
గైనిక్ వార్డు బయట ఉన్న గర్భిణి, కుటుంబ సభ్యులు
కర్నూలు(హాస్పిటల్): గర్భిణికి రక్తం తక్కువ గా ఉందని వైద్యులు బయటకు పంపించారని కుటుంబ సభ్యులు ఆరోపించడంతో మంగళవారం పెద్దాసుపత్రిలో వివాదం నెలకొంది. శిరువెళ్ల మండలం ఎర్రగుంట్ల గ్రామానికి చెందిన మధు భార్య రామలక్ష్మి(24) ప్రసవం కోసం సోమవారం మధ్యాహ్నం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు వచ్చింది. కాన్పుల విభాగంలో ఆమెను వైద్యులు చేర్చుకుని చికిత్స ప్రారంభించారు. రక్తం హెచ్‌బీ 4 గ్రాములు మాత్రమే ఉందని, నాలుగు యూనిట్లు తెచ్చుకోవాలని ఆమెకు వైద్యులు సూచించారు. రక్తం తెచ్చుకోవడానికి ఎవ్వరూ లేరని ఆమె చెప్పగా దానికి తామేమి చేయాలని ప్రశ్నించి.. రక్తం తెచ్చుకున్న తర్వా త వచ్చి కలవండంటూ చెప్పి వెళ్లిపోయారు.
ఆ తర్వాత మంగళవారం ఉదయం గర్భిణి కుటుంబసభ్యులు మీడియాతో మాట్లాడుతూ రక్తం తక్కువగా ఉండటంతో వైద్యులు బయటకు వెళ్లాలని చెప్పారని, ఈ కారణంగా రాత్రంతా బయటే ఉన్నామని చెప్పారు. ఈ విషయమై గైనకాలజి విభాగం హెచ్‌ఓడీ డాక్టర్ బి. ఇందిర మాట్లాడుతూ తాము గర్భిణి రామలక్ష్మిని బయటకు పంపించలేదని, రక్తం తెచ్చుకుని కలవాలని చెప్పామని అన్నారు. వారు వైద్యుల అనుమతి తీసుకోకుండా రా త్రంతా బయట ఉంటే దానికి తామెలా బాధ్యులమవుతామని ప్రశ్నించారు. 4 ఎంజీ రక్తంతో వస్తే చికిత్స ఎలా చేయాలని, అంత తక్కువ రక్తం ఉండేంత వరకు ఉండి, చివరి దశలో ఇక్కడికి వచ్చి గొడవ చేస్తే ఎలాగని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment