పెద్దాసుపత్రిలోని ఏఎంసీ విభాగం
కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో మృత్యుఘోష విన్పిస్తోంది. రోజూ సగటున ఏడుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి ఇక్కడికొస్తే చివరకు మృతదేహాలను తీసుకెళ్లాల్సి వస్తోందని మృతుల బంధువులు వాపోతున్నారు. ముఖ్యంగా అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) విభాగంలో గత ఏడాది చేరిన 3,746 మందిలో ఏకంగా 2,498 మంది చికిత్స పొందుతూ మరణించారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. వైద్యుల కొరత, ఉన్న వారిలోనూ నిర్లక్ష్యం, మందులు, పడకల కొరత తదితర కారణాలతో రోగులకు నూకలుచెల్లిపోతున్నాయి.
కర్నూలు(హాస్పిటల్): సర్వజన వైద్యశాలలోని జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్, గైనకాలజీ, ఈఎన్‌టీతో పాటు న్యూరాలజీ, నెఫ్రాలజీ, యురాలజీ, గ్యాస్ట్రో ఎంట్రాలజీ తదితర సూపర్ స్పెషాలిటీ విభాగాలకు సైతం ప్రత్యేక ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు (ఐసీయూలు) లేవు. రోగులకు ఏదైనా అత్యవసర పరిస్థితి ఏర్పడితే చికిత్స అందించేందుకు గాను ఆసుపత్రి అధికారులే 20 ఏళ్ల క్రితం అప్పటి జిల్లా కలెక్టర్ సాయిప్రసాద్ సహకారంతో 20 పడకలతో అక్యూట్ మెడికల్ కేర్(ఏఎంసీ) విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆసుపత్రిలోని జనరల్ మెడిసిన్, జనరల్‌సర్జరీ, అనెస్తీషియా ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, పీజీలు, హౌస్‌సర్జన్లు ఇక్కడ వంతుల వారీగా డ్యూటీలు వేసుకునివిధులు నిర్వర్తిస్తున్నారు. అంతేగానీ ప్రత్యేకంగా ఈ విభాగానికి ప్రభుత్వం నుంచి అనుమతులు లేవు. దీంతో వైద్యులు, పారామెడికల్, నర్సింగ్ సిబ్బంది, నాల్గవ తరగతి ఉద్యోగుల పోస్టులను మంజూరు చేయలేదు. వైద్యులు, నర్సులను ఆసుపత్రిలో రెగ్యులర్‌గా పనిచేస్తున్న వారినే వంతుల వారీగా, పారామెడికల్ సిబ్బంది, ఏఎన్‌ఎంలను కాంట్రాక్టు ప్రాతిపదికన నియమించి ఇక్కడ వైద్యసేవలు అందిస్తున్నారు. రోగుల రద్దీ దృష్ట్యా నాలుగేళ్ల క్రితం ఈ విభాగంలో పడకల సంఖ్యను 32కు పెంచారు. అయినప్పటికీ చాలడం లేదు. క్యాజువాలిటీలో అత్యవసర చికిత్సకు వచ్చే వారిని ఏఎంసీకి మార్చాలంటే పడకలు లభించడం లేదు. ఏఎంసీలో ఎవరికైనా ఆరోగ్యం కాస్త కుదుటపడితే గానీ అక్కడికి పంపలేని పరిస్థితి. లేదా ఎవరైనా మరణిస్తే గానీ పడకలు ఖాళీ కావడం లేదు. అప్పటి వరకు వార్డుల్లోనో, క్యాజువాలిటీలోనో రోగులు చికిత్స తీసుకోవాల్సి వస్తోంది.
ఏడాదిలో 2,498 మరణాలు
ఏఎంసీ విభాగంలో ఇటీవల మరణాల శాతం బాగా పెరిగింది. గత ఏడాది(2018) 3,746 మంది చేరగా.. అందులో 2,498 మంది మరణించారు. నెలకు సగటున 200 మంది, రోజుకు ఏడుగురు చనిపోతున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా అత్యవసర చికిత్స కోసం అత్యధిక శాతం మంది ఇక్కడికే రావడం, చివరిక్షణాల్లో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రులు తమ వల్ల కాదని చేతులెత్తేసి పెద్దాసుపత్రికి పంపించడం, ఏఎంసీలో వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది కొరతతో పాటు మందులు, పడకల కొరత వల్ల రోగులకు సకాలంలో సరైన వైద్యం అందడం లేదు. ఈ కారణంగానే మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
మధ్యాహ్నం దాటితే అరణ్యరోదనే
ఏఎంసీ విభాగంలో ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఆయా విభాగాల ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు వచ్చి ఒకసారి రోగులను చూసి జూనియర్ డాక్టర్లకు దిశా నిర్దేశం చేస్తుంటారు. మధ్యాహ్నం నుంచి జూనియర్ వైద్యులే ఇక్కడ దిక్కు. మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకు పెద్ద డాక్టర్లు ఇటువైపు రావడం లేదు. ఫలితంగా సకాలంలో సరైన వైద్యం అందక ఎందరో తనువు చాలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక్కడ పనిచేసే నర్సింగ్, పారామెడికల్ సిబ్బందిలో కూడా కొందరు రోగుల పట్ల తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. రోగులకు క్యాథ్ ఊడిపోయినా, ఫ్లూయిడ్ అయిపోయినా తిరిగి పెట్టేందుకు త్వరగా రావడం లేదన్న విమర్శలున్నాయి.
ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నాం
రోగుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న ఏఎంసీ సరిపోవడం లేదు. ఈ కారణంగా పాత గైనిక్ భవనంలో ప్రత్యేకంగా 100 పడకలతో ఏఎంసీ విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నాం. విభాగం ఏర్పాటు తర్వాత అవసరమైన వైద్యులు, సిబ్బంది కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తాం. దీనికితోడు ప్రైవేటు ఆసుపత్రుల నుంచి, జిల్లాలో ఇతర ప్రాంతాల నుంచి సీరియస్‌గా ఉన్న రోగులను ఇక్కడికి పంపుతున్నారు. ఈ కారణంగానే మరణాల శాతం పెరుగుతోంది. కొత్త విభాగం వస్తే సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. –డాక్టర్ పి. చంద్రశేఖర్,ఆసుపత్రి సూపరింటెండెంట్
Comments
Please login to add a commentAdd a comment