పెద్దాసుపత్రిలో ఆపరేషన్ థియేటర్‌ను ప్రారంభిస్తున్న కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవకుమార్, చిత్రంలో ఎమ్మెల్యేలు హఫీజ్‌ఖాన్, కాటసాని రాంభూపాల్‌రెడ్డి, డాక్టర్ సుధాకర్, కలెక్టర్ సత్యనారాయణ తదితరులు
కర్నూలు(హాస్పిటల్): ప్రభుత్వ సర్వజన వైద్యశాల (పెద్దాసుపత్రి)ను హైదరాబాద్‌లోని నిమ్స్‌లా తీర్చిదిద్దుతామని కర్నూలు పార్లమెంట్ సభ్యుడు డాక్టర్ సంజీవకుమార్, ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, హఫీజ్‌ఖాన్, డాక్టర్ సుధాకర్ అన్నారు. ఆసుపత్రి ఆర్థోపెడిక్ విభాగంలో రూ.35 లక్షలు, న్యూరోసర్జరీ విభాగంలో రూ.50 లక్షలు, యురాలజీ విభాగంలో రూ.35 లక్షలతో మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లుగా ఆధునికీకరించారు. వీటిని మంగళవారం ఎంపీ, ఎమ్మెల్యేలతో పాటు జిల్లా కలెక్టర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ సంజీవకుమార్ మాట్లాడుతూ సర్జన్లకు ఆపరేషన్ థియేటర్ పూజగది లాంటిదన్నారు. మాడ్యులర్ ఓటీగా మార్చడం వల్ల ఇంకా ఉత్సాహంగా పని చేస్తారన్నారు. తనకు ఓనమాలు నేర్పిన కర్నూలు మెడికల్ కాలేజీలోనే ఆపరేషన్ థియేటర్లను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. ఆసుపత్రిలో ఏవైనా సమస్యలుంటే తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఎంసీఐ నిబంధనల ప్రకారం కళాశాలలో సెంట్రల్ లైబ్రరీ, క్లినికల్ లెక్చరర్ గ్యాలరీ, స్టాఫ్ క్వార్టర్స్ కావాల్సి ఉందని, వీటిని తెచ్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. క్యాజువాలిటీ, ట్రామాకేర్‌లలో సౌకర్యాలు పెరగాల్సి ఉందన్నారు. పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులు సైతం బలోపేతం కావాలన్న ఉద్దేశంతో ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీని తీసుకొచ్చామన్నారు. ఈ ఆసుపత్రికి అధిక శాతం పేదలు వస్తారని, వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని వైద్యులకు సూచించారు. సెక్యూరిటీ సిబ్బందికి సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని తరచూ ధర్నాలు చేస్తున్నారని, ఇలాంటి ఏజెన్సీలపై చర్యలు తీసుకునేలా నివేదికలు సిద్ధం చేసిస్తే ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. ఆసుపత్రిలో జరిగే అభివృద్ధి పనుల్లో నాణ్యత తప్పకుండా ఉండాలన్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వైద్య,ఆరోగ్య రంగంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారన్నారు. ఈ శాఖను ఆయనే పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆరోగ్యశ్రీ, 108, 104లకు పూర్వవైభవం తెచ్చేలా చర్యలు ఉంటాయన్నారు.
అవినీతి రహిత పాలన దిశగా సీఎం కృషి చేస్తున్నారని, ఇందుకు అధికారులు, ఉద్యోగులు సహకరించాలని కోరారు. పెద్దాసుపత్రి అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె. సుధాకర్ మాట్లాడుతూ తనలాంటి సామాన్యునికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ప్రజలకు సేవ చేసే భాగ్యం కల్పించారన్నారు. ఆయన ఆశయం మేరకు ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందేలా కృషి చేస్తానన్నారు. ఏఎంసీలో ఐసీయూ మరింత అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ మాట్లాడుతూ అవసరమైన వైద్యపరికరాలు, వసతులుంటే ఇలాంటి ఆసుపత్రిలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించవచ్చని, ఈ మేరకు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. అనంతరం 300లకు పైగా గుండెశస్త్రచికిత్సలు నిర్వహించిన సీటీ సర్జన్ డాక్టర్ ప్రభాకర్‌రెడ్డిని సన్మానించారు. కార్యక్రమంలో కర్నూలు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ జీఎస్ రామప్రసాద్, ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ పి.చంద్రశేఖర్, డీఎంహెచ్‌వో డాక్టర్ జేవీవీఆర్‌కె ప్రసాద్, డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ భగవాన్, అనెస్తీషియా హెచ్‌వోడీ డాక్టర్ కైలాష్‌నాథ్‌రెడ్డి, న్యూరోసర్జరీ హెచ్‌వోడీ డాక్టర్ రామాంజులు, ఆర్థోపెడిక్ హెచ్‌వోడీ డాక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment