ఆగస్టు మొదటి వారం తల్లిపాల వారోత్సవాలు
రక్తదానం గురించి విన్నారు. అవయవదానాల గురించి చదివారు. ఇప్పుడు ఎన్నో పసిప్రాణాలను నిలిపే ‘తల్లిపాలు’పంచడం గురించీ తెలుసుకోండి. ఇలా అమ్మపాలు నేలపాలు కాకుండా చూసి, పసికడుపులు నింపి ప్రాణాలు నిలబెట్టే ‘తల్లిపాల బ్యాంకు’ గురించి చదవండి. మీరూ పాలు ఊరే తల్లి అయితే... ముద్దుగారే ఎందరో చిన్నారులకు వీలైతే చేతనైనంత చేయండి. ఈ ఆగష్టు మొదటివారం తల్లిపాల వారోత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని ఫెర్నాండజ్ హాస్పిటల్‌లో నెలకొని ఉన్న ఒకే ఒక ‘తల్లి పాల బ్యాంకు’ గురించి తెలుసుకొండి. ఇలాంటి బ్యాంకులు ఇంకెన్నో ఉంటే మరెన్నో ప్రాణాలు కాపాడగలమని గుర్తించండి. ఇలాంటి అనేక పాలబ్యాంకుల స్థాపనకూ, ఆ తర్వాత పాల ప్రదానానికి మీ వంతు సహకారాన్ని అందజేసేలా అవగాహన కల్పించడం కోసమే ఈ ప్రత్యేక కథనం.
ఈ ఫొటోలో ఉన్న మాతృమూర్తి పేరు ఎల్. థాపా. ఆమెకు వంశ్‌రాజ్ అనే చిన్నారి పుట్టాడు. కానీ ఆ బాబుకు పట్టడానికి థాపా దగ్గర పాలు లేవు. ఫార్ములా పాలు పట్టిస్తే బాబుకు ఎన్నో దుష్పరిణామాలు. కడుపులో ఇబ్బందులు. పొట్టలో ఇక్కట్లు. బాబుకు కావాల్సింది మందులే అయితే మార్కెట్లో కొనగలరు. సెలైనే అయితే సెకన్లలో సమకూర్చగలరు. కానీ బాబు బతికి బట్టకట్టాలంటే కావాల్సింది... పాలు... అదీ తల్లిపాలు. అందుకే షిల్లాంగ్ నుంచి తల్లిపాల కోసం ఆ అమ్మ తన బాబును కడుపున కాపాడుకుంటూ హైదరాబాద్‌కు వచ్చింది. మేఘాలు వర్షించే వర్షపాతం ఎక్కువనే ఆ రాష్ట్రానికి మేఘాలయా అని పేరు. కానీ ఆ తల్లి హర్షానికి కావాల్సింది పాల వర్షం. ఎందరో తల్లులు ఇచ్చే కారుణ్య వర్షం. అది హైదరాబాద్‌లో కురుస్తుందని ఆ అమ్మకు ఎవరో చెప్పారు. ప్రాణాలు నిలుస్తాయంటే పదహారువందల కిలోమీటర్లు ఒక లెక్కా? ఇప్పుడా బాబు ప్రమాదం నుంచి పూర్తిగా బయటపడ్డాడు. ఎందరో తల్లుల పాల రక్ష, సొంత తల్లి మురిపాల రక్షతో ఇకపై సురక్షితంగా ఉంటాడు.
ఎలా ఉంటుందీ తల్లి పాల బ్యాంకు?
పాలు సరిగా తల్లులకు వరప్రదాయని లాంటి ఈ బ్యాంకులో అనేక మంది తల్లుల పాలు సేకరిస్తారు. ముందుగా తల్లి పాలను చిన్న చిన్న స్టీల్ గిన్నెల్లో సేకరిస్తారు. (తల్లిపాలలో శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్)తో పాటు సుదీర్ఘమైన గొలుసుల్లా ఉండే లాంగ్ చైన్ పాలీఆన్‌శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ కూడా ఉంటాయి. అందుకే ప్లాస్టిక్ సీసాల్లో తల్లిపాలు పోసి వాటిని పట్టే సందర్భాల్లో ఆ ప్లాస్టిక్‌కు ఈ కొవ్వులు అక్కడక్కడా చిక్కుకుని కనిపిస్తుండం చూడవచ్చు. ప్లాస్టిక్‌కు ఇలా కొవ్వులతో అతుక్కుపోయే గుణం ఉంటుంది. కాబట్టి తల్లిపాల బ్యాంకుల్లో పాల సేకరణ అంతా స్టీల్ గిన్నెల్లోనే జరుగుతుంది). ఈ పాలను సేకరించగానే అందులో ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియా లేవనే విషయాన్ని నిర్ధారణ చేసుకోవడం కోసం స్క్రీనింగ్‌కు పంపుతారు. దీనికి ముందు వాటిని పాశ్చరైజేషన్ ప్రక్రియకు గురిచేస్తారు. (పాశ్చరైజేషన్ అంటే పాలలోని హానికారక సూక్ష్మక్రిములు, బ్యాక్టీరియాను పూర్తిగా నిర్మూలించే ప్రక్రియ). స్క్రీనింగ్‌కు పంపేముందర అమ్మల నుంచి సేకరించిన వారి వారి పాలను విడివిడిగా ఉంచుతారు. స్క్రీనింగ్ పరీక్షలో పాలలో ఎలాంటి హానికరమైన బ్యాక్టీరియా లేవని తెలిశాక... ఆ పాలను కలిపేసి, వాటిని నిల్వ ఉంచేందుకు ఒక పెద్ద ఫ్రిజ్‌లాంటి ఉపకరణంలో పెడతారు. ఈ ఫ్రిజ్‌లో ఎప్పుడూ మైనస్ 20 డిగ్రీల టెంపరేచర్ నిర్వహితమవుతుంటుంది. ఈ స్థితిలో ఉన్న పాలను మూడు నుంచి ఆర్నెల్లు కూడా నిల్వ చేసి ఉంచవచ్చు. బిడ్డకు పాలు పట్టే సమయంలో మళ్లీ వాటిని సాధారణ ఉష్ణోగ్రత వద్దకు జాగ్రత్తగా తెచ్చి బిడ్డకు పడతారు. ఇలా ఫ్రీజ్ అయిన పాలను మామూలు స్థితిలోకి తీసుకురావడాన్ని ‘థా’ అంటారు. ఇలా ‘థా’ చేయాలంటే నేరుగా వేడి చేయడమో లేదా మైక్రోఓవేన్‌పైన ఉంచడమో సరికాదు. దానికి కొన్ని మార్గదర్శకాలుంటాయి. ఒకసారి ‘థా’ చేశాక... ద్రవరూపంలోకి వచ్చిన ఆ పాలు మళ్లీ 4 నుంచి 6 గంటల పాటు తాగడానికి సురక్షితంగా ఉంటాయి.
తల్లి పాల బ్యాంకు చరిత్రను పరికిస్తే...
