత గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. ప్రస్తుత తరుణంలో వాతావరణ పరిస్ధితులు మారాయి. దీనికి తోడు కర్నూలు. చిత్తూరు జిల్లాల్లో ఈ వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. ఆ ప్రభావం మన జిల్లాపై పడింది. ఈ వ్యాధి శరవేగంగా విస్తరించడానికి చలి కూడా ఒక కారణమనే చెప్పవచ్చు. ఆ మేరకు జిల్లాలో గడిచిన 1వ తేదీన గరిష్టం 38, కనిష్టం 22 డిగ్రీలు నమోదయ్యాయి. 23న గరిష్టం 27, కనిష్టం 20 డీగ్రీలు నమోదయ్యాయి. దీంతో గాలిలో తేమ శాతం తగ్గుతోంది. ఇప్పుడిప్పుడు మంచు కురవడం ప్రారంభమైంది. ఇలాంటి వాతావరణంలో ఈ వ్యాధి సంచరించడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. అంటే ఉష్ణోగ్రతలు తగ్గు ముఖం పట్టేకొద్దీ కేసుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
ఉచితంగా పరీక్షలు.. మందులు..
ఈ వ్యాధిని కనుగొనడానికి నిర్వహించే పరీక్షలు, నివారణకు వాడే మందులు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో మాత్రమే ఉచితంగా లభిస్తున్నాయి. ఆ మేరకు వైద్యులకు అనుమానం వస్తే ఆర్టీపీసీఆర్ ( రియల్ టైం పాలిమరేజ్ చైన్ రియాక్షన్) పరీక్షలను కడప రిమ్స్, ప్రొద్దుటూరు జిల్లా హాస్పిటళ్లల్లో నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధికి కడప రిమ్స్‌లో 20 పడకలు, ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రిలో 10 పడకల ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేశారు. వ్యాధి సోకిన వారికి నివారణకు గాను పెద్దలకు ‘టామీ ఫ్లూ’ 75 ఎంజీ మాత్రలు, చిన్న పిల్లలకు ‘టామీ ఫ్లూ’ టానిక్‌ను ఇస్తారు. అలాగే పీపీఈ (పర్సనల్ ప్రొటెక్ష న్ ఎక్విప్‌మెంట్) కిట్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
గతంలో ఈ వ్యాధికి తిరుపతిలోని స్విమ్స్ హాస్పిటల్‌లో వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేపట్టేవారు. ఇప్పుడు వీటిని జిల్లాలోనే నిర్వహిస్తున్నారు ఏ రోగికైనా ఈ వ్యాధి లక్షణాలు కనిపించినా..అనుమానం కలిగినా ఆ వ్యక్తి గొంతు, ముక్కు నుంచి తీసిన గల్ల లాంటి పదార్ధాన్ని పరీక్షా కేంద్రానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చిన రిపోర్ట్ ఆధారంగా వైద్యులు వ్యాధి ఉండేది, లేనిది నిర్ధారిస్తారు. అనంతరం చికిత్సను ప్రారంభిస్తారు. ఆ రోగికి దగ్గరగా ఉన్న వ్యక్తులకు కూడా మందులను పంపీణీ చేస్తారు. అంటే ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకున్న వారికే సౌకర్యం ఉంటుంది.
హెచ్ 1, ఎన్ 1 వైరస్ కారణంగా..
ఈ వ్యాధికి దోమలతో ఎలాంటి సంబంధంలేదు. గాలి ద్వారా ఒకరి నుంచి మరొýకరికి సోకుతుంది. అంటే అంటు వ్యాధి లాంటిది. ఇది హెచ్ 1, ఎన్ 1 వైరస్. గాలి ద్వారా ప్రయాణించి వ్యాప్తి చెందుతుంది. గతంలో ఈ వ్యాధికి సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు సీజన్‌గా ఉండేది. ఇప్పుడా పరిస్థితిలేదు. ఏడాది పొడుగునా సీజన్‌గా మారింది.
వ్యాధిలక్షణాలు...
జలుబు, దగ్గు ఉంటుంది. ఒళ్లు నొప్పులు ఉంటాయి. ఊపిరి తిత్తుల్లో నెమ్ము చేరుతుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి.
వీరికి సోకే అవకాశంఎక్కువ...
65 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 5 సంవత్సరాల లోపు చిన్నారులు, గర్భిణులు, ఘగర్, బీపీ, గుండె, కిడ్నీ తదితర దీర్ఘకాలిక వ్యాధలు కలిగిన వారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంటుంది.
తీసుకోవాల్సినజాగ్రత్తలు
తుమ్మినా, దగ్గినా ముఖానికి చేతి రుమాలును అడ్డం పెట్టుకోవాలి. వ్యక్తి గత పరిశుభ్రతను పాటించాలి. ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తితే వైద్యులను సంప్రదించాలి.
Comments
Please login to add a commentAdd a comment