తల్లిపాల వారోత్సవాలు: ఆసియాలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు ఏదంటే? | BreastFeeding Week Celebrations Family Special Story Sakshi News | Sakshi
Sakshi News home page

తల్లిపాల వారోత్సవాలు: ఆసియాలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు ఏదంటే?

Published Wed, Aug 7 2024 11:25 AM | Last Updated on Wed, Aug 7 2024 11:45 AM

BreastFeeding Week Celebrations Family Special Story Sakshi News

అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైనది అన్నదానం అంటారు. అది పెద్దలకు. మరి చంటి పిల్లలకు? తల్లిపాలు తాగే వీలు లేక పోతపాలు పడక ఆకలితో అల్లాడే చిన్నారి కూనల కోసం తల్లిపాలను దానం ఇవ్వడం ఒక బాధ్యత. తల్లిపాలు పిల్లలకు జీవశక్తి. కాని అవి అందరికీ అందవు. నేటికీ దేశంలో తల్లిపాల బ్యాంకులు అతి తక్కువ ఉన్నాయి. ఆరోగ్యకరమైన బాలింతలు తమ పిల్లలకు సరిపడా పాలు ఇచ్చాక ఇంకా ఎక్కువ ఉంటే అవి దానం చేసే వీలు కొన్నిచోట్ల ఉంది. అక్కడి నుంచి పాలు తెచ్చుకుని తమ పిల్లలకు తాగించే వీలు తల్లులకు ఉంది. ‘తల్లిపాల వారోత్సవాల’ సందర్భంగా తల్లిపాల బ్యాంకుల గురించి ఒక అవగాహన.

పుట్టిన వెంటనే పసిబిడ్డకు తల్లిపాలు నోటికి అందితేప్రాణం పుంజుకుంటుంది. కాని కొందరు తల్లులు అనేక కారణాల రీత్యా బిడ్డకు చనుబాలు ఇవ్వరు. ఇలాంటి స్థితి నుంచి తల్లులను సొంత బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించే కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. తల్లిపాల గురించి అవగాహన కల్పించడానికి కేంద్రం ‘మదర్స్‌ అబ్సల్యూట్‌’ ఎఫెక్షన్‌ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ప్రసవం తర్వాత కొందరు తల్లులకు పాలు పడవు. లేదా అనారోగ్య కారణాల రీత్యా పాలు ఇచ్చే వీలు ఉండదు. కాని పిల్లలు తల్లిపాలు తాగే స్థితిలో ఉంటారు. ఇలాంటి వారి కోసం తల్లిపాల బ్యాంకులు కీలకంగా మారాయి. కాని ఇవి ఉండాల్సినన్ని లేవు. దేశవ్యాప్తంగా ఇప్పటికి కేవలం 90 తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు సిద్ధిపేట, ఖమ్మంలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పాల బ్యాంకులు ఉన్నాయి. పాల బ్యాంకులకు ఇతర రాష్ట్రాల నుంచి తల్లిపాలను పంపడానికి ‘సుదేనా హెల్త్‌ ΄ûండేషన్‌’ కృషి చేస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్‌ ఆసుపత్రులు కూడా తల్లిపాలను నిల్వ చేసి, శిశువులకు అందజేస్తున్నాయి.

ఆసియాలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు..
ముంబైలోని సియోన్‌ హాస్పిటల్‌లో హ్యూమన్‌ మిల్క్‌ బ్యాంక్‌ను 1989లోప్రారంభించారు. ఇది ఆసియాలో మొట్టమొదటి బ్రెస్ట్‌ మిల్క్‌ బ్యాంకు. ఈ ఐదేళ్లలో 43,412 మంది తల్లుల నుండి పాలను విరాళంగా ΄÷ందింది. 10,523 మందికి పైగా నవజాత శిశువులప్రాణాలను రక్షించే పాలను అందించింది. 1989లో నియోనాటాలజీ విభాగం అధిపతి డాక్టర్‌ జయశ్రీ మోంద్కర్‌ చొరవతో ఈ పాల బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రతియేటా 10 వేల నుండి 12 వేల మంది శిశువులు పుడితే వీరిలో 1,500 నుండి 2,000 మంది బ్యాంకు నుండి పాలు ΄÷ందుతున్నారు. సియోన్‌ హాస్పిటల్‌ మిల్క్‌బ్యాంక్‌ గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, డామన్, డయ్యూతో పాటు మహారాష్ట్రలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రులలోని పాల బ్యాంకుల ఏర్పాటుకు మద్దతు ఇస్తుంది.

సంప్రదించి.. పాలు ఇవ్వచ్చు..
తల్లికి ఆరోగ్య సమస్యలు ఉంటే వారి పిల్లలకు మరో తల్లి పాలు అవసరం అవుతాయి. వీటిని మేం సేకరించి, పాలను స్టెరిలైజ్‌ చేసి, ఫ్రీజర్‌లో నిల్వ ఉంచుతాం. శిశువులకు అవసరం అయినప్పుడు ఫ్రీజర్‌ నుంచి తీసి, రూమ్‌ టెంపరేచర్‌లోకి వచ్చాక ఇస్తాం. హైదరాబాద్‌ నీలోఫర్‌ ఆసుపత్రిలో 2017 నుంచి సుషేన హెల్త్‌ ఫౌండేషన్‌ నెలల నిండకుండా పుట్టిన శిశువులకు తల్లి పాలను అందజేసే ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాధారణంగా ఇక్కడ నెలకు వెయ్యి ప్రసవాలు అవుతుంటాయి. నెలలు నిండకుండా పుట్టినా, తల్లులకు శస్త్రచికిత్స వంటి సమస్యలు ఉంటే ఆ శిశువుకు ఈ పాల బ్యాంక్‌ నుంచి పాలను అందిస్తాం. ఎవరైనా తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా అదనపు పాలను మా బ్యాంక్‌ను సంప్రదించి, ఇవ్వచ్చు. అందుకు తగిన పరీక్షలు చేసి, పాలను ఎలా సేకరించి, ఇవ్వాలో అవగాహన కల్పిస్తాం.


– డా.ఉషారాణి తోట, ప్రొఫెసర్‌ ఆఫ్‌ పిడియాట్రిక్స్, నీలోఫర్‌ హాస్పిటల్‌

బ్లడ్‌ బ్యాంకులను పోలిన విధంగా! 
రక్తదానం చేసినట్టుగానే నవజాత శిశువులప్రాణాలను రక్షించడానికి తల్లిపాలను దానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు పంపింగ్‌ మెషీన్లను ఉపయోగించి లేదా చేతితో అదనపు పాలను సేకరిస్తారు. ఆ తర్వాత వారికి సంబంధం లేని నవజాత శిశువుకు విరాళంగా ఆ పాలను అందిస్తారు.

  • హెచ్‌ఐవి, హెపటైటిస్, లైంగిక వ్యాధులు లేని తల్లుల నుంచి మాత్రమే టెస్ట్‌ రిపోర్ట్స్‌ ఆధారంగా పాల సేకరణ చేస్తారు. అందుకని తల్లులు తమ ఆరోగ్య నివేదికలను ముందుగా పాల బ్యాంకుకు ఇవ్వాలి.

  • ఆరోగ్యకరమైన తల్లులకు తమ పాలు దానంగా ఇవ్వాలని ఉన్నా కుటుంబం అంగీకరించకపోవచ్చు. కుటుంబంప్రోత్సహిస్తే ఎందరో శిశువులకు మేలు జరుగుతుంది.

  • తల్లి పాలను సేకరించి, బ్యాంకుకు ఇచ్చిన తర్వాత, వాటిలో ఏదైనా కలుషితం ఉన్నట్టు తెలిస్తే వెంటనే దాతకు తెలియజేస్తారు. దీని వల్ల ఆ తల్లి ఆరోగ్యస్థితి కూడా మెరుగుపడుతుంది.

  • తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ధాత్రి మదర్స్‌ మిల్క్‌ బ్యాంక్‌ ఉన్న హాస్పిటల్స్, హైదరాబాద్‌లోని నీలోఫర్‌ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇఎస్‌ఐ హాస్పిటల్, మహబూబ్‌నగర్‌లోని గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్, కాకినాడలోని ప్రభుత్వ హాస్పిటల్, అమలాపురంలోని డిస్ట్రిక్ట్‌ హాస్పిటల్‌ని సంప్రదించి తల్లులు తమ పాలను దానంగా ఇవ్వచ్చు. – నిర్మలారెడ్డి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement