పీరియడ్స్ సమయంలో నొప్పి...ఏం చేయాలి?
నా వయసు 15 ఏళ్లు. ఏడాది క్రితం పుష్పవతిని అయినప్పటి నుంచి పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి వస్తోంది. ఈ నొప్పి తగ్గడానికి ఏం చేయాలి? భవిష్యత్తులో దీనివల్ల ఏమైనా ప్రమాదమా? దయచేసి వివరించగలరు. నాకు చాలా భయంగా ఉంది.
- పారిజాత, విజయవాడ
చాలామంది యువతుల్లో రుతుక్రమం మొదలయ్యాక పీరియడ్స్ సమయంలో పొత్తికడుపులో నొప్పి రావడం అన్నది చాలా సాధారణమైన విషయం. చాలా మంది దీని గురించి ఆందోళన పడతారు. అయితే ఇది చాలా సహజమైన విషయం. ఇలా నొప్పి రావడం చాలా మందిలో కనిపించేదే. పీరియడ్స్ రావడానికి 14 రోజుల ముందు అండం విడుదలై ఉంటుంది. అంటే పీరియడ్స్‌కు 14 రోజుల ముందుది ఓవ్యులేషన్ పీరియడ్ అన్నమాట.
అది ఫలదీకరణ జరగకపోవడం వల్ల క్షీణించిన అండం రాలిపోవడం పీరియడ్స్ సమయంలో జరుగుతుంది. చాలామందికి ఈ టైమ్‌లో నొప్పి వస్తుంది. ఈ సమయంలో నొప్పి ఉండటం ఎంత ఆరోగ్యకరమైన లక్షణం అంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి లేని యువతుల్లో కంటే... పీరియడ్స్ సమయంలో నొప్పి ఉన్న యువతులకే పెళ్లి తర్వాత గర్భధారణకు అవకాశాలు చాలా ఎక్కువ. పీరియడ్స్ మొదలైన తొలి 24 గంటల్లో నొప్పి ఎక్కువగా ఉండి ఆ తర్వాత క్రమంగా తగ్గుతుంది.
ఈ నొప్పి మరీ భరించలేనంతగా ఉంటే తీవ్రతను బట్టి ప్రతి ఎనిమిది గంటలకు లేదా ప్రతి 12 గంటలకు ఒకటి చొప్పున రెండు మూడు నొప్పి నివారణ మాత్రలు వాడితే సరిపోతుంది. అయితే ఈ నొప్పి 3, 4 రోజుల పాటు తగ్గకుండా వస్తున్నా లేదా పెయిన్ కిల్లర్స్ వాడాక కూడా నొప్పి ఏమాత్రం తగ్గకున్నా లేదా... పీరియడ్స్‌కూ, పీరియడ్స్‌కూ మధ్యన నొప్పి వస్తున్నా... కొంచెం ఆలోచించవలసిన విషయమే. కాబట్టి అలా ఉంటే మాత్రం డాక్టర్‌ను సంప్రదించండి.
డాక్టర్ సుశీల వావిలాల,
ఫీటల్ మెడిసిన్ స్పెషలిస్ట్,
ఫెర్నాండజ్ హాస్పిటల్, హైదరాబాద్