అసలు ముందుగా తల్లిపాల బ్యాంకు అన్న ఆలోచన ఎలా ఆవిర్భవించిందన్న చరిత్రలోకి వెళితే వివరాలు ఆసక్తికరంగా ఉంటాయి. రాజవంశాల్లోని స్త్రీలు తమ పిల్లలకు రొమ్ముపాలు తాగించేవాళ్లు కాదు. వాళ్లకు బదులు ‘దాది’ అని పిలిచే స్త్రీలు... పాలు పట్టేవారు. వాళ్లను అనుకరిస్తూ జమీందార్లు, కులీన స్త్రీలుగా తమను తాము అభివర్ణించుకునే వారు తమ హోదాను ప్రదర్శించుకోవడం కోసం ‘దాదుల’ పాలనే పట్టిస్తుండేవారు. ఆధునిక యుగంలోనూ కొంతకాలం ఇదే ట్రెండ్ కొనసాగింది. విదేశాల్లోనూ కులీన మహిళల పిల్లలకు పాలు పట్టడానికి ‘వెట్ నర్స్’లు ఉండేవారు. అయితే 20వ శతాబ్దం ఆరంభం నాటికి ఈ ‘వెట్ నర్స్’ల సంస్కృతి పూర్తిగా తగ్గిపోయింది. మొట్టమొదటి సారిగా ‘తల్లిపాల బ్యాంకు’ వియన్నాలో 1911లో అధికారికంగా ప్రారంభమైంది. ఆ తర్వాత మరొకటి బోస్టన్‌లోనూ ఏర్పాటయ్యింది. ఇక 1937లో లండన్‌లోని క్వీన్ షార్లెట్ హాస్పిటల్ ఆసుపత్రిలో తొలి తల్లిపాల బ్యాంకు రూపొందింది. దీనికి పదేళ్ల తర్వాత 1947లో యూఎస్‌ఏలో ‘విల్మింగ్‌టన్ డెలావేర్ తల్లిపాల బ్యాంకు’ మొదలైంది. కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎందుకో తల్లిపాల బ్యాంకు అన్న ధోరణి కాస్త మందగించి ‘ఫార్ములా పాలు’ మార్కెట్‌లో రాజ్యం చేశాయి. పందొమ్మిదివందల డెబ్బయిలు, ఎనభైల పడిలో మళ్లీ తల్లిపాల ప్రాధాన్యాన్ని అందరూ గుర్తెరగడం ప్రారంభించారు. ఈ క్రమంలో 1989 నవంబరు 27న ముంబైలోని ‘సియాన్ హాస్పిటల్’లో డాక్టర్ అర్మిదా ఫెర్నాండజ్ ఆధ్వర్యంలో భారత్‌లో (ఆసియాలోనే) మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు ఏర్పాటైంది. ప్రస్తుతం భారత్‌లో 10 తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి. ఇందులో ఐదు ముంబైలోనే ఉండటం విశేషం.
ఏయే పాపలకు లబ్ధి చేకూరుతుంది...?
చాలా తక్కువ బరువుతో పుట్టిన పాపలు
నెలలు పూర్తిగా నిండకుండానే పుట్టిన చిన్నారులు
తల్లులకు ఏవైనా సమస్యలు వచ్చినందు వల్ల ఆమె నుంచి దూరంగా ఉంచాల్సి వచ్చిన చిన్నారులు
ఇక కొందరు తల్లులలో రొమ్ము లోపలివైపునకు తిరిగి ఉంటుంది (ఇన్‌వర్టెడ్ నిపుల్) ఇలాంటి తల్లుల పిల్లలకూ బ్యాంకు నుంచి పాలు అందించవచ్చు
ఒక్కోసారి కొందరు కవలలకు / ముగ్గురు పిల్లలకు (ట్రిప్లెట్స్), నలుగురు చిన్నారులకు (క్వాడ్రప్లెట్స్)
జన్మనిస్తుంటారు. ఇలాంటి తల్లులకు ఊరే పాలు ఆ మొత్తం చిన్నారులకు సరిపోకపోవచ్చు. అలాంటప్పుడు బ్యాంకు పాలు బాగా ఉపయోగపడతాయి. ఇక ఎన్‌ఐసీయూ (నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో ఉన్న పిల్లలకు ఈ పాలు బాగా ఉపయోగపడతాయి.
ఫార్ములా పాలకు బదులు తల్లి పాలనే ఇంతగా సిఫార్సు చేయడానికి కారణాలు...
తల్లిపాలపై పెరిగే పిల్లలు మిగతా వారితో పోలిస్తే చాలా ఆరోగ్యంగా ఉంటారు. భౌతికంగా, మానసికంగా ఆరోగ్యంగా ఎదుగుతారు. రోగాలను స్వాభావికంగానే సమర్థంగా ఎదుర్కొంటారు. తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉన్నా... మన అధ్యయనానికి అందేవి సుమారు 400 రకాల వేర్వేరు పోషకాలు ఉంటాయి. వాటన్నింటినీ కృత్రిమంగా తయారు చేయడం అస్సలు సాధ్యం కాదు. కృత్రిమంగా తయారుచేసే ఫార్ములా పాలేవీ తల్లిపాలకు అస్సలు సాటిరావు. ఇలా తల్లిపాలపై పెరిగే పిల్లల్లో రోగనిరోధకశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు చాలా ఆలస్యమవుతాయి. ఇక తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి...
జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. కానీ ఫార్ములా పాలు / పోతపాలు వంటివి జీర్ణకోశ ఇబ్బందులను కలిగిస్తాయి.
ఆస్తమా : తల్లిపాలు బిడ్డకు సరిపడకపోవడం అంటూ ఉండదు. కానీ పోతపాలుగా ఇచ్చే యానిమల్ మిల్క్ గానీ లేదా ఫార్ములా మిల్క్‌గాని చాలావరకు బిడ్డకు సరిపడకపోవడానికి అవకాశాలు ఎక్కువ. అందుకే పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. వీటితో పాటు తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ.
తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. పోతపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడే స్థూలకాయం వచ్చే అవకాశాలు ఎక్కువ.
తల్లిపాలపై పెరిగే పిల్లల్లో చిన్నప్పుడు క్యాన్సర్లు (చైల్డ్‌హుడ్ క్యాన్సర్లు) వచ్చే అవకాశాలు చాలా తక్కువ.
నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే.
ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా తక్కువ.
పాలు ప్రదానం చేసే తల్లికీ లాభమే...
నిజానికి పాలు ఎక్కువగా స్రవిస్తున్న తల్లికి పాలను బ్యాంకుకు ప్రదానం చేయడం విషయంలో కొన్ని అపోహలు కలగవచ్చు. ఉదాహరణకు... తాను పాలను బ్యాంకుకు ఇవ్వడం వల్ల తనకు పడే పాలు తన బిడ్డకే సరిపోకపోవచ్చేమో అనే సందేహం కలగడం చాలా సాధారణం. కానీ ప్రకృతిపరంగా తల్లి నుంచి పాల సేకరణ ఎంత ఎక్కువ జరిగితే పాలు ఊరడం కూడా అంతే ఎక్కువగా జరుగుతుంది. అంటే పాలుగారే పాపాయి పాలు ఊరే తల్లి పాలను ఇస్తున్న కొద్దీ పాల ఊట పెరుగుతుందన్న మాట. ఇలా పాలు పట్టడం వల్ల లేదా ప్రదానం చేయడం వల్ల తల్లికీ ఎన్నో ప్రయోజనాలు చేకూరతాయి. పాలు పట్టడం / ఇంకా మిగిలితే పాలను బ్యాంకుకు ప్రదానం చేయడం వల్ల తల్లికి ఒనగూరే ప్రయోజనాలలో మచ్చుకు కొన్ని...
పాలిచ్చే తల్లుల్లో ఆక్సిటోసిస్ అనే రసాయనం స్రవించి అది ప్రసవం తర్వాత అయ్యే రక్తస్రావాన్ని బాగా తగ్గిస్తుంది.
పాలు బాగా ఊరే తల్లిలో ప్రసవం తర్వాత గర్భసంచి ఆరోగ్యకరంగా ముడుచుకుపోతుంది.
పాలిచ్చే తల్లి స్వాభావిక మార్గంలో బరువు తగ్గుతుంది. అంటే పాలు ఇస్తున్నంత కాలం తల్లులు లావెక్కరు. ఇది వారిలోని సౌందర్యాన్ని ఇనుమడింపజేసే అంశం. ఒక్క సౌందర్యప్రయోజనమేనా... కాదు... ఇలా బరువు పెరగకపోవడం వల్ల స్థూలకాయం రిస్క్ ఫ్యాక్టర్లుగా గల అనేక జబ్బులు రావు.
పాలిచ్చే తల్లులకు అనేక రకాల క్యాన్సర్ల నుంచి రక్షణ ఉంటుంది.
పాలిచ్చే తల్లులకు డయాబెటిస్ వచ్చే అవకాశాలు తక్కువ.
