వక్ఫ్.. భూములు ఉఫ్!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: జిల్లాలోని వక్ఫ్ భూములలో 80 శాతం మేర అన్యాక్రాంతమయ్యాయి. ఈ విషయం శుక్రవారం వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిరక్షణపై జరిగిన సమీక్ష సమావేశంలో అధికారులే నిర్ధారించడం గమనార్హం. పర్యవేక్షణ లేకపోవడమే కారణమని తేల్చారు. పరిరక్షణకు చట్టంలో భారీ మార్పులు చేయాలని నిర్ణయించారు. కాగా ఈ సమావేశంలో బోలెడు విషయాలు వెలుగు చూశాయి.
జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శరత్ అధ్యక్షతన కలెక్టరేట్లో వక్ఫ్ బోర్డు ఆస్తుల పరిపరక్షణపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి,ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే లు చింత ప్రభాకర్, కిష్టారెడ్డి,సోలిపేట రామలింగారెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి, చిలుముల మధన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. వివరాలలోకి వెళితే..
సంగారెడ్డి నియోజకవర్గంలో పది వేల ఎకరాలు, కోహీర్ మండలంలో 4,200, జహీరాబాద్‌లో 2,275, రాయికోడ్‌లో 1,127, చేగుంటలో 2,113, శివ్వంపేటలో 1,788 ఎకరాలు....’ ఇలా చెప్పుకుంటూ పోతే మెతుకుసీమలో 35 వేల ఎకరాల వక్ఫ్ భూములున్నాయి. ఇన్ని వేల భూములను కాపాడటానికి జిల్లాలో వక్ఫ్‌బోర్డుకు ఎంత మంది అధికారులు ఉన్నారో తెలుసా? కేవలం ఒకే ఒక్కడు. ఇంకో ముఖ్య విషయం ఏమిటంటే వక్ఫ్ బోర్డు ఆస్తులకు జిల్లాలో అజమాయిషీ అధికారి డీఆర్వోనట. వక్ఫ్ బోర్డు సీఈవో హమీద్ చెప్పే వరకు డీఆర్వోకు ఆ విషయమే తెలియదట. 35 వేల ఎకరాల భూమి, కాంప్లెక్స్‌లకు ఏటా వస్తున్న ఆదాయం కేవలం రూ. 2.50 లక్షలు మాత్రమే. వ్యవసాయం చేసుకునేందుకు ఎకరాకు లీజు కేవలం ఒక రూపాయి చెల్లిస్తే చాలట.
ఎమ్మార్వోల సహకారంతోనే..
జిల్లాలో విలువైన వక్ఫ్ భూములపై సరైన అజమాయిషీ లేక 80 శాతం భూములు ఆక్రమణకు గురైనట్లు సమీక్షా సమావేశం నిర్ధారించింది. వాటిని తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ వక్ఫ్యాక్ట్లో మార్పులు చేసి పకడ్బందీగా తెలంగాణ వక్ఫ్ యాక్ట్‌ను రూపొందిస్తామని మంత్రి హరీష్‌రావు తెలిపారు.
వక్ఫ్ ఆస్తుల ద్వారా సమకూరే ఆదాయాన్ని ముస్లింల సంక్షేమానికి వినియోగించాలని మంత్రి హరీష్‌రావు చేసిన ప్రతిపాదన పట్ల వక్ప్ బోర్డు సీఈవో హమీద్ అంగీకరించారు. వక్ఫ్ ఆస్తులను కాపాడటంలో రెవెన్యూ అధికారులకు కట్టబెట్టాలని సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. భూములను కొలవడానికి అవసరమైన సర్వేయర్లను రెవెన్యూ అధికారులు నియమించుకుంటే వక్ఫ్‌బోర్డు వారికి జీతాలు చెల్లిస్తుందని బోర్డు సీఈవో తెలిపారు.
కరెంటు కోతలు వద్దు
రంజాన్ మాసంలో కరెంట్ కోతలు లేకుండా చూడాలని మంత్రి హరీష్‌రావు అధికారులకు సూచించారు. ముస్లిం సోదరులు తెల్లవారుజామున మూడు గంటలకు నిద్రలేచి వంటలు చేసుకుంటారని, ఈ సమయంలోనూ, అలాగే నమాజు చేసుకునే సమయాల్లో కోతలు విధించవద్దన్నారు.
రంజాన్ పండుగను ప్రభుత్వం రాష్ట్ర పండుగగా గుర్తించిందని, జిల్లా కలెక్టరేట్లో ప్రభుత్వ తరుఫున ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో 921 మసీదులు ఉన్నాయని, వాటికి చినచిన్న మరమ్మతుల కోసం రూ.5 వేల చొప్పున నిధులు మంజూరు చేశామన్నారు, ఆ నిధులను వెంటనే మసీదు కమిటీలకు అందజేయాలని ఆయన తహశీల్దార్లను ఆదేశించారు. సంగారెడ్డి మండలం చింతపల్లి మసీదు మీదుగా హైటెన్షన్ విద్యుతు వైర్లు ఉన్నాయని, ఈ వైర్లను వెంటనే తొలగించాలని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కోరగా.. ఆ వైర్లను వెంటనే తొలగించాలని మంత్రి విద్యుత్తు శాఖ ఎస్ఈని ఆదేశించారు.
మక్తావలీలతోనే మోసం...
మసీదుల భూములకు రక్షకులుగా ఉన్న మక్తావలీలతోనే మోసం వస్తుందని కొంత మంది మసీదు, దర్గా కమిటీల సభ్యులు మంత్రికి ఫిర్యాదు చేశారు. వంశపారంపర్యంగా వక్ఫ్ ఆస్తుల సంరక్షకులుగా వస్తున్న మక్తావలీలు తమ సొంత ఆస్తులుగా బావించి అమ్ముకుంటున్నారని వివరించారు. ఎక్కువ శాతం భూములు అలా అమ్మటంతోనే అన్యాక్రాంతమయ్యాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని సమస్యలకు త్వరలోనే పరిష్కారం దొరుకుతుందని మంత్రి హరీష్‌రావు హామీ ఇచ్చారు.
నూతన భవనం ప్రారంభం
అనంతరం డీఆర్డీఏ ప్రాంగణంలో నూతనంగా నిర్మించి మహిళా సమాఖ్య భవనాన్ని హరీష్‌రావు స్థానిక ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌తో కలిసి ప్రారంభించారు. అనంతరం ఐకేపీ మహిళలతో ఆయన సమావేశమయ్యారు. ఎలాంటి ఫిర్యాదులు రాకుండా ఐకేపీ మహిళలు రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తున్న తీరు అభినందనీయమన్నారు. జిల్లాలో 100 ఐకేపీ కేంద్రాలున్నాయని, త్వరలోనే ప్రతి ఐకేపీ కేంద్రంలో ధాన్యం నిలువ చేసుకునేందుకు రూ. 30 నుంచి 40 లక్షలు ఖర్చు చేసి గోదాంతో పాటు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కారిడార్‌ను నిర్మిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
నూతన భవనంలో టాయ్లెట్లు, విద్యుత్తు, ఇతర అవసరాల కోసం రూ 25 లక్షలు మంత్రి మంజారు చేశారు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు మంత్రి హరీష్‌రావు చెక్కుల రూపంలో ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.