సైదన్న ఉర్సు ప్రారంభం | which stands as a symbol of harmony | Sakshi
Sakshi News home page

సైదన్న ఉర్సు ప్రారంభం

Published Fri, Jan 24 2014 3:30 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

which stands as a symbol of harmony

జాన్‌పహాడ్ (నేరేడుచర్ల), న్యూస్‌లైన్ :మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్‌పహాడ్ దర్గా ఉర్సు గురువారం గుసుల్ షరీఫ్ కార్యక్రమంతో ప్రారంభమైంది. మూడు రోజులు జరిగే ఈ ఉర్సులో మొదటి రోజు దర్గా పూజారి(ముజావర్) ఆధ్వర్యంలో సైదులుబాబా సమాధులకు పవిత్రస్నానం పూర్తి చేసి నూతన వస్త్రాలు(దట్టీలు) అలంకరించారు. పూలచద్దర్ కప్పి పవిత్ర గంధాన్ని సమాధులపై ఎక్కించారు. సమాధుల చుట్టూ కొవ్వొత్తులతో దీపాలు వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించి, బాబాకు నైవేద్యం సమర్పించారు. ఈ సందర్భంగా ఫకీరులు ఖవ్వాలీ నిర్వహించారు.
 
 అనంతరం పూజా సామగ్రిని దర్గా నుంచి పూజారి(ముజావర్) ఇంటివరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. దూర ప్రాంతాల నుంచి భక్తులు ట్రాక్టర్లు, బస్సులు, లారీలు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై జాన్‌పహాడ్ దర్గాకు చేరుకుంటున్నారు. వక్ఫ్‌బోర్డు అధికారులు భక్తులకు కల్పించే సౌకర్యాలను పర్యవేక్షిస్తున్నారు. ఉర్సు రెండో రోజైన శుక్రవారం వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో హైదరాబాద్ నుంచి పవిత్ర గంధాన్ని తీసుకువచ్చి ఉదయం 9.30గంటలకు సందల్‌ఖానా నుంచి జాన్‌పహాడ్ పురవీధుల్లో ఊరేగించి నమాజ్ సమయానికి దర్గాకు తీసుకువస్తారు. మూడో రోజు దీపారాదన (చిరాగ్) ఫాతెహా ఇవ్వడంతో జాన్‌పహాడ్ ఉర్సు ఉత్సవాలు ముగుస్తాయి.
 
 ఉర్సుకు హాజరుకానున్న మంత్రి ఉత్తమ్
 ఉర్సులో భాగంగా రెండో రోజు శుక్రవారం గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి హాజరవుతారని దర్గా సూపరింటెండెంట్ మజారుద్దీన్, కాంట్రాక్టర్ ఎన్‌వీ సుబ్బారావు తెలిపారు. ఉర్సు సందర్భంగా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు హుజూర్‌నగర్ సీఐ పి. బలవంతయ్య తెలిపారు. భక్తులకు సేవలందించడానికి రెవెన్యూ, ఎక్సైజ్, ఆరోగ్య, అగ్నిమాపక, ఆర్టీసీశాఖల ఆధ్వర్యంలో ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేశారు. ట్రాఫిక్ నియంత్రణకు, పార్కింగ్ కోసం దామరచర్ల, నేరేడుచర్లరోడ్లలో పెట్రోలు బంక్‌ల పక్కన పార్కింగ్ స్థలాన్ని కేటాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement