చదువుల తల్లికి వందనం
వర్గల్: రెండో శనివారం పాఠశాలలకు సెలవు.అదే రోజు చదువుల తల్లి విద్యా సరస్వతి అమ్మవారి జన్మ నక్షత్రం..విశేషమైన ‘మూలా’ నక్షత్రం రోజు అమ్మ సన్నిధిలో పారాయణాది ప్రత్యేక పూజలు జరుగుతాయి. అదే రోజు చిన్నారులకు అక్షర అభ్యాసం జరిపించడం శుభ ప్రదమని తల్లిదండ్రులు విశ్వాసం. విశేషమైన ఈ ‘మూలా’ నక్షత్రం సెలవు రోజు కలిసి రావడంతో శనివారం రెండో బాసరగా పేరొందిన వర్గల్ విద్యాధరి క్షేత్రం భక్తులతో పోటెత్తింది. ఆలయ వ్యవస్థాపకులు యాయవరం చంద్రశేఖర సిద్ధాంతి నేతృత్వంలో ఉదయం 6కు గణపతి పూజతో ‘మూలా’ మహోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి.
ఆలయ వేద పండితులు అనంతగిరి శర్మ, బాలాంజనేయ శర్మల పర్యవేక్షణలో బ్రాహ్మణోత్తములు విద్యా సరస్వతి అమ్మవారికి విశేష పంచామృతాభిషేకం నిర్వహించారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు ధరింపజేసి, పూల మాలలతో అందంగా అలంకరించారు. అనంతరం సప్తశతి పారాయణంతో అర్చించారు. ఆలయ యాగశాలలో చండీ హోమం చేశారు. వర్షాలు సమృద్ధిగా కురిసి దేశం సుభిక్షంగా వర్థిల్లాలని ప్రార్థిస్తూ వేద పాఠశాల విద్యార్థులతో లలితా సహస్ర పారాయణం చేశారు. ఈ మహోత్సవం సందర్భంగా అమ్మవారి వైభవం తిలకించి తరించేందుకు, తమ చిన్నారులతో అక్షరార్చన జరిపించేందుకు హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి, మెదక్ జిల్లాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని తరించారు.
కిటకిటలాడిన మండపం
మూలా నక్షత్రం రోజున వర్గల్ అమ్మవారి సన్నిధిలో 500 మంది చిన్నారులకు అక్షర అభ్యాసాలు జరిగాయి. తరలి వచ్చిన చిన్నారులు, తల్లిదండ్రులతో ఆలయ సారస్వత మండపం కిటకిటలాడింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అక్షరాభ్యాసాలు కొనసాగాయి. భక్తులు అసౌకర్యానికి గురి కాకుండా ఆలయ మేనేజర్ రఘుపవన్, ఆలయ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. ప్రతి భక్తునికి భోజన మహా ప్రసాదం అందించారు.