బూచి ఉంది.. బడికి పంపం
►దెయ్యం ఉందంటూ బడికి రాని విద్యార్థులు
►15 రోజులుగా విద్యార్థుల డుమ్మా
►కౌన్సెలింగ్ చేపట్టేందుకు ఎంఈఓ విఫలయత్నం
చందంపేట: దెయ్యం ఉందంటూ పక్షం రోజులుగా ఆ పాఠశాల మూతపడింది. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గట్టుకింది తండాలో చోటుచేసుకున్న ఈ ఉదంతం గురువారం వెలుగులోకి వచ్చింది. ఈ పాఠశాలలో 22 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుడు లేకపోవడంతో ఒక్క విద్యా వలంటీర్‌తోనే పాఠశాల నిర్వహిస్తున్నారు. కొన్నిరోజుల క్రితం గ్రామానికి చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతుండడంతో ఆమెకు దెయ్యం పట్టిందని భావించిన వారి బంధువులు పలుచోట్ల తిప్పారు. ఎంతకూ తగ్గకపోవడం, మరొకరికి కూడా అనారోగ్యం రావడంతో సమాధులున్న చోట నిర్మించిన బడి వైపు వెళ్లడం వల్లే వారికి దెయ్యం పట్టిందని భావించారు.
తమ పిల్లలకు కూడా ఎక్కడ దెయ్యం పడుతుందోనని భావించి విద్యార్థుల తల్లిదండ్రులు బడికి పంపడం మానేశారు. 22 మంది విద్యార్థులున్న ఆ పాఠశాలలో 15 రోజులుగా ఏ ఒక్కరు బడి మొహం చూడడం లేదు. ఈ విషయం చందంపేట ఎం ఈఓ సామ్యనాయక్‌కు తెలియడంతో ఆయన ఈనెల 4న పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో పాఠశాలలో ఒక్క విద్యార్థి లేడు. విద్యావలంటీర్ మాత్రమే ఉన్నారు. ఎంఈవో వెంటనే విద్యార్థుల తల్లిదండ్రుల వద్దకు వెళ్లి ఆరా తీశారు. పిల్లలను పంపించకపోవడానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించడంతో వారు ఇదే విషయాన్ని ఏకరువు పెట్టుకున్నారు. మూఢవిశ్వాసాలపై ఆయన వారికి కౌన్సెలింగ్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ‘మా పిల్లలకు ఏమైనా జరిగితే మీరు బాధ్యత వహిస్తారా? అని తల్లిదండ్రులు ప్రశ్నించడంతో ఆయన ఈ విషయాన్ని తహసీల్దార్ ప్రవీణ్‌నాయక్ దృష్టికి తీసుకెళ్లారు.
దెయ్యం భయంతో విద్యార్థులు బడికి రావడం లేదు
పాఠశాలలో దెయ్యం ఉందనే ప్రచారంతో పాఠశాలకు విద్యార్థులు రావడం లేదు. విద్యార్థులను బడికి పంపించేందుకు తల్లిదండ్రులు వెనుకాడుతున్నారు. తల్లిదండ్రులకు సర్దిచెప్పినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
- జర్పుల తులసి, మధ్యాహ్న భోజనం నిర్వాహకురాలు