వేములవాడ అర్బన్ : పేదల దేవుడిగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం తెలంగాణలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. నిత్యం వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి తరలివస్తున్నారు. సోమ, శనివారాల్లో భక్తుల సంఖ్య ఒక్కోసారి లక్షల్లోనే ఉంటోంది. ఈ నేపథ్యంలో దేవస్థానానికి పటిష్ట భద్రత కల్పించే దిశలో అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆలయ పరిసరాల్లో మంగళవారం 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు పనులు చేపట్టారు.
వరల్డ్ సోర్స్ అసోసియేషన్ అనే ప్రైవేట్ సంస్థ ఆధ్వర్యంలో పనులు చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే ఆలయ లోపలిభాగంలో 16 సీసీ కెమెరాలు పనిచేస్తుండగా... మరింత భద్రత కోసం ఆలయం వెలుపల ప్రధాన ప్రదేశాలను ఎంపిక చేసుకుని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. రెప్పవాల్చినా దొరికిపోయేలా వీటిని నెలకొల్పారు. గుడి ప్రధాన ఆహ్వాన ద్వారం, దానిముందే ఉన్న పోలీస్ కంట్రోల్ గదిపై, విచారణ కార్యాలయం, బద్దిపోచమ్మ ఆలయ సెంటర్, భీమేశ్వరాలయ సెంటర్, పార్వతీపురం, పార్కింగ్ స్థలం, రాజేశ్వరపురం, అంబేద్కర్‌చౌరస్తా, గుడి పడమర దిశలోని మహాద్వారం తదితర ప్రధాన ద్వారాల వద్ద మొత్తం 55 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వీటన్నింటినీ ఆలయంలోని ఎస్‌పీఎఫ్, స్థానిక పోలీస్‌స్టేషన్లలో ఉంటే కంట్రోల్ రూమ్‌లకు అనుసంధానం చేయనున్నారు.
గుర్తించడం సులువు
హుండీ సొమ్ముకు కన్నం వేసిన ఘటనలు సీసీ కెమెరాల ద్వారా గతంలో బయటపడిన ఉదంతాలున్నాయి. ఇంటి దొంగలను ఈశ్వరుడైనా పట్టలేడన్నట్లుగా ఏకంగా స్వామి వారి ముందున్న హుండీలను చాకచక్యంగా తొలగించి అందులోని డబ్బులు కాజేశారు. ఇలా రాజన్న ప్రధాన ఆలయంలో ఎస్‌పీఎఫ్ సిబ్బంది, నాంపల్లి నర్సింహాస్వామి ఆలయంలో హోంగార్డులు దోచుకున్నారు.
భక్తులు హుండీల్లో వేసిన కట్నాలూ, కానుకలతో నిండుగా కనిపిస్తున్న వైనాన్ని చూసిన వీరు హుండీలను తస్కరించేశారు. ఇవన్నీ సీసీ కెమెరాల్లో రికార్డవడంతో నిందితులను గుర్తించడం సులువైంది. ఈ నేపథ్యంలో భద్రత రీత్యా సీసీ కెమెరాల ఏర్పాటు మరింత అనివార్యమైంది. ఇప్పటికే స్మార్ట్ పోలీస్ వ్యవస్థలో భాగంగా వేములవాడ పట్టణంలో నిఘా నిమిత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా ఇప్పుడు ఆలయ పరిసరాల్లోనూ భద్రత పెంచారు.
ఆన్‌లైన్ లింకింగ్
నాంపల్లి నర్సింహాస్వామి దేవస్థానం, రాజన్న ఆలయం, అనుబంధ దేవాలయాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల దృశ్యాలను అధికారులు చూసుకునేందుకు వీలుగా ఆన్‌లైన్ సిస్టమ్ తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు.
ఇప్పటికే నాంపల్లి నర్సింహా స్వామి దేవస్థానంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆన్‌లైన్‌కు అనుసంధానం చేశారు. దీంతో సంబంధితశాఖ అధికారులు ఎప్పుడుపడితే అప్పుడే సీసీ కెమెరా దృశ్యాలను చూసుకునే వీలున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఇదే విధంగా రాజన్న ఆలయం, అనుబంధ దేవాలయాలను సైతం ఆన్‌లైన్‌లోకి లింకప్ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. భక్తుల రక్షణకు, ఆలయ భద్రతకు నిఘా పెంచడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
‘రాజన్న’ మూడోకన్ను
Published Wed, Dec 3 2014 3:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM
Advertisement
Advertisement