బూచి లేదు.. బడికి రండి
► విద్యార్థుల తల్లిదండ్రులకు అధికారుల కౌన్సెలింగ్
► తొలిరోజు పాఠశాలకు 11 మంది విద్యార్థుల హాజరు
చందంపేట: అధికారుల కౌన్సెలింగ్‌తో బూచి భయం వదిలింది. నిన్నటి వరకు బడి ముఖం చూడని విద్యార్థులు శుక్రవారం పాఠశాల బాట పట్టారు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం గట్టుకిందితండా ప్రాథమిక పాఠశాలలో దెయ్యం భయంతో పక్షం రోజులుగా పాఠశాల మూతబడడంతో ‘బూచి ఉంది బడికి పంపం’ అనే శీర్షికన శుక్రవారం సాక్షి దినపత్రికలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు.
చందంపేట ఎంఈవో సామ్యనాయక్, డిప్యూటీ తహసీల్దార్ ఏలేశం పాఠశాలను సందర్శించారు. అనంతరం విద్యార్థుల తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మూఢ నమ్మకాలతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలిగించవద్దని సూచించారు. మొదటి రోజు 11 మంది విద్యార్థులను బడిబాట పట్టించారు. విద్యార్థులందరినీ బడికి రప్పించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు సాక్షికి తెలిపారు.