కర్నూలు హాస్పిటల్: జిల్లాలో మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం రేగింది. ఎనిమిది నెలల గర్భిణి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందింది. జిల్లాలో స్వైన్‌ఫ్లూ బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఇద్దరికి చేరింది. గత నెలలో గోనెగండ్లకు చెందిన గర్భిణి మృతి చెందింది. ఆదోనికి చెందిన మహిళ, కర్నూలు నగరానికి చెందిన మరో వైద్యురాలు కోలుకుంటున్నట్లు వైద్యులు చెబుతున్నారు. హాలహర్వి మండలం శ్రీరంగాపురం గ్రామానికి చెందిన చంద్రశేఖర్ గౌడ్ భార్య పల్లవి(20) ఎనిమిది నెలల గర్భిణీ. వైరల్ ఫీవర, శ్వాస సంబంధమైన లక్షణాలతో బాధపడుతున్న ఆమెను ఈనెల 3వ తేదీ కుటుంబ సభ్యులు కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్యాజువాలిటీలో ఆమె పరిస్థితిని గమనించిన వైద్యులు స్వైన్‌ఫ్లూ లక్షణాలు కనిపించడంతో ఆసుపత్రిలోనే ఏర్పాటు చేసిన స్వైన్‌ఫ్లూ ప్రత్యేక వార్డుకు తరలించారు. అక్కడే ఆమెకు చికిత్స అందిస్తున్నారు. 4వ తేదీ స్యాప్ పరీక్షలు నిర్వహించి శాంపిల్స్‌ను అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రికి పంపించారు. శుక్రవారం ఉదయం ఆమె పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారడం, శ్వాస సంబంధమైన సమస్యలు ఎక్కువ కావడంతో కోలుకోలేక 9.45 గంటలకు మృతి చెందింది.
ఆక్సిజన్ అందించడం జాప్యంతోనే మృతి
సరైన సమయంలో ఆక్సిజన్ అందించడంలో జాప్యంతో తన భార్య పల్లవి మృతిచెందినట్లు భర్త చంద్రశేఖర్ గౌడ్, కుటుంబ సభ్యులు వైద్యులతో వాగ్వాదానికి దిగారు. తన భార్య ఇబ్బందులు పడుతున్న ఇక్కడి సిబ్బంది పట్టించుకోలేదన్నారు. ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చనిపోయిందని ఆరోపించారు. ఆరు గంటల పాటు వచ్చే సిలిండర్ 15 నిమిషాల వ్యవధిలోనే ఖాళీ అయిందన్నారు. లీక్ ఉన్నందువల్లే త్వరగా ఆక్సిజన్ అయిపోయిందన్నారు. ఇదే విషయాన్ని చెబితే సిబ్బంది ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. అందువల్లే చనిపోయిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తొమ్మిది సిలిండర్ల ఆక్సిజన్ అందించాం: ప్రభుత్వ ఆసుపత్రిస ఈఎస్‌ఆర్‌ఎంఓ డాక్టర్ వై.శ్రీనివాసులు
పల్లవి మృతిలో మా నిర్లక్ష్యం ఎంత మాత్రం లేదు. ఆమెను ఆసుపత్రిలో చేర్చినప్పటి నుంచి ప్రత్యేక స్వైన్‌ఫ్లూ వార్డులో చికిత్స అందిస్తున్నాం. వైరల్ ఫీవర్, శ్వాస సంబంధమైన సమస్య, నిమోనియాతో తీవ్ర ఇబ్బంది పడుతోంది. స్వైన్‌ఫ్లూగా నిర్ధారణ కావడంతో వెంటి లేటర్ ద్వారా పేషెంట్‌కు ఆక్సిజన్ అందించాం. ఇప్పటి వరకు 9 సిలిండర్ల ద్వారా ఆక్సిజన్ అందించినా కోలుకోలేక మృతి చెందింది. ఆక్సిజన్ అందక చనిపోయిందనడంలో ఎటువంటి వాస్తవం లేదు.
మళ్లీ స్వైన్‌ఫ్లూ కలకలం
Published Sat, Mar 7 2015 2:26 AM | Last Updated on Sat, Sep 2 2017 10:24 PM
Advertisement
Advertisement