పాలివ్వడం వల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు, మానసిక రుగ్మతలకు గురయ్యే అవకాశాలు చాలా తక్కువ.
పాలిచ్చే తల్లుల్లో మేను ప్రకాశవంతంగా, ఆకర్షణీయంగా మారుతుంది.
తల్లిపాలలో ఉండే కొన్ని ప్రధానమైన అంశాలివి...
తల్లిపాలలో ఎక్కువ భాగం నీళ్లే ఉంటాయి. ఇక ప్రోటీన్ల విషయానికి వస్తే 100 మి.లీ పాలలో 1 గ్రాము ప్రోటీన్లు ఉంటాయి. అలాగే 100 ఎంఎల్ పరిమాణంలో 3.5 గ్రాముల కొవ్వులు, ప్రతి 100 ఎంఎల్‌కూ 7 గ్రాముల ల్యాక్టోజ్ ప్రోటీన్లు ఉంటాయి. అవి చాలా తేలిగ్గా జీర్ణమవుతాయి. ఇక కొవ్వులు కూడా చాలా పొడవైన ఫ్యాటీ యాసిడ్ చైన్ల రూపంలో ఉండి మెదడుకు మేలు చేసే పోషకాలతో ఉంటాయి. ల్యాక్టోజ్‌లో గెలాక్టొసైడ్ అనే పోషకం మెదడు ఎదుగుదలకు బాగా ఉపయోగపడుతుంది.
తల్లిపాలకు దీటుగా ఫార్ములాపాలను తయారు చేయాలంటే అది అసాధ్యం. ఒకవేళ సుసాధ్యం చేయాలన్నా ఒక్క బిడ్డ పెరగడానికి కావాల్సిన పాలకే కొన్ని కోట్లాది రూపాయలు అవసరమవుతాయి. అంతటి విలువైన పాలను ప్రకృతి ఉచితంగా మనకు ప్రసాదిస్తుందన్నమాట. అందుకే వాటిని వృథా చేయకండి. ఈ అవగాహన అందరికీ పెరిగితే సమాజానికి ఎంతో మేలు.
తల్లిపాల బ్యాంకు నిర్మాణం/స్వరూపం...
ఈ తల్లిపాల బ్యాంకు పిల్లల ఆసుపత్రిలోని ‘నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్’కు అనుబంధంగా ఉంటుంది. ఇందులో కేవలం బ్యాంకు వ్యవహారాలను చూసుకోవడం కోసం ప్రత్యేకంగా ల్యాక్టేషన్ మేనేజ్‌మెంట్ నర్స్‌లు/ల్యాక్టేషన్ కన్సల్టెంట్స్ ఉంటారు. వీళ్లతో పాటు పాల నాణ్యతను పరీక్షించేందుకు మైక్రోబయాలజిస్ట్, బయోకెమిస్ట్, దీని ప్రాముఖ్యతను పాలు ఎక్కువగా స్రవించే తల్లులకూ, పాలు రాని తల్లులకూ వివరించేందుకు ల్యాక్టేషన్ కౌన్సెలర్స్ ఉంటారు. సాధారణంగా సమాజసేవ చేసే దృక్పథంగా ఉన్న స్వచ్ఛంద సేవకులు ఈ కౌన్సెలింగ్ బాధ్యతను నిర్వహిస్తుంటారు.
పాల ప్రదానం కోసం ఎలాంటి తల్లులు అర్హులు
పాలు బాగా పడే ఏ తల్లి అయినా పాలను బ్యాంకులో నిల్వచేయవచ్చు. కొందరు తల్లులు తమ బిడ్డే సరిగా పాలు తాగని సందర్భాల్లో తమకు పడే పాలను తీసి నిల్వ ఉంచుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో ఏ బిడ్డకు ఆ తల్లి పాలనే ఇస్తుంటారు. ఇంకా ఎక్కువగా పాలు నిల్వ అవుతుంటే వాటిని పాలు రాని తల్లుల బిడ్డలకు ఇస్తుంటారు. సాధారణంగా పాలను ప్రదానం చేసే తల్లులకు హెచ్‌ఐవీ, హెచ్‌బీఎస్‌ఏజీ, ఇతరత్రా జబ్బులేవీ లేకుండా ఉండేలా పరీక్షలు చేస్తుంటారు. అయితే ఇటీవల గర్భం ధరించగానే కాబోయే తల్లులకే ఈ పరీక్షలన్నీ నిర్వహిస్తుంటారు కాబట్టి చాలావరకు తల్లులకు ఎలాంటి సమస్యలూ ఉండవు. ఒకవేళ ముందుగానే కాబోయే తల్లులకు గానీ లేదా పాలను ప్రదానం చేయడానికి ముందుకు వచ్చిన తల్లులకు గానీ ఏవైనా వ్యాధులు ఉన్నట్లు తేలితే... వారికి తదనుగుణంగా చికిత్స చేయడమూ సాధ్యమవుతుంది.
పాలు ప్రదానం చేయాల్సిన తల్లికి ఉండాల్సిన ప్రధాన లక్షణాలు
తల్లి తన ఇష్టపూర్తిగానే పాలను బ్యాంకుకు ఇవ్వాలి.
తల్లి పూర్తిగా ఆరోగ్యకరంగా ఉండాలి.
తల్లికి నిర్వహించే రక్తపరీక్షల్లో ఆమెకు హీమోగ్లోబిన్ కనీసం 11 శాతం ఉండాలి.
హెచ్‌ఐవీ/హెచ్‌బీఎస్‌ఏజీ/వీడీఆర్‌ఎల్/టీబీ వంటి వ్యాధులేవీ లేకుండా ఉండాలి.
మీరు అర్హులో కాదో తెలియడం ఎలా...
కొందరికి పాలు ప్రదానం చేయాలని ఉండవచ్చు. కానీ తమ పాలు తమ బిడ్డకే సరిపోతున్నాయా లేదా అన్న అంశం వాళ్లకు తెలియదు. అలాంటప్పుడు అందుకే వాళ్లు పాలప్రదానం చేయడానికి సందేహిస్తారు. అయితే అది తెలుసుకోవడం చాలా సులభమే. బిడ్డ పాలు తాగాక కూడా రొమ్ము నుంచి ధారగా పాలు స్రవిస్తూ ఉంటే వాళ్లు పాలు ప్రదానం చేయడానికి పూర్తిగా అర్హులు. చాలా హాస్పిటళ్లలో ఇలా పాలు స్రవించే తల్లుల పాలు వృథాగా నేలపాలు అవుతుంటాయి. అవి ఇలా బ్యాంకుకు చేరి, పాలు సరిగా పడని తల్లుల చిన్నారుల కడుపులు నింపితే ఎన్నో మరణాలను నివారించవచ్చు. మనదేశంలో ఇటీవల ఆసుపత్రుల్లో ప్రసవాల తర్వాత శిశుమరణాల రేటు గణనీయంగా తగ్గినా... ఇంకా ప్రతి ఐదుగురు శిశువుల్లో ఒకరు తల్లి పాల లేమితోనే కన్నుమూస్తున్నారు. తక్కువ బరువుతో పుట్టిన వీళ్లకు ఎలాంటి చికిత్సా అవసరం లేదు. కేవలం తల్లిపాలు దొరికితే చాలు... రెండున్నర కిలోల బరువును పుంజుకున్న తర్వాత వాళ్లు మృత్యువు నీడనుంచి పూర్తిగా బయటపడినట్లే. అందుకే తల్లిపాల బ్యాంకుకు పాలను ప్రదానం చేయడం, మరిన్ని తల్లిపాల బ్యాంకులు నెలకొల్పేలా సమాజంలో అవగాహన పెంపొందడం చాలా ముఖ్యమైన విషయాలు.
మీ బిడ్డకు మీ పాలే పట్టండి...
మీరు పాలు తాగే పసిపాపకు తల్లా? సౌందర్యకాంక్షతో ఆ చిన్నారికి పాలుపట్టడం లేదా? అయితే వెంటనే మీ పాపకు మీ రొమ్ముపాలే పట్టించండి. ఎందుకంటే బిడ్డకు తల్లి పాలు పట్టకపోవడం వల్ల తల్లికీ చాలారకాలుగా అనర్థాలు చేకూరే అవకాశాలున్నాయి. వాటిలో కొన్ని...
బిడ్డకు పాలు పట్టని తల్లులకు మూత్రకోశ ఇన్ఫెక్షన్స్ (యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్) వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
మెనోపాజ్ పూర్తయ్యాక (లేదా కొన్ని సందర్భాల్లో మెనోపాజ్ రాకముందే) చాలా రకాల క్యాన్సర్లు, ముఖ్యంగా ఒవేరియన్ క్యాన్సర్‌కు అవకాశాలు ఎక్కువ.
ఎముకలు పెళుసుగా మారి, తేలిగ్గా విరిగిపోయే ఆస్టియోపోరోసిస్ జబ్బు వచ్చేందుకు అవకాశాలు చాలా చాలా ఎక్కువ.
భవిష్య ప్రణాళిక...
భారత్‌లోని బ్రెస్ట్‌ఫీడింగ్ ప్రమోషన్ నెట్‌వర్క్ సెంట్రల్ కో-ఆర్డినేటర్ అయిన అరుణ్ గుప్తా ఒక కలగంటున్నారు. ఢిల్లీలో నెలకొని ఉన్న ఈ స్వచ్ఛంద సంస్థ అధినేత అయిన ఆయన ప్రణాళిక ఏమిటంటే... బ్రెజిల్‌లో లాగే (అక్కడ ప్రపంచంలో అతి ఎక్కువగా 212 తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి) ఇక్కడ మన దేశంలోనూ ఏర్పడి... సుదూర ప్రాంతంలో ఉన్న తల్లి కూడా పోస్ట్‌మెన్ ద్వారా కూడా తల్లిపాలను తెప్పించుకునేలా నెట్‌వర్క్ ఏర్పడాలన్నది ఆయన అభిలాష.
పాలిచ్చే తల్లికి కొన్ని సూచనలు
మీరు పాలిచ్చే బిడ్డ తల్లా? అయితే ఈ సూచనలు పాటించండి. ఇవి ఇటు తల్లికీ, అటు బిడ్డకూ మేలు చేస్తాయి.
బిడ్డకు తల్లిపాలు ఇచ్చే మహిళ బలవర్థకమైన ఆహారాన్ని తీసుకోవాలి.
తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా మారుతూ కొత్త రుచిని సంతరించుకుంటుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు.
పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కవ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా కట్టడి చేస్తుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. తల్లికి ఎక్కువగా పాలు ఊరి, బిడ్డకు సరిపడా పాలు పడాలంటే నీళ్లు ఎక్కువగా తాగాల్సిందే. అందుకే దాహమైనా కాకపోయినా తల్లి నీళ్లు తాగుతుండాలి. తల్లి ఎన్ని నీళ్లు తాగాలంటే... ఆమెకు మూత్రం పసుపు రంగులో రాకుండా ఉండేట్లుగా చూసుకోవాలి.
తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలచందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్-సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి.
తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి.
క్యాల్షియమ్ బాగా సమకూరేలా బాగా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటి ఆహార పదార్థాలు పుష్కలంగా తీసుకోవాలి.
విటమిన్ బి12తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్-డి సప్లిమెంట్స్ మాత్రల రూపంలో తీసుకోవాలి.
పరిశోధన
బిడ్డకు పాలిస్తే... గుండె జబ్బులు దూరం!
బిడ్డకు కనీసం మూడు నెలలపాటు తల్లిపాలిస్తే అది బిడ్డకే కాక తల్లికి కూడా మేలు చేస్తుందని మరోసారి రుజువైంది. వాషింగ్టన్ యూనివర్శిటీకి చెందిన ప్రొఫెసర్ మోల్లీ మెట్‌జర్ నిర్వహించిన తాజా పరిశోధనలో... బిడ్డకు తల్లిపాలివ్వడం వల్ల ఆ తల్లి దీర్ఘకాలం ఆరోగ్యంగా ఉంటుందని తేలింది. వీరికి క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ కారణంగా వచ్చే మధుమేహం వంటి మెటబాలిజమ్ సమస్యలు దూరంగా ఉంటాయి. అలాగే బిడ్డ పాలు తాగేటప్పుడు విడుదలయ్యే సిఆర్‌పి (కో-రియాక్టివ్ ప్రొటీన్) రక్తనాళాల్లో కొవ్వు పేరుకోకుండా నిరోధిస్తుంది. గుండె సంబంధ వ్యాధులను నివారిస్తుంది. మోల్లీ పరిశోధన వివరాలు రాయల్ సొసైటీ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.
ఆరోగ్య ‘ఫలాలు’
జామపండులో...
జామపండులో కొవ్వు, కేలరీలు తక్కువ, పీచు ఎక్కువ. ‘ఎ, బి కాంప్లెక్స్, సి, ఇ, కె విటమిన్‌లు, ఖనిజ లవణాలు, యాంటీ ఆక్సిడెంట్‌లు, పాలీఫెనోలిక్, ఫ్లేవనాయిడ్‌లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తులు, నోటి క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్‌లను నివారిస్తాయి. వార్ధక్యాన్ని దూరం చేస్తాయి.
జామపండు తింటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
ఇందులోని పీచు జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచి పెద్దపేగులోని మ్యూకస్‌ను కాపాడుతుంది. దేహం విసర్జించాల్సిన వ్యర్థాలను, క్యాన్సర్ కారక రసాయనాలను త్వరగా బయటకు పంపుతుంది వందగ్రాముల జామపండులో ‘సి’ విటమిన్ 228 మి.గ్రా.లు ఉంటుంది అతినీల లోహిత కిరణాల బారి నుంచి చర్మాన్ని కాపాడడంలో తెల్ల జామపండు కంటే గులాబీరంగు జామపండు ఎక్కువగా ఉపయోగపడుతుంది.
- ఉషశ్రీ, కేర్ హాస్పిటల్
పాలిచ్చే తల్లి తీసుకోకూడని ఆహారాలు
కెఫిన్ ఉండే పదార్థాలు: పాలిచ్చే సమయంలో కెఫిన్ పుష్కలంగా ఉండే కాఫీలు, కూల్‌డ్రింక్స్ తీసుకోకపోవడమే మంచిది. ఒకవేళ తీసుకోవాలనిపిస్తే మాత్రం చాలా పరిమితంగా రోజూ రెండు కప్పులకు మించనివ్వవద్దు.
మసాలాలు: పాలిచ్చే తల్లి మసాలాలను చాలా తక్కువగా తీసుకోవాలి.
పుష్కలమైన పాల కోసం మంచి సూచనలు: ఒక్కమాటలో చెప్పాలంటే తల్లి సంపూర్ణంగా పోషకాలు లభించే సంపూర్ణాహారం తీసుకోవాలి. ఇందులో పండ్లు, కూరగాయలు, పప్పులు... ఇవన్నీ ఉండాలి. తల్లికి ఏదైనా పడని ఆహారం ఉంటే దానికి దూరంగా ఉండాలి. ఎందుకంటే అది తల్లిపై ఎలాంటి ప్రభావం చూపుతుందో, బిడ్డలోనూ అలాంటి ప్రభవమే చూపే అవకాశం ఉంది. వెల్లుల్లి వాసన తల్లుల్లో పాలను పుష్కలంగా పడేలా చేస్తుంది. కానీ తల్లులు కేవలం అన్నం, వెల్లుల్లి వంటి వాటికే పరిమితం కాకుండా, అన్ని రకాల ఆహారాలనూ తినాలి. ద్రవాహారాన్ని పుష్కలంగా తీసుకోవాలి. అప్పుడే బిడ్డకూ సరిగా పాలు పడతాయి.
- నